ప్రజా సమస్యల మీద గళం ఎత్తాల్సిన కలం ప్రతీ ప్రెస్మీట్ లో తనకి జరుగుతున్న అవమానాల గురించి తనే రాసుకోలేని దౌర్భాగ్య స్థితిలో… తన కోసం తనే ప్రశ్నించుకోలేని నిస్సహాయతలో కొట్టుమిట్టాడుతోంది తెలంగాణ మీడియా.
జర్నలిస్టులు ఏవైనా ప్రశ్నలు అడిగితే వాళ్ళ పైన అసహనం వ్యక్తం చేస్తూ చులకనగా మాట్లాడుతున్నా కూడా ఒక్క సారి కూడా ప్రెస్మీట్ ను బహిష్కరించకుండా, నిరసనను కూడా వ్యక్తం చేయకుండా ఉంటూ, కనీసం వారి వారి పేపర్లలో, న్యూస్ ఛానెల్స్ లలో ఒక్క సారి కూడా ముఖ్యమంత్రి వ్యవహర శైలిని ఖండించకుండా ఉంటున్నారంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది.
ముఖ్యమంత్రిది నన్ను ఈ మీడియా వాళ్ళేం చేస్తారులే అనే అతి విశ్వాసమా…? లేక అధికారంలో ఉన్నారు కదా మనమేం చేస్తాం లే… ఆయన చెప్పిన ఆ నాలుగు మాటలేవో రాసుకొని పోదామనుకునే అక్షర బానిసత్వమా అనేదే అర్ధం కాని ప్రశ్న…. ఇంకో దరిద్రమైన విషయం ఏందంటే ప్రెస్మీట్లలో జర్నలిస్టుల మీద వేసే సెటైర్లకు తోటి జర్నలిస్టులే నవ్వడమనేది నిజంగా దురదృష్టకరం… చివరికి పరిస్థితి ఎక్కడి వరకు వచ్చిందంటే… ప్రజలు కూడా ఈ రోజు కేసీఆర్ ఏ జర్నలిస్టుపైన జోకులు వేస్తాడో? అని ఆసక్తిగా ప్రెస్మీట్ ను చూసేంతగా….!
లాక్ డౌన్ విధించిన తర్వాత సీఎం పెట్టిన అన్ని ప్రెస్మీట్లలో ప్రశ్నలను అడిగిన జర్నలిస్టులలో ఎవరో ఒకరి పైన తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. వాస్తవానికి రాష్ట్రంలో ఉన్న సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళాల్సిన భాద్యత మీడియా వాళ్ళ పైననే కదా ఉండేది? రైతు సమస్యల పైన నిరసన కార్యక్రమాలు చేసిన ప్రతిపక్షం వాళ్ళ పైన అసహనాన్ని వ్యక్తం చేసిండంటే దాన్ని రాజకీయ కోణంలో చూడొచ్చు. కానీ అవే రైతు సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లిన జర్నలిస్టుల పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం బాధాకరం…
వాస్తవానికి క్షేత్రస్థాయిలో మార్కెట్ యార్డుల దగ్గర గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. కొనుగోలులో తీవ్ర జాప్యం జరగడమో, తాలు పేరుతో ఎక్కువ ధాన్యాన్ని తూకం వేయడమో లేక తగినన్ని గన్నీ బ్యాగులు ఇవ్వకపోవడమో జరుగుతోంది. కొన్ని చోట్ల సొంత పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు కూడా తాము పండించిన పంటను అమ్ముకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
ఇకపోతే పోతిరెడ్డిపాడు లాంటి అంశాలపైన ప్రశ్నలు అడిగిన జర్నలిస్టులపైన ఒంటికాలిపై లేచి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. ప్రాజెక్టుల అంశాలపై ప్రశ్నించినా, ఇంకా రాష్ట్రంలో ఉన్న మిగితా సమస్యలపైన ప్రశ్నిస్తే కూడా అసహనం వ్యక్తం చేస్తూ సమాధానాలు చెప్పకుండా దాటవేత ధోరణిని అనుసరిస్తున్నాడు.
మీ యజమాన్యాలే నా చెప్పుచేతల్లో ఉన్నాయి. మీరేంది నన్ను ప్రశ్నించేదనే అహంకారమో
లేక అధికారంలో ఉన్నన్ని రోజులు నన్నేమీ చేయలేరనే ధైర్యమో కానీ మొత్తం మీద రాష్ట్రంలో నడుస్తున్న ఈ తరహా పాలనలో ప్రజలతో పాటుగా మీడియా వాళ్ళు కూడా భాదితులే, భాగస్వాములే అనేది కాదనలేని వాస్తవం….