ఔను… పర్వతనేని వెంకటకృష్ణ అనే జర్నలిస్టు మేధావి అని అంగీకరించాల్సిందే. అదేమిటీ… జర్నలిస్టులందరూ మేధావులు కాదా? అని ఆశ్చర్యపోకండి. ప్రతి జర్నలిస్టు మేధావి కానే కాదు. ఇందులో డౌట్ కూడా అక్కరలేదు. కొందరు మాత్రమే మేధావులుగా స్వయం ప్రకటన చేసుకుంటారు. మరికొందరు భుజాలు ఎగరేస్తూ, మెడను అటూ, ఇటూ తిప్పడం ద్వారా తమ బాడీ లాంగ్వేజ్ ద్వారా మేధావులుగా భావిస్తుంటారు. అందరు జర్నలిస్టులు తమకు తాము మేధావులుగా ప్రకటించుకునే సాహసానికి ఒడిగట్టరు కూడా.
ఈ మధ్య నిర్వహించిన ఓ ‘డిబేట్’ లైవ్ షోలో వెంకటకృష్ణ తనకు తాను మేధావిగా ప్రకటించుకోవడమే అసలు విశేషం. అదీ జాతీయ మీడియాకు చెందిన ఓ ప్రముఖ జర్నలిస్టుతో పోల్చుకుని మరీ. తనకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఓ నాలుగైదు వేల వరకు ఓట్లు ఉన్నాయని కూడా వెంకటకృష్ణ ఇటీవల బాహాటంగా ప్రకటించిన సంగతి తెలిసిందే కదా?తనకు లైవ్ లో కొన్ని హామీలు ఇస్తే ఏపీలో బీజేపీ తరపున ప్రచారం చేస్తానని సోము వీర్రాజుకు హామీ కూడా ఇచ్చారు. తనకు విప్లవోద్యమ నేపథ్యం కూడా ఉందని, తన గురించి గోవిందరావుపేట సెంటర్ లో ఎవరిని అడిగినా చెబుతారని ఆయనే గతంలో లైవ్ షో ద్వారా బాహాటంగా ప్రకటించారు.
తాను ఎక్కడ పనిచేసినా తనకు గల శక్తి, యుక్తులను ప్రపంచానికి, ముఖ్యంగా తన డిబేట్ ను తిలకిస్తున్న ప్రేక్షకులకు సవివరంగా తెలియజేయడంలో వెంకటకృష్ణ శైలే వేరు. తాను ఏదీ దాచుకోడు. తాజాాగా ఆయన ప్రకటించిన అంశం కూడా ఇదే కోవలోకి వస్తుంది. రాజ్ దీప్ సర్దేశాయ్ తెలుసుగా? ప్రస్తుతం ఆయన ఇండియా టుడే మీడియా గ్రూప్ కన్సల్టింగ్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. గతంలో అనేక ప్రముఖ మీడియా సంస్థల్లోనూ సర్దేశాయ్ కీలక స్థానాల్లో పనిచేశారు. ప్రముఖులపై ఎఫ్ఐఆర్ నమోదైన అంశంలో వార్తలు ప్రచురించకూడదనే కోర్టు ఉత్తర్వులపై రాజ్ దీప్ రెండు రోజుల క్రితం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయ్… అది వేరే విషయం.
కానీ రాజ్ దీప్ సర్దేశాయ్ వ్యక్తం చేసిన అభిప్రాయం బహుషా తనకు నచ్చలేదో, మరే ఇతర కారణమో తెలియదుగాని వెంకటకృష్ణ ఆయనపై తనదైన శైలిలో చేసిన వ్యాఖ్యల వీడియో క్లిప్పింగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తోంది. ఎందుకంటే… వెంకటకృష్ణ చేసిన ఆయా వ్యాఖ్యలకు కొన్ని సినిమా దృశ్యాల క్లిప్పింగులను జత చేయడమే ఇందుకు కారణం. ‘నిన్ను నమ్మం ‘బాబు’’ అనే ఫేస్ బుక్ అకౌంట్లో గల ఆయా వీడియోను దిగువన మీరూ చూసేయండి. ఆ తర్వాత వెంకటకృష్ణను మేధావిగా గుర్తించండి.