అవేమీ 8mm తపంచాలు కావు… 0.32 రివాల్వర్లు కానే కావు… 9mm పిస్టల్స్ అంతకన్నా కావు… బొడ్లో దోపుకుని లేదా నడుము వెనుక భాగాన తోసేసి ఎంచక్కా కనిపించకుండా వెళ్లిపోవడానికి. ఒకటేమో AK-47, మరొకటేమో కార్బన్ తుపాకులు. AK-47 లో 30, కార్బన్ లో 20 తూటాల సామర్థ్యం గల మ్యాగ్జిన్లు సహా సుమారు ఐదు కిలోల బరువు గల ఆయుధాలు అవి. ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి AK-47, కార్బన్ తుపాకులను ఎవరికీ కనిపించకుండా తస్కరించడం, రవాణా చేయడం కష్టతరమే. ఎందుకంటే అవేమీ షార్ట్ వెపన్స్ కావు కాబట్టి. తుపాకీ వినియోగంలో నిపుణులైతే తప్ప కనీసం ఏ పార్ట్ కు ఆ పార్ట్ విడదీసి ప్యాక్ చేయడం కూడా కుదరదు.
కానీ సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ మండలం అక్కన్నపేటలో కాల్పుల ఉదంతానికి పాల్పడిన సదానందం అనే నిందితుని నుంచి రెండు భారీ తుపాకులను స్వాధీనం చేసుకున్న ఘటన రాష్ట్ర పోలీసు శాఖలో హాట్ టాపిక్ గా మారింది. ఈ రెండు తుపాకుల మాయం ఘటనలో పోలీసు అధికారుల మధ్య నడిచిన పాత వివాదాన్ని కాసేపు పక్కనపెడితే… అసలు AK-47, కార్బన్ వంటి అత్యంత అధునాతన, భారీ ఆయుధాలను సదానందం ఎలా తస్కరించడానే అంశమే ప్రస్తుతం తీవ్ర చర్చకు దారి తీస్తోంది.
పోలీసు శాఖలో ఆయుధాల నిర్వహణ, భద్రతకు సంబంధించి ఓ ప్రక్రియ ఉంటుంది. దీన్నే ‘బెల్ ఆఫ్ ఆర్మ్స్’ గా వ్యవహరిస్తుంటారు. ఆయుధాల నిర్వహణకు సంబంధించిన ‘కీ’ సంబంధిత స్టేషన్ హౌజ్ ఆఫీసర్ ఆధీనంలోనే ఉంటుంది. ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకు దైనందిన విధినిర్వహణలో భాగంగా ‘జీడీ వ్రాయుట ప్రారంభించి.. ప్రభుత్వ ఆస్తులు, తుపాకులు, తూటాలకు సంబంధించి బెల్ ఆఫ్ ఆర్మ్స్ తనిఖీ చేయగా, అన్నీ సరిగ్గానే ఉన్నాయి.’ అని రాస్తుంటారు. హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ లోనూ తుపాకులు మాయమయ్యాక రెండు నెలలపాటు ఇలాగే బెల్ ఆఫ్ ఆర్మ్స్ ప్రక్రియను నిర్వహించి, అన్నీ సరిగ్గానే ఉన్నాయని రాసినట్లు తెలుస్తోంది. కానీ రెండు నెలల అనంతరమే AK-47, కార్బన్ తుపాకులు మిస్సయినట్లు గుర్తించారన్నది మరో కథనం.
సాధారణంగా పోలీసు శాఖలో ఓ తూటా మిస్సయితేనే సంబంధిత ఉద్యోగిని సస్పెండ్ చేస్తుంటారు. కానీ హుస్నాబాద్ ఠాణాకు చెందిన AK-47, కార్బన్ తుపాకులు మాయమైన ఘటనలో గన్ మెన్ గా వ్యవహరించిన ఓ సాధారణ కానిస్టేబుల్ పై మాత్రమే చర్య తీసుకున్నారనే వాదన కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే అనేక సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. తెలంగాణా సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గల సిద్ధిపేట జిల్లాలో మూడేళ్ల క్రితం AK-47, కార్బన్ వంటి ఆయుధాలు మాయమైతే ఇన్నాళ్లపాటు ఇంటలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ వంటి విభాగాలతోపాటు శాంతిభద్రతలను పర్యవేక్షించే పోలీసులు ఏం చేస్తున్నారనే ప్రశ్న రేకెత్తుతోంది.
కొందరు పోలీసు అధికారులతో సన్నిహిత సంబంధాలు గల సదానందం పోలీస్ స్టేషన్ నుంచే ఆయా తుపాకులను ఎత్తుకువెళ్లాడనే వాదన కూడా వినిపిస్తోంది. ప్యాంటు జేబులోనో, నడుము వెనుక భాగాన్నో దోపుకునే అవకాశమే లేని ఆయా భారీ ఆయుధాలను సదానందం ఏకంగా పోలీస్ స్టేషన్ నుంచి తీసుకువెళ్లడం ఎలా సాధ్యమైందనే ప్రశ్నలు కూడా ఉత్నన్నమవుతున్నాయి. ఓ వివాదంలో కాల్పుల ఘటన కారణంగా మాత్రమే సదానందం వద్ద గల ఈ రెండు తుపాకులు లభ్యం కావడం గమనార్హం. కాల్పుల సంఘటన జరగకపోతే ఆయుధాల పరిస్థితి ఏమిటన్నది సమాధానంలేని ప్రశ్నగానే మిగిలిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మొత్తంగా ఈ తుపాకుల చోరీ ఘటన పోలీసులు తమ ఠాణాలో ఉండగానే జరిగిందా? ఇదే నిజమైతే సదానందానికి అది ఎలా సాధ్యమైంది? ఇవీ అసలు ప్రశ్నలు. చేతికి చిక్కిన నిందితున్ని పోలీసు ఉన్నతాధికారులు ఇంటరాగేషన్ చేస్తున్నారట. సీన్ రీ-కన్ స్ట్రక్షన్ కూడా చేస్తున్నారట. ఏం తేలుతుందో వేచి చూడాలి మరి.