మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కు పలువురు ఉద్యమకారులు బహిరంగ లేఖ రాశారు. ఆయా లేఖ దిగువన ఉన్నది ఉన్నట్లుగానే….
‘‘ఒక గొప్ప ఆశయం కోసం సుదీర్ఘ కాలం పోరాటం జరిగిన తర్వాత ప్రజల అనేక త్యాగాలతో ఏదో మేరకు ప్రజల ఆకాంక్ష సాధన జరుగుతుంది. అప్పటివరకు ఉద్యమానికి నాయకత్వం వహించిన నాయకుడికి ప్రజలు అధికారాన్ని అప్పచెప్పడం, ఆ తర్వాత క్రమంలో ఆ నాయకుడు నియంతగా మారడం చరిత్ర పొడుగూతా జరుగుతూ వస్తున్నదే. కాని ఆ నియంతృత్వం ఏదో ఒక రోజు మట్టికొట్టుకుపోవాల్సిందే. నియంతృత్వాన్ని ఎదిరించి నిలిచిన వ్యక్తులే చరిత్రలో నిలబడుతారు. ఇందిరాగాంధి విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడి ఈ దేశ చరిత్రలో తన స్థానాన్ని సుస్థిర పరుచుకున్న వ్యక్తి జయప్రకాష్ నారాయణ.
దేశానికి స్వాతంత్రం వచ్చినాక, స్వాతంత్రం తెచ్చిన పార్టీగా దేశ ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టారు. స్వతంత్రోద్యమ క్రెడిబిలిటీని నెహ్రు ఉపయోగించుకుని మళ్ళీ మళ్ళీ అధికారంలోకి వచ్చాడు. నెహ్రు తదనంతరం వారసురరాలుగా వచ్చిన ఇందిరాగాంధి తన నిరంకుశత్వంతో ఈ దేశానికి ఎమర్జెన్సీ తెచ్చిపెట్టింది. జయప్రకాష్ నారాయణ ఈ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉద్యమం చేసి కాంగ్రెస్ పార్టీ ఏకఛత్రాధిపత్యానికి సమాధి కట్టాడు. ఈ ఉద్యమం దేశానికి మురార్జీ దేశాయ్, బీహార్ లో లాలుప్రసాద్, ఉత్తర ప్రదేశ్ లో ములాయం, కర్ణాటక లో దేవెగౌడ ఇలా అనేక మంది ఉద్దండ నాయకులను అందించింది. ఈ ఉద్యమం దేశ రాజకీయాలను మలుపు తిప్పింది.
దేశ స్వాతంత్ర ఉద్యమానికి సారూప్యత ఉన్నదే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగాక తెలంగాణ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచారు. మీలాంటి నాయకులున్నందునే టిఆర్ఎస్ ను గెలిపించడం జరిగింది. దేశంలో నెహ్రు తర్వాత వారసత్వంగా వొచ్చిన ఇందిరాగాంధి నియంతగా మారితే తెలంగాణలో కేసీఆర్ కాలంలోనే నియంతృత్వం రాజ్యమేలుతోంది. దీన్ని అడ్డుకోవడానికి తెలంగాణకు ఒక జయప్రకాష్ కావాల్సిందే. ఆ అవకాశం మీకు మాత్రమే దక్కింది.
ఇక చాలా మంది కేసీఅర్ అపర చాణుక్యుడని, ఎవరిని నిలబడనివ్వడని, అతడు చాలా బలవంతుడని, టైగర్ నరేంద్ర, దేవేందర్ గౌడ్, కొండా లక్ష్మన్ బాపూజి వంటి నాయకులను ఎవరిని నెగలనియ్యలేదని, ఈటల రాజేందర్ కూడా నిలబడలేడని నిర్వీర్య పరిచేవారు వుంటారు. అయితే ఆనాటి పరిస్థితులు వేరు… తెలంగాణ రాష్ట్ర ఉద్యమ ఐక్యత కోసం ఆనాడు తెలంగాణ ప్రజలు ఒకే పార్టీ ఉండాలని కోరుకున్నారు. కనుకనే వారు పార్టీలను పెట్టి నిలుపలేక పోయారు. నేడు తమిళనాడులో డీఎంకే, అన్నా డీఎంకే లాగా తెలంగాణలో ప్రజలు మరో తెలంగాణ ఆత్మగౌరవ పార్టీని కోరుకుంటున్నారు. తమరు కూడా గులాబీ ఓనర్లమంటూ చెప్పిన విషయం ప్రజలు మరిచిపోలేరు. మేము ఒకనాడు బయట ఉండి కూడా గులాబీని బలపరిచిన వారమే. శ్రీకాంతాచారి మొదలు ఎంతో మంది త్యాగధనులు గులాబీ జెండా పట్టుకుని ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. జైళ్ల పాలయిండ్రు. చిత్రహింసల పాలయిండ్రు. అటువంటి జెండాను రూపకర్తలు, ఓనర్లు కేసీఆర్ జేబులో పెట్టి నిరాయుధులుగా బయటకు వచ్చి నిర్వీర్యం కావడమో, నామమాత్రంగా మిగిలి పోవడమో జరుగుతూ వచ్చింది. చివరగా మీవంతు వచ్చింది.
