రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ ఘటన ఖమ్మం జిల్లా చింతకాని పోలీసులపైనా ప్రభావాన్ని చూపింది. ఈ సంఘటనలో అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ కు చెందిన కొందరు అధికారులపై, సిబ్బందిపై ఇప్పటికే చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. అంతేగాక మరియమ్మ కుటుంబానికి నష్టపరిహారం, ఆమె కుామరునికి ప్రభుత్వ ఉద్యోగం కల్పన వంటి చర్యలతో మరియమ్మ ఘటనలో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. డీజీపీ మహేందర్ రెడ్డి సైతం రెండు రోజుల క్రితం ఖమ్మంలో పర్యటించి మరియమ్మ కుమారుడు ఉదయ్ కిరణ్ ను పరామర్శించారు.

అయితే డీజీపీ పర్యటన ముగిసిన అనంతరం చింతకాని పోలీసు స్టేషన్ హౌజ్ ఆఫీసర్ పై ఉన్నతాధికారులు చర్యకు ఉపక్రమించడం గమనార్హం. ఇందులో భాగంగానే చింతకాని ఎస్ఐ రెడ్డబోయిన ఉమను ఖమ్మం పోలీస్ కమిషనరేట్ కు ఎటాచ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆమె స్థానంలో చింతకాని నూతన ఎస్ఐగా లవన్ కుమార్ ను నియమించగా, ఆయన బాధ్యతలు కూడా స్వీకరించారు. అడ్డగూడూరు పోలీసులు చింతకాని పోలీస్ స్టేషన్ లో మరియమ్మను కొడుతుండగా అడ్డుకోలేదని, ఘటనపై ఉన్నతాధికారులకు సమాచారం అందించలేదనే కారణాలతో చింతకాని ఎస్ఐ ఉమపై ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం. ఈమేరకు ఎస్ఐ ఉమ ఖమ్మం కమిషనరేట్ కార్యాయలంలో రిపోర్ట్ చేసినట్లు తెలిసింది.

Comments are closed.

Exit mobile version