ప్రభుత్వ పథకాల తీరు తెన్నులపై విపక్షాలు విమర్శల వర్షం కురిపిస్తుంటే… పథకం లక్ష్యం ఏమిటో? ఎందుకు అమలు చేస్తున్నామో నిర్వచించి బాహాటంగా సమర్థించుకునే దమ్ము రాజకీయ నేతల్లో ఉండాలి. అప్పుడే ఆ పథకం నాయకున్ని చిరస్మరణీయున్ని చేస్తుంది. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిలో ఆ తెగువను ప్రత్యక్షంగా చూసిన జర్నలిస్టును నేను.
రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం గురించి ఉమ్మడి రాష్ట్రంలోని విపక్షాలు అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. ఈ పరిస్థితుల్లోనే కొత్తగూడెంలో పేదల కోసం భారీ ఎత్తున వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతున్న కార్యక్రమాన్ని నేనే (అప్పుడు ఖమ్మం సాక్షి బ్యూరో ఇంచార్జ్ గా ఉన్నాను) కవర్ చేయడానికి వెళ్లాను. కార్యక్రమం ముగిసింది. కొత్తగూడెం నుంచే సీఎం స్పీచ్ కు సంబంధించిన వార్త పంపాను.
కొద్ది సేపటికే సాక్షి హైదరాబాద్ ఆఫీసులో గల ఓ పెద్ద వ్యక్తి నాకు ఫోన్ చేసి సీఎం నిజంగా అలా వ్యాఖ్యలు చేశారా? అని న్యూస్ ఐటెంలో నేను లీడ్ గా తీసుకున్న అంశంపై ప్రశ్నించారు. ఏ టీవీల్లోనూ నువ్వు తీసుకున్న లీడ్ తో వార్త రావడం లేదని ఆ పెద్ద వ్యక్తి నన్ను నిలదీసినట్లు ప్రశ్నించారు. అది నా తప్పు కాదని నేను బదులు ఇచ్చాను… అది వేరే విషయం. మరుసటి రోజు సాక్షి పత్రికలో ‘ కార్పొరేట్ ఆసుపత్రుల కోసమే రాజీవ్ ఆరోగ్యశ్రీ’ కొత్తగూడెం సభలో సీఎం వైఎస్ స్పష్టీకరణ…అనే హెడింగ్ తో బ్యానర్ ఐటెంగా వార్త ప్రచురించారు. దీంతో టీవీలు కూడా లీడ్ మార్చుకుని మరుసటిరోజు వార్తను ప్రసారం చేశాయి.
గుండె సంబంధిత వంటి డబ్బు ఖర్చయ్యే జబ్బు పేదవాడికి వస్తే… ఖరీదైన కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళే ఆర్థిక శక్తి ఆ పేదవాడికి ఉండదని, అందుకే పేదవాడి గుండె ఆగిపోరాదనే లక్ష్యంతో ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించినట్లు వైఎస్ ఆ సభలో చెప్పారు. పేదవాడు ధైర్యంగా ఖరీదైన ఆసుపత్రిలో ఉచితంగా వైద్యం చేయించుకోవడం కోసం, కార్పొరేట్ ఆసుపత్రుల కోసమే ఆ పథకాన్ని అమలు చేస్తున్నట్లు వైఎస్ నిర్వచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆ తరహా వైద్య సేవలు లేవని కూడా ఆయన పేర్కొన్నారు దటీజ్ వైఎస్సార్…!
ఇంకో రెండు ఘటనలు:
ప్రభుత్వ అనుకూల పత్రికలో సర్కార్ వ్యతిరేక వార్తలు రాయడం అందులో పని చేస్తున్న జర్నలిస్టులకు సాధ్యమా? సీఎం వైఎస్ హయాంలో నేను రాసిన ఓ వార్తా కథనంతో నా ఉద్యోగం ఖతం అనుకున్నారు చాలామంది… ముఖ్యంగా వృత్తిపరమైన వ్యతిరేకులు. ఖమ్మం జిల్లాలో పని చేసిన ఓ కలెక్టర్ చర్యను తూర్పార బడుతూ ఓ వార్తాకథనాన్ని సాక్షిలో రాశాను. సీఎం వైఎస్ కు ఫిర్యాదు చేస్తానని ఆ కలెక్టర్ పొద్దున్నే నన్ను ఫోన్ లో దబాయించారు. సీఎంకు కంప్లయింట్ చేస్తానని బెదిరించారు కూడా. నో ప్రాబ్లం, చేసుకోండి అన్నాను. సాయంత్రానికి ఆఫీసు నుంచి ఫోన్ రానే వచ్చింది. ‘ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉండగా, జిల్లాలో మంత్రి ఉండగా పేదల ఇళ్ల స్థలాల పట్టాలు ఎవరి ప్రయోజనం కోసం ఆ కలెక్టర్ పోస్టు ద్వారా నేరుగా లబ్ధిదారులకు పంపారు? అందుకే రాశాను… అని సమాధానం చెప్పాను. ఫోన్ చేసిన వ్యక్తి నవ్వుతూ.., ఒకే అన్నారు.
మధిరలో సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సభ మరికొద్ది సేపట్లోనే జరగనుంది. జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల విషయంలో అధికారుల వైఖరిని నిరసిస్తూ మధిర రైల్వే ఓవర్ బ్రడ్జిపై బైఠాయించి రాస్తారోకో చేశాము. ఈ ధర్నాకు నేనే నాయకత్వం వహించాను. ‘సాక్షి’ ప్రతినిధిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేయడమేంటని కొందరు ఉన్నతాధికారులు నన్ను ప్రశ్నించారు. నేను మౌనంగానే ఉన్నాను. కొద్ది సేపటిలోనే వైఎస్ రాజశేఖరరెడ్డి రానున్నారు. సమాచార శాఖ అధికారులు ఆఘమేఘాల మీద దిగివచ్చి జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డులు వెంటనే ఇచ్చారు. ఈ అంశంపై కూడా నిఘా వర్గాల సమాచారం ద్వారా వైఎస్ దృష్టికి వెళ్లింది. కానీ నన్ను ఎవరూ ఏమీ అనలేదు. ప్రభుత్వం మనదైనా సమస్య పరిష్కారం ముఖ్యమైనప్పుడు వ్యతిరేక కార్యకలాపాలుగా భావించకపోవడం వైఎస్ కు మాత్రమే సొంతం. ఇప్పుడు ఈ పరిస్థితి మీడియాలో ఉందా? అనే ప్రశ్నకు సమాధానం అందరికీ తెలిసిందే. అందుకే డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చిరస్మరణీయ ముఖ్యమంత్రి.
✍️ ఎడమ సమ్మిరెడ్డి
(నేడు వైఎస్ జయంతి సందర్భంగా….)