ఎవరు చెప్పని మాట మీరు చెప్పారు. గులాబీ ఓనర్లమన్నారు. ఆత్మగౌరవం, ప్రజాస్వామ్యమన్నారు. ప్రజలు తమరిలో ప్రత్యామ్నాయం చూసుకున్నారు. మరి గత నాలుగు రోజుల నుండి ఢిల్లీ పార్టీలో కలువ బోతున్నారని వార్తలు వస్తున్నాయి. జూన్ మూడవ తేదీ ముహూర్తమని కూడా ఒక వార్త వచ్చింది. మీనుండి దీనికి సంబంధించి ఎలాంటి క్లారిటీ రావడం లేదు. దీన్ని బట్టి అది నిజమే కావచ్చునని అనుమానిస్తున్నాం. ఈ నిర్ణయంతో మీరు చెప్పిన గులాబీ ఓనర్లమనే మాట వదిలేసుకున్నట్టు అవుతుంది. ప్రజాస్వామ్యం, ఆత్మగౌరవం ఢిల్లీ పాదాలకాడ తాకట్టు పెట్టినట్టే అవుతుంది. ఒకవైపు ఢిల్లీ పొలిమేరలో రైతుల పోరాటం మీరు చూస్తూనే వున్నారు. మరో వైపు దేశంలో ఆరోగ్య సంక్షోభానికి ప్రధాన బాధ్యత ఢిల్లీ పార్టీదేనని ఆరోగ్యమంత్రిగా చేసిన మీకు ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు.
ఇక కేసీఆర్ అణచివేతను తట్టుకోగలనా అనే అనుమానం మీకు రావచ్చు. రాష్ట్రంలో తీవ్రమైన ఆరోగ్య సంక్షోభం ఏర్పడి ప్రజలు దుర్భర పరిస్తితుల్లోకి నెట్టబడుతున్నారు. ఎంతటి చాణక్యుడైనా పోయే కాలమొస్తే తప్పులమీద తప్పులు చేస్తాడు. చాణక్యం అయినాఎదో ఒక రోజు సంకనాకి పోతుంది. ఆ సమయం కూడా వచ్చింది. లాక్ డౌన్ పెట్టనన్న మూడు రోజుల్లోనే లాక్ డౌన్ పెట్టాడు. మీ భూమి విషయంలో హై కోర్ట్ మొట్టికాయలు వేసింది. ఎవ్వరి విషయంలో బయపడనంత మీ విషయంలో కేసీఆర్ భయపడుతున్నాడు.
చివరగా ఒక్క మాట… మీరు స్వంతంగా పార్టీ పెట్టగలిగేతే మంచిది. అంత లేదనుకునుకుంటే జయప్రకాష్ నారాయణ్ లాగా ఒక ఆత్మగౌరవ ప్రజాస్వామ్య ఉద్యమాన్ని నిర్వహించండి. అట్ల గాకుండా మీరు ఢిల్లీ పార్టీలోకి పోతే మీకుగాని, మిమ్మల్ని కలుపుకుంటున్న ఆపార్టీకి తెలంగాణలో ఒనగూడేదేమి లేదు. ఆత్మగౌరవం, ప్రజాస్వామ్యం కోసం తెలంగాణ తల్లి మరో నాయకుణ్ణి కంటుంది. ప్రజల నుండి మరో నాయకుడు పుడుతాడు. సమయం పడుతుంది అంతే.’’
ఆరోగ్య తెలంగాణ దండాలతో…
బత్తుల సిద్దేశ్వర్లు (9704672813),
మేకపోతుల నరేందర్ గౌడ్, రాష్ట్ర అధ్యక్షులు
తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం, రాష్ట్ర అధ్యక్షులు (9849983139),
బెల్లి కృష్ణ యాదవ్, కన్వీనర్
తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య సమితి,
పటేల్ వనజక్క,
కాంటెస్టెడ్ ఎమ్మెల్యే భూపాలపల్లి,
సాయిని నరేందర్, చైర్మన్, బీసీ స్టడీ ఫోరం,
పెండ్యాల మధుసూధనాచారి, సలహాదారు, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం,
దేవరకొండ నరేష్ చారి, రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం,
ఎర్ర మల్లేష్ ఆరోగ్య ఉద్యమకారులు,
వాసు కె యాదవ్, కో కన్వీనర్
గొల్ల కుర్మ హక్కుల పోరాట సమితి,
రావుల కోటయ్య ముదిరాజ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం,
మాచర్ల శ్రీనివాస్ రజక, రాష్ట్ర బీసీ నాయకులు,