ఖమ్మం జిల్లాలో శుక్రవారం భారీ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ పరిణామం సహజంగానే ప్రజల్లో ఒకింత ఆందోళనకు కారణమైంది. జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఒక్కరోజే 385 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ కావడం గమనార్హం. ఇంత భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదు కావడం జిల్లాలో ఇదే మొదటిసారి.
ఇదే దశలో జిల్లాలో ఇంత భారీ సంఖ్యలో టెస్టులు నిర్వహించడం కూడా ఇదే తొలిసారి కావడం గమనార్హం. మొత్తం 1,658 మందికి ఈరోజు ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు (ఆర్ఏటీ) నిర్వహించగా, 385 మందికి పాజిటివ్ గా తేలింది. చికిత్స పొంది శుక్రవారం డిశ్చార్జి అయినవారి సంఖ్య 138 కాగా, 73 మందిని ఐసొలేషన్ వార్డులో ఉంచారు.
జిల్లా వ్యాప్తంగా దినసరి కనీసం రెండు వేలకు తగ్గకుండా కరోనా టెస్టులు నిర్వహించాలని కలెక్టర్ ఆర్వీ కర్ణణ్ ఆదేశించారు. దీంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనేగాక, అర్బన్ హెల్త్ సెంటర్లలోనూ ర్యాపిట్ టెస్టులు నిర్వహిస్తున్నారు. టెస్టుల సంఖ్యకు అనుగుణంగానే పాజిటివ్ కేసుల సంఖ్య కూడా భారీ ఎత్తున నమోదవుతున్నాయి.