తెలుగు రాష్ట్రాల మధ్య నేటి రాత్రి నుంచే అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య లాక్ డౌన్ మొదటి రోజు నుంచి నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులు నేటి రాత్రి నుంచి రాకపోకలను ప్రారంభించేందుకు సర్వం సిద్ధమైంది.
ఈ మేరకు బస్సులను బయటకు తీసి, రాష్ట్రాల సరిహద్దులను దాటించేందుకు సిద్ధంగా ఉండాలని, తిరుపతి, విశాఖపట్నం, కర్నూలు రూట్లలో బస్సులను తిప్పాలని టీఎస్ ఆర్టీసీకి ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందినట్టు తెలుస్తోంది.
మరోవైపు ఒంగోలు, నెల్లూరు, కడప, చిత్తూరు, రాజమండ్రి, విజయవాడ తదితర ప్రాంతాల నుంచి హైదరాబాద్ కు వెళ్లే బస్సులను సిద్ధం చేయాలని ఏపీఎస్ ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు అందినట్టు సమాచారం. ఈ మధ్యాహ్నం ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారుల మధ్య జరిగిన ఒప్పందంపై సంతకాలు జరిగిన మరుక్షణమే అన్ని రకాల బస్సులను డిపోల నుంచి బయటకు తీసుకుని వచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇప్పటికే 1.61 లక్షల కిలోమీటర్లను తగ్గించుకునేందుకు ఏపీఎస్ ఆర్టీసీ సిద్ధపడిన సంగతి తెలిసిందే. ఇక సోమవారం రాత్రికే బస్సులను నడపనున్నామని ఏపీఎస్ ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఈ మేరకు డిపోల మేనేజర్లకు సమాచారాన్ని పంపించామన్నారు. బస్సులు నడవడం ప్రారంభమైన వెంటనే ఆన్ లైన్ రిజర్వేషన్ సౌకర్యాన్ని కూడా ప్రారంభించనున్నట్టు ఆయన వెల్లడించారు.