ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో ఒక కుటుంబం వ్యవసాయం చేయడం… అందులో అక్కాచెల్లెళ్లు కాడి పట్టి నాగలి లాగడం, తండ్రి నాగలి మేడి పట్టడం, తల్లి గింజలు నాటడం వీడియో సోషల్ మీడియాలో వచ్చింది.

ఎద్దులకు బదులు ఆడపిల్లలు నాగలి కాడి పట్టడం గుండె బరువెక్కే సంఘటనే. అందుకే నటుడు సోనూ సూద్ స్పందించాడు. సాయంత్రానికల్లా ట్రాక్టర్ ఆ కుటుంబానికి పంపించాడు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది.

ఆ తర్వాతే దురదృష్టవశాత్తూ రాజకీయం జొరబడింది. స్పందించిన సోనూ సూద్ ‘అపాత్ర దానం చేశానా?’ అని ఆలోచించుకునేలా, లాక్ డౌన్ సమయంలో ‘ఏదో చేద్దాం’ అనుకున్న ఆకుటుంబం తడబడేలా, “నాన్నకు తోడుగా” అనుకున్న అక్కచెల్లెళ్ళు సిగ్గుతో తలవంచుకునేలా సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యలు రావడం దురదృష్టకరం.

రాజకీయం ఆ కుటుంబ పుట్టుపూర్వోత్తరాలు, కులగోత్రాలు ముఖచిత్రంపైకి నిస్సిగ్గుగా తెచ్చింది.

ఆ కుటుంబం మదనపల్లె లో ఉండొచ్చు. ఆ తండ్రి టి కొట్టు నడుపుతుండొచ్చు. ఆయనకు రాజకీయ నేపధ్యం ఉండొచ్చు. కానీ లాక్ డౌన్ వారిని వదిలిపెట్టలేదుగా!? మూలాలు వెతుక్కుంటూ పల్లెకు చేరుకున్నారుగా? టీ కొట్టు మూతపడ్డాక నోట్లోకి ముద్ద దొరికే మార్గం ఉండాలిగా? అది ఏదో పార్టీ వానికో, ఏదో వ్యాపారికో, ఏదో కులం వానికో మాత్రమే వచ్చే సమస్య కాదుగా?

పట్నంలో అద్దె ఇల్లు వదిలి, జీవనోపాధి కల్పించే టీ కొట్టుకు తాళం వేసి పల్లెలో తండ్రి ఇంటికి తన కుటుంబాన్ని చేర్చిన ఆ నాగేశ్వర్రావుకు ప్రత్యామ్నాయ జీవనోపాధి కావాలిగా!? పల్లెలో దొరికేది వ్యవసాయమేగా? కొత్తగా పల్లె కొచ్చిన కుటుంబానికి, ఆదాయం లేని కుటుంబానికి వ్యవసాయం మొదలు పెట్టడానికి ఇంతకన్నా మార్గం ఏముంటుంది?

కష్టాలు దిగమింగుకుంటూ బ్రతుకుపై గంపెడాశతో పట్నంలో బ్రతుకుతున్న ఆ అక్కచెల్లెళ్లకు, లాక్ డౌన్ ఛిద్రం చేసిన తమ బ్రతుకు చూసి, తండ్రి పడుతున్న ఆందోళన చూసి, తండ్రికి చేదోడుగా ఉందాం అనుకోవడంలో తప్పేంటి? ఏదో చిన్న ప్రయత్నం. అది ఎంత కష్టమో వారికి తెలియకపోవచ్చు. కానీ ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నానికి ఓ గొప్ప స్పందన వచ్చింది. ఇవన్నీ బాగానే ఉన్నాయి.

రాజకీయమే ఈ విషయాన్ని రచ్చ చేసింది. రొచ్చులోకి లాగింది.
తెలంగాణాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం కోల్పోయిన ఒక యువతి కూరగాయల వ్యాపారం చేస్తుంటే ఆదరణ వచ్చింది. ఇక్కడేమో ఈ కుటుంబానికి రాజకీయ రొచ్చు అవమానం తెచ్చింది.

ఇక వదిలేయండి. సభ్య సమాజం సిగ్గుపడుతోంది. ఎవరి రాజకీయాలకోసమో ఆ కుటుంబంతో ఆడుకోవద్దు.
ఆ ఆడపిల్లల చిన్న ప్రయత్నాన్ని ఇలా అపహాస్యం చేయొద్దు.

వ్యవసాయం చేసే కుటుంబాలకు ఇలాంటివి సర్వసాధారణం. ఎక్కడో ఒక చోట, ఏదో ఒక సందర్భంలో ఆడవాళ్ళో, మగవాళ్ళో శారీరక కష్టం చేయకపోతే వ్యవసాయం సాగదు. వ్యవసాయం అంటేనే మనిషీ, పశువు కలిసి మట్టితో దోస్తీ చేయడం. ఇలాంటి దృశ్యాలు ఎన్నిసార్లు చూడలేదు? ఎన్ని చోట్ల చూడలేదు?

✍️ దారా గోపి

Comments are closed.

Exit mobile version