తెలంగాణాలో వెలమ సామాజిక వర్గం విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరించే వైఖరి ఏమిటి? అమలు చేసే విధానం ఏమిటి? పాటించే పద్ధతి ఏమిటి? పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వెలమ సామాజిక వర్గంలో తలెత్తుతున్న ప్రశ్నలివి. పదేళ్లపాటు రాష్ట్రంలో అధికారాన్ని చెలాయించిన వెలమ సామాజిక వర్గంపై కాంగ్రెస్ పార్టీ గుర్రుగా ఉందా? లేక సానుకూల వైఖరినే అవలంభించబోతున్నదా? అనే అంశాలపై భిన్న చర్చ జరుగుతోంది. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు, ఆ తర్వాత కాంగ్రెస్ విషయంలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అనుసరించిన విధానం, వైఖరి ఎలా ఉన్నప్పటికీ, ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వెలమ సామాజికవర్గంపై ఏ స్టాండ్ తీసుకోబోతున్నదనే విషయం హాట్ టాపిక్ గా మారింది. కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీకి ఏదేని కోపం ఉన్నట్లయితే దాని ప్రభావం మొత్తం వెలమ సామాజికవర్గంపై పడనుందా? అనే పాయింట్ ప్రామాణికంగా ఈ రాజకీయ చర్చ జరుగుతుండడం గమనార్హం.
రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 14 స్థానాలలో తన అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ సీట్లకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. హైదరాబాద్ సంగతి ఎలా ఉన్నప్పటికీ ఖమ్మం, కరీంనగర్ ఎంపీ సీట్లకు అభ్యర్థుల ఎంపిక, వెలమ సామాజిక వర్గం విషయంలో కాంగ్రెస్ అనుసరించే విధానంపైనా ఉత్కంఠభరిత చర్చ జరుగుతోంది. వాస్తవానికి వెలమ సామాజిక వర్గానికి, కాంగ్రెస్ పార్టీకి విడదీయలేని రాజకీయ అనుబంధమే ఉందని చెప్పవచ్చు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ రాష్ట్ర వ్యాప్తంగా 9 మంది వెలమ సామాజికవర్గపు అభ్యర్థులకు కాంగ్రెస్ టికెట్లు ఇవ్వగా, ఆరుగురు విజయం సాధించారు. జలగం వెంగళరావు, ఎం. సత్యనారాయణరావు వంటి ప్రముఖ వెలమ నాయకులు పీసీసీ అధ్యక్షులుగా వ్యవహరించారు. జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగానూ బాధ్యతలు నిర్వహించారు. ఎం. సత్యనారాయణరావు ఇందిరాగాంధీ హయాంలోనే ఐదు రాష్ట్రాలకు ఇంచార్జిగా వ్యవహరించారు. వెంగళరావుతోపాటు జువ్వాడి చొక్కారావు వంటి నాయకుడు ఏకకాలంలో కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీలుగా ఎన్నికై లోక్ సభలో తమ బాధ్యతలను నెరవేర్చారు. టీడీపీ ఆవిర్భానంతరం కూడా 70 శాతం వెలమ నాయకులు కాంగ్రెస్ పార్టీ వెన్నంటే ఉన్నారు. టీఆర్ఎస్ ఆవిర్భావం, అధికార పగ్గాలు చేపట్టిన పరిస్థితుల్లోనూ దాదాపు 50 శాతం వెలమ సామాజికవర్గం కాంగ్రెస్ పార్టీ వెన్నంటే ఉంది.
ఇప్పుడీ ప్రస్తావనంతా దేనికంటే… రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాల్లో ఏదో ఒక సీటును వెలమ సామాజికవర్గానికి చెందిన నాయకుడికి టికెట్ కేటాయించాలనే డిమాండ్ ఆ సామాజికవర్గం నుంచి వస్తోంది. స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రతి ఎన్నికలోనూ వెలమలకు ఓ ఎంపీ సీటును కేటాయిస్తోందని చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు ప్రకటించిన 14 స్థానాల్లో ఏ ఒక్క సీటునూ వెలమలకు కేటాయించకపోవడంపై ఆ సామాజిక వర్గం నేతలు ఒకింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ కరీంనగర్ లో, బీజేపీ మెదక్, ఖమ్మం స్థానాల్లో వెలమ నేతలను ఎంపీ అభ్యర్థులగా బరిలోకి దించింది. ఈ పరిణామాల్లోనే తమకు కరీంనగర్ సీటును కేటాయించాల్సిన అవసరముందని వెలమ సామాజికవర్గానికి చెందిన ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారు. సంఖ్యా ప్రకారం చూసినా ఏడు అసెంబ్లీ స్థానాల పరిధి గల పార్లమెంట్ సీటుకు తమ సామాజికవర్గం అర్హత సాధించిందనే డిమాండ్ ను పార్టీ ముందుంచుతున్నారు. అంతేకాదు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి నాయకుడు కూడా వెలమకు ఖచ్చితంగా ఓ సీటు ఇవ్వాలని పార్టీ పెద్దలను కోరుతున్నట్లు సమాచారం. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో వెలుగు చూస్తున్న అనేక అంశాలను ప్రామాణికంగా వెలమ సామాజికవర్గాన్ని దూరం పెట్టాల్సిన అవసరం లేదని కూడా ఆయన వాదిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. విషయాన్ని కాంగ్రెస్ ముఖ్యనేతలు రోహిత్ చౌదరి, దీపాదాస్ మున్షీల దృష్టికి కూడా తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది.
అయితే అభ్యర్థులను ప్రకటించాల్సిన మూడు స్థానాల్లో హైదరాబాద్ ను మినహాయిస్తే ఇక మిగిలింది ఖమ్మం, కరీంనగర్ పార్లమెంటు సీట్లు మాత్రమే. ఖమ్మం అభ్యర్థి ఎంపికపైనే వెలమలకు లభించే ప్రాధాన్యత స్పష్టమవుతుందని చెబుతున్నారు. ఖమ్మంలో రెడ్డి సామాజికవర్గం నేతకు కాంగ్రెస్ టికెట్ కేటాయిస్తే, కరీంనగర్ లో వెలమలకు ఇవ్వాలనే డిమాండ్ ప్రధానంగా తెరపైకి వస్తోంది. కరీంనగర్ ఎంపీ టికెట్ కోసం అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, వెలచాల రాజేందర్ రావు అనే కాంగ్రెస్ నాయకులు హోరాహోరీగా పోటీ పడుతున్నారు. ఖమ్మంలో, కరీంనగర్ లో రెండుచోట్లా రెడ్లకు కేటాయిస్తే వెలమ సామాజికవర్గాన్ని కాంగ్రెస్ పార్టీ దూరం చేసుకున్నట్లవుతుందనే వాదన కూడా ఈ సందర్భంగా వినిపిస్తోంది. ఇదే జరిగితే వెలమ సామాజికవర్గం బీజేపీవైపు చూసే అవకాశాలు లేకపోలేదంటున్నారు. చూడాలి ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో మరి!