‘చెడు చూడకు, చెడు వినకు. చెడు మాట్లాడకు’. మూడు కోతుల బొమ్మలు చెప్పే నీతి ఇదే కదా? చిన్నప్పటి నుంచీ పుస్తకాల్లో చదువుకున్న నీతి, చూసిన కోతుల బొమ్మలు ఇవే కదా? ఇదే నీతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరగేసి చెబుతోంది. మూడు కోతుల బొమ్మ నీతిని సరికొత్తగా క్రియేట్ చేసి వెరైటీగా జనాల్లోకి వదిలింది. లంచం అనే చెడును ఉటంకిస్తూ ‘కళ్లు తెరిచి చూడు, చెవులు రిక్కించి విను, అవినీతికి వ్యతిరేకంగా గొంతు విప్పు’ అంటూ ప్రకటన జారీ చేసి మరీ ప్రచారం చేస్తోంది. ప్రభుత్వ శాఖల్లో పాతుకుపోయిన అవినీతి, లంచం అంశాల్లో మూడు కోతుల కేరికేచర్ బొమ్మల ద్వారా సరికొత్త నీతిని ప్రకటన ద్వారా వైఎస్ జగన్ సర్కార్ ప్రచారంలోకి తీసుకువచ్చింది. అవినీతి నిరోధక శాఖ తరపున జారీ చేసిన ఏపీ ప్రభుత్వ ప్రకటనలో మూడు కోతుల బొమ్మల ద్వారా నిర్వచించిన ఈ సరికొత్త భాష్యంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
‘చేయి చేయి కలుపుదాం, అవినీతి భూతాన్ని తరిమేద్దాం’ అంటూ సీఎం జగన్ ఇచ్చిన పిలుపునకు ప్రజల నుంచి భారీ స్పందన కూడా లభిస్తోందట. ఇందుకు సంబంధించి ఏపీలో 14400 నెంబర్ తో కాల్ సెంటర్ ప్రారంభించిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 5,100 కాల్స్ వచ్చాయట. రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పంచాయతీరాజ్ విభాగాల్లో లంచం కోసం డిమాండ్ చేస్తున్నట్లు, అవినీతికి పాల్పడుతున్నట్లు ఫిర్యాదుల సారాంశం. ఇక నుంచి మూడు కోతుల బొమ్మల పాత నీతి నినాదాలతోపాటు చెడు విను, చూడు, గొంతు విప్పు’ అనే సరికొత్త రీతి నినాదాలను కూడా ప్రజలు గుర్తుంచుకోవాలి. ఈ తరం విద్యార్థులు కూడా మూడు కోతుల బొమ్మల నీతిని సరికొత్తగా చదువుకోవాలి కూడా. ఎందుకంటే అవినీతి, లంచం అనే పదాలు చెడు అంశాలే మరి. అదిరింది కదూ? ఏపీ సర్కారు యాడ్ క్రియేటివిటీ!