చెట్టు – వృక్షం – మహా వృక్షం
అన్నీ చెట్లే అనుకుంటాం కానీ… కొన్ని మాత్రమే చెట్లు. ఇంకొన్ని వృక్షాలు. మరికొన్ని మహావృక్షాలు.
ప్రతిదాన్ని కొట్టేందుకు (నరికేందుకు) ఒక పద్దతి ఉంది. చెట్టును నేరుగా నరకవచ్చు. మొదలు నరకగానే నేలకు ఒరిగి పోతుంది. తాడి, ఈత, అరటి, సరుగు మొదలైనవి.
వృక్షాలు అలా కాదు. వాటికి ముందు కొమ్మలు కొట్టాలి. ఆ తర్వాతనే మొదలు నరకాలి. వేప, చింత, మొదలైనవి.
ఇక మహా వృక్షాల విషయంలో కొంత జాగ్రత్త అవసరం. మొదట కొమ్మలు కొట్టాలి. తర్వాత వేర్లు, ఊడలు కొట్టాలి. ఆ తర్వాతనే మొదలు నరకాలి. రావి, మఱ్ఱి మొదలైనవి.
అయినా నరికే విషయంలో ఒక్కొక్కరిది ఒక్కో పద్దతి.
చెట్టును నరకడం ఒక పద్దతి. చంపడం ఒక పద్దతి.
నరకడానికి గొడ్డలో, రంపమో వాడతాం. చంపడానికి మాత్రం రెండు పద్ధతులు వాడతారు. 1. చెట్టు వేర్లు తెగగొట్టడం. 2. చెట్టు బెరడు చెక్కడం.
చెట్టు రకం, వయసు, మన అవసరం – ఈ మూడు విషయాలు ప్రాతిపదికగా పని ఉంటుంది. వేర్లు తెగ్గొట్టినా, బెరడు తొలిచినాా నీరు అందక చెట్టు ఎండిపోతుంది.
చెట్లను రెండు మూడు అవసరాలకు నరికేస్తాం. (1) ఇంటి కలప కోసం – అంటే తలుపులు, కిటికీలు, దర్వాజాలు, దూలాలు, వాసాలు… కుర్చీలు, మంచాలు, బెంచీలు… ఇలా రకరకాల అవసరాలకు. (2) వంట కలప – ఆహారం వండుకోడానికి. (3) వ్యవసాయం కోసం – అడ్డుగా ఉన్నచెట్లను కొట్టేసి ఆ భూమిలో సాగు చేసుకోడానికి.
(నోట్: ఇది చెట్ల గురించే…)
✍️ గోపి దారా