హత్యోదంతాల్లో పోలీసులకు లభ్యమయ్యే ఆధారాలు కీలకంగా మారుతాయి. సంచలనాత్మక ఘటనల్లో ఇటువంటి ఆయుధాల ఆధారాలు చర్చనీయాంశంగానూ మారుతాయి. అందుకే ఆయుధాల లభ్యం కూడా ప్రత్యేక వార్త కథనాలుగా మారుతాయి. కాకపోతే ‘క్రైం రిపోర్టింగ్’లో మెలకువలపై అవగాహన లేకపోతే సంబంధిత దర్యాప్తు సంస్థల ముందు మీడియా సంస్థల పరువు పోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ తరహాలో వార్త రాసిన జర్నలిస్టుకే కాదు, దాన్ని ప్రచురించిన సంస్థకు కూడా కనీస అవగాహన లేదనే అభిప్రాయం పోలీస్ వర్గాల్లో ఏర్పడుతుంది. ఫలితంగా సంబంధిత సంస్థ తీరు నవ్వులపాలవుతుంది. ఇంతకీ విషయమేమిటంటే…?
హైకోర్ట్ అడ్వకేట్స్ వామన్ రావు, నాగమణిల దంపతుల హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. అధికార పార్టీకి చెందిన కొందరు నేతలపై విపక్ష నేతల ఆరోపణలకు ఆస్కారం కలిగించిన ఉదంతమింది. ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టిన ఘటనా పలువురు అభివర్ణించారు కూడా. ఈ దారుణ హత్యలపై ఇప్పటికీ న్యాయవాద వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర హైకోర్టు కూడా కేసును తీవ్రంగా గర్హించింది. ప్రభుత్వ విశ్వాసాన్ని ప్రశ్నించే విధంగా ఘటన ఉందని కూడా వ్యాఖ్యానించింది. పోలీసుల దర్యాప్తు తీరుపై సోమవారం కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు కేసు దర్యాప్తును సీరియస్ గా కొనసాగిస్తున్నారు.
అడ్వకేట్ దంపతుల హత్యకేసులో కీలకంగా మారిన కత్తుల స్వాధీనం కోసం పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. విశాఖపట్నం నుంచి గజ ఈతగాళ్లను తీసుకువచ్చి మరీ సుందిళ్ల బ్యారేజీ నీటిలో గాలించారు. రెండు రోజుల ప్రయత్నానికి సోమవారం ఫలితం లభించింది. సుందిళ్ల పార్వతీ బ్యారేజీలోని 53, 54 ఫిల్లర్ల వద్ద రెండు కత్తులను గత ఈతగాళ్లు వెలికి తీశారు. ఐదుగురు గజ ఈతగాళ్లు, దాదాపు 50 మంది పోలీసులు తీవ్రంగా శ్రమించి స్వాధీనం చేసుకున్న కత్తులపై ‘సాక్షి’ మీడియా గ్రూపునకు చెందిన వెబ్ సైట్ ఎటువంటి వ్యాఖ్యలు చేసిందో తెలుసా? ‘ఇదిలా ఉండగా ఆరువందల రూపాయల విలువ చేసే రెండు కత్తుల కోసం రెండు రోజులుగా పోలీసులు హైరానా పడటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.’ అని తన వార్తా కథనంలో ముక్తాయించింది.
వామన్ రావు దంపతుల హత్య కేసులో పోలీసులు అనవసరంగా శ్రమించారుగాని, ఆరువందల రూపాయలు వెచ్చించి, ఓ రెండు కత్తులను కొనుగోలు చేసి, ‘రికవరీ’ కత్తులుగా చూపిస్తే సరిపోయేదా? అనవసరంగా రెండురోజులపాటు పోలీసులు హైరానా పడ్డారని ‘సాక్షి’ సెటైర్ వేసినట్టుగా ఆయా వాక్యాలను భావించాలా? ఇదీ పోలీసు వర్గాల సందేహం.