కోర్టుల్లో న్యాయవాదులు వాదించే కేసుల్లో కేటగిరీలు ఉంటాయా? వివాదాస్పద, నిర్వివాద కేసులుగా వీటిని విభజించవచ్చా? ఏ వివాదమూ లేకుంటే అది కేసుగా పరిగణనలోకి వస్తుందా? వివాదం ఉంటేనే కదా కేసు? అలాంటప్పుడు ‘వివాదాస్పద కేసులు’ అనే ప్రత్యేక కేసులు ఉంటాయా? ఈ కేసులేంటి… ప్రశ్నల గోలేంటి…? అనుకుంటున్నారా? నిన్న పెద్దపల్లి జిల్లాలో హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్ రావు, నాగమణిలు దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాద వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన ఈ హత్యలపై అధికార పార్టీకి చెందిన కొందరు నేతలపైనే తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా మంథని మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు కుంట శ్రీను పేరును హత్యకు గురైన వామన్ రావు కొన ఊపిరితో ఉన్న సమయంలో ప్రస్తావించడం గమనార్హం. కేసు దర్యాప్తులో పోలీసులు ఏం తేలుస్తారనేది వేరే విషయం. కానీ తీవ్ర కలకలానికి దారి తీసిన న్యాయవాద దంపతుల హత్యోదంతంలో పేరెన్నిక గల ‘సాక్షి’ పత్రికలో ప్రచురితమైన ఓ వార్త ఈ కథనంలో వాడిన వాక్యాలపై న్యాయవాద వర్గాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.
హైకోర్టు న్యాయవాద దంపతుల హత్యపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయనే లీడ్ తో ‘సాక్షి’ పత్రిక నిన్నటి ఘటనకు సంబంధించి ఓ ఫాలో అప్ స్టోరీని ప్రచురించింది. రాజకీయ నేతలు, పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులపై వామన్ రావు దంపతులు హైకోర్టులో పలు కేసులు దాఖలు చేశారని వార్తా కథనంలో పేర్కొన్నారు. ఇంతవరకు బాగానే ఉంది. ‘పెద్దపల్లి జిల్లాలోనే కాకుండా మంచిర్యాల, కరీంనగర్, హైదరాబాద్, వరంగల్, రంగారెడ్డితోపాటు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ దంపతులు వివాదాస్పద కేసులు వాదిస్తుంటారు’ అని పేర్కొనడం గమనార్హం. ఈ వాక్యంపైనే న్యాయవాద వర్గాలు సెటైర్లు వేస్తున్నాయి. ‘వివాదాస్పద కేసులు’ ఏమిటి? అని ప్రశ్నిస్తున్నాయి. వామన్ రావు దంపతులు అనేక ఘటనలపై పోరాడుతున్నారనేది వాస్తవమే. మంథనిలో ఇసుక మాఫియాపై పోరాడుతున్నారు. కులాంతర వివాహం చేసుకున్న దళిత యువకుడి హత్యలో ఓ రాజకీయ నాయకుడి ప్రమేయముందనే కేసును వాదిస్తుండవచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణ కేసునూ టేకప్ చేసి ఉండవచ్చు. మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆస్తుల కేేసులోనూ వీరే వాదిస్తుండవచ్చు. మంథని పోలీస్ స్టేషన్ లో శీలం రంగయ్య అనే వ్యక్తి మరణం లాకప్ డెత్ అనే ఆరోపణలపైనా కేసును వాదిస్తున్నారు. అంతమాత్రాన ఇవి వివాదాస్పద కేసులు అవుతాయా? వివాదం ఉంటేనే కదా… కేసుల వరకు పరిణామాలు దారి తీసేంది. ఆ వివాదంలో న్యాయ, అన్యాయాలను కోర్టు విచారిస్తుంది. కానీ వివాదాస్పద కేసులు వాదించడం వల్లే హత్యకు గురయ్యారనే భావన స్ఫురించేవిధంగా ‘సాక్షి’ కథనం సాగిందనేది న్యాయవాద వర్గాల ఆక్షేపణ.
భారతదేశ ప్రధాని హత్యోదంతంలో రాంజెఠ్మలానీ, పీఎం లేఖి వంటి ప్రముఖ న్యాయవాదులు నిందితుల తరపున వాదించారని, చివరికి కసబ్ కేసులోనూ ఇండియన్ లాయర్లే వాదించారని న్యాయవాద వర్గాలు గుర్తు చేస్తున్నాయి. అంతేకాదు… రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యం స్వామి ఎంతో మంది ప్రముఖ రాజకీయ నేతలపై ‘పిల్స్’ దాఖలు చేశారు. పలువురు రాజకీయ నేతలు జైలుకు వెళ్లడానికి ఆయన దాఖలు చేసిన కేసులే ప్రధాన కారణం కూడా. ఈ నేపథ్యంలో తన వద్దకు వచ్చిన ఏ కేసులోనైనా క్లయింట్ తరపున వాదించడమే తమ కర్తవ్యమని న్యాయవాద వర్గాలు అంటున్నాయి. అంతమాత్రాన న్యాయవాదులను హత్య చేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి కేసుల్లో వివాదాస్పద, నిర్వివాద కేసులు ఉండవ్. సాధారణ, కీలక కేసులు మాత్రమే ఉంటాయి. సంచలన ఘటనల కేసులూ ఉంటాయి. కేసుల నిర్వచనం తెలియకుండా వాడే పద ప్రయోగం పత్రిక పరువుకు ప్రామాణికంగా నిలుస్తుందనేది కాదనలేని వాస్తవం. ముఖ్యంగా న్యాయవాద వర్గాల్లో ఈ తరహా కథనాలు తీవ్ర చర్చకు దారి తీస్తాయి. వామన్ రావు దంపతుల హత్యకు సంబంధించి ‘వివాదాస్పద కేసులు వాదిస్తుంటారు’ అనే పద ప్రయోగంపై న్యాయవాద వర్గాలు ఏమంటున్నాయంటే…? ఇటువంటి హత్యల గురించి వివాదాస్పద వ్యాఖ్యలతో కూడిన కథనాలకన్నా పౌర సంబంధాల అధికారి (డీపీఆర్వో) ఇచ్చే ప్రకటనలను రాసుకుంటే శ్రేయస్కరంగా ఉంటుందని ‘నిర్వివాద’ సలహా ఇస్తున్నాయి. ‘మంత్రిగారు మొక్కలు నాటారు, ఎమ్మెల్యేగారు శంకుస్థాపన చేశారు’ అని రాసుకుంటే వివాదంలేని జర్నలిజంగా మరింత పేరు, ప్రఖ్యాతులను సంపాదించుకోచ్చని న్యాయవాద వర్గాలు హితబోధ చేస్తున్నాయి. అదీ అసలు సంగతి.