కరోనా మహమ్మారి పలువురు జర్నలిస్టులను పొట్టనపెట్టుకుంటున్న సంగతి తెలిసిందే. జూనియర్, సీనియర్ అనే తేడాలేవీ లేకుండా అనేక మంది పాత్రికేయుల ప్రాణాలను కరోనా కబలిస్తున్నది. ఇప్పటికే కొందరు జర్నలిస్టులు చనిపోగా, మరికొందరు వివిధ ఆసుపత్రుల్లో కరోనాతో పోరాడుతున్నారు. ఈ కల్లోల పరిస్థితుల్లో జర్నలిస్టులకు, వారి కుటుంబాలకు కనీస సాయం చేసే సంగతి ఎలా ఉన్నప్పటికీ, కొన్ని పత్రికల యాజమాన్యాలు కలం యోధులను మరింత ప్రమాదంలోకి నెడుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగు మీడియాకు చెందిన ఓ పత్రిక యాజమాన్యం కరోనా పరిణామాల్లోనూ తన విలేకరులను జనం మీద దండయాత్ర చేసి యాడ్స్ కలెక్ట్ ద్వారా డబ్బులు తీసుకురావాలని ఆదేశాలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇందుకు పత్రిక ‘వార్షికోత్సవం’ అనే కారణాన్ని చూపుతుండడం గమనార్హం.
పత్రిక నిర్వహణకు డబ్బు అవసరమే కావచ్చు. కానీ అందుకు సమయం, సందర్భం కూడా ఉండాలి కదా? అనేది సదరు పత్రికలో పనిచేస్తున్న పాత్రికేయ వర్గాల వాదన. పైగా ఈ విషయంలో పత్రిక ముఖ్యుల వాదన కూడా విచిత్రంగా ఉండడం గమనార్హం. మార్కెట్లు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాయని అంగీకరిస్తూనే, సంస్థ పరిస్థితిని కూడా అర్థం చేసుకోవాలని ‘యాడ్ కన్నీరు’ కారుస్తోంది. ఇంతటి క్లిష్ట సమయంలోనూ సదరు పత్రిక ‘వార్షికోత్సం’ యాడ్ వసూళ్ల నగదు టార్గెట్ ఎంతో తెలుసా? అక్షరాలా రూ. 15.00 కోట్లు మాత్రమేనట. ఈ మొత్తం వివరాలను మరో అంతర్గత సర్క్యులర్ ద్వారా విపులంగా పత్రిక ముఖ్యుడొకరు వెల్లడించారు. అందులో పేర్కొన్న అంశాలను పూర్తిగా బట్టబయలు చేస్తే మరీ బాగోదుగాని, కరోనాలోనూ ఈ యాడ్ వసూళ్ల బాధలేమిట్రా బాబోయ్ అంటూ ఆయా సంస్థకు చెందిన జర్నలిస్టులు కొందరు వాపోతున్నారు. కరోనా కల్లోల పరిణామాల్లో ఎవరింటికి వెళ్లి యాడ్ కోసం తలుపు తట్టాలో? మరెవరిని డబ్బు కోసం దేబిరించాలో తెలియక తికమకపడుతున్నారు. కరోనా కల్లోలంలో అసలు తమ ప్రాణాలకు గ్యారంటీ ఏమిటంటూ తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.
ఈ ‘టార్గెట్’ వసూళ్ల సర్క్యులర్ లో ప్రత్యేకంగా గమనించాల్సిన విషయమేమిటోతెలుసా? యాడ్ ఇచ్చిన వ్యక్తి పూర్తి పేరు, చిరునామా, సెల్ నెంబర్ ను రిపోర్టర్ ఖచ్చితంగా ఇవ్వాలట. ఎందుకంటారా? రిపోర్టర్ ఏమైనా నొక్కేసి ఉంటాడా? అని సంస్థ ముఖ్యుల సంశయం కాబోలు. అబ్బే ఇది మనపై అనుమానం కాదంటూనే ఎన్ని ‘కొర్రీ’లతో సర్క్యులర్ ను జారీ చేశారో… కావాలంటే మీరే దిగువన చూడండి.