దానం అంటే ఏమిటి? దానాల్లో రక రకాల దానాలు ఉంటాయి. అందులో గుప్త దానాలు కూడా ఉంటాయి. దానంగా తాము చేసిన సాయాన్ని మరెవరికీ చెప్పుకోకపోవడం, ఎటువంటి ప్రచారానికి ఇష్టపడకుండా చేసేదాన్ని గుప్త దానం అంటుంటారు. ‘గుప్తం’ అంటేనే రహస్యం. రహస్యంగా ఉంచే దానాన్నే గుప్త దానమని నిర్వచిస్తుంటారు.
కానీ వర్తమాన పరిస్థితుల్లో చాలా మంది ఏం చేస్తున్నారో తెలుసు కదా? ‘ఈత’ ఆకు దానం చేసి ‘తాటి’ ఆకు విస్తీర్ణంలో ప్రాచుర్యం పొందేందుకు తహతహలాడుతున్నారు. దానకర్ణుల్లా ఫోజు కూడా కొడుతున్నారు. ఇందుకు మీడియాను, సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటున్నారు. సరే… ఎవరి తాహతుకు తగినట్లు వారు దానం చేస్తుంటారనేది వేరే విషయం.
సర్కారువారి భూములను, దేవుడి మాన్యాలను కబ్జా చేస్తున్న అనేక మంది బాగోతాల గురించి తెలిసిందే. ఇందుకు అధికారాన్ని, పలుకుబడిని ఉపయోగిస్తున్న అనేక మంది నేతలు వివిధ ఘటనల్లో వివాదాస్పదమైన ఘటనలు కూడా ఉన్నాయి. ప్రభుత్వాలను నడిపేందుకు రూకలు లేవని, ఖజానా నిండుకుందనే నెపంతో దేవుడి భూములకు ఎసరు పెట్టేందుకు ప్రయత్నించిన పాలకులనూ చూశాం, చూస్తున్నాం కూడా. ఇవన్నీ ఇప్పుడెందుకంటే…?
పైన ఫొటో చూశారు కదా? దివంగత ప్రధాని ఇందిరా గాంధీ శిరస్సు వంచి, వినమ్రంగా, చేతులు జోడించి మరీ ఓ వ్యక్తికి నమస్కారం చేస్తున్న అరుదైన ఫొటో ఇది. ఏమాత్రం బెరుకు కూడా లేకుండా, ఎంతో హుందాగా ప్రధాని ఇందిర నమస్కారానికి ప్రతినమస్కారం చేస్తున్న ఆ వ్యక్తి పేరు పూసపాటి విజయరామ గజపతి రాజు. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు తండ్రి.
అయితే మాత్రం ప్రధాని హోదాను అనుభవించిన ఇందిరాగాంధీ అలా శిరస్సు వంచి వినయపూర్వకంగా ఆయనకు నమస్కారం చేయడమేంటి? అని ఆశ్చర్యపోకండి. దానం చేసేవారికి అప్పట్లో ప్రధాని హోదాలో గల రాజకీయ నాయకులు సైతం ఇలా గౌరవం ఇచ్చేవారు. ఇంతకీ విజయరామ గజపతి రాజు అంత గొప్ప దానం ఏం చేశారూ అంటే…? ఆంధ్రా విశ్వవిద్యాలయానికి అప్పట్లో 600 ఎకరాల భూమిని దానం చేశారు. అప్పటిదేనట ఈ అరుదైన ఫొటో.
దానం ఇచ్చేవారు కర్ణుడిలా ఉండాలి. స్వీకరించేవారు వినయ, విధేయతలను ప్రదర్శించాలి. అదీ ధర్మం. కానీ ఇప్పడు దానం చేస్తున్నవారు, స్వీకరిస్తున్నవారు ఎలా ఉన్నారో, మరెలా వ్యవహరిస్తున్నారో, ఎటువంటి దృశ్యాలు సాక్షాత్కరిస్తున్నాయో…? కొత్తగా విడమర్చి చెప్పాల్సిన అవసరం లేదుగా!