ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో నేడు పొలిటికల్ బాంబ్ పేలబోతున్నదా? తెలంగాణా రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పే స్కెచ్ రచిస్తున్నారా? ఇందుకు ఖమ్మంలోని పొంగులేటి నివాసం వేదిక కాబోతున్నదా? సీఎం కేసీఆర్ ను వ్యతిరేకించిన నేతలందరూ ఒకే వేదికగా నిర్వహిస్తున్న లంచ్ రాజకీయం సరికొత్త మలుపునకు దారి తీసే అవకాశం ఉందా? ఇటువంటి అనేక సందేహాలకు, రాజకీయ చర్చకు ఆస్కారం కలిగిస్తున్న ఓ కీలక సమావేశం మరికొద్ది గంటల్లో ఖమ్మంలో జరగబోతోంది. ఇంతకీ ఏం జరుగుతోందనేగా మీ డౌటు. అయితే ఈ పొలిటికల్ స్టోరీ పూర్తిగా చూడాల్సిందే.
ఖమ్మంలోని పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసానికి మరికొద్ది గంటల్లో పలవురు బీజేపీ నాయకులు వస్తున్నారు. బీజేపీ చేరికల కమిటీ చైర్మెన్ ఈటెల రాజేందర్ తోపాటు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, యెన్నం శ్రీనివాసరెడ్డిలు మధ్యాహ్న భోజన సమయానికి పొంగులేటి ఇంటికి చేరుకుంటారని సమాచారం. పొంగులేటిని బీజేపీలోకి ఆహ్వానించేందుకు వీరందరూ ఇక్కడికి వస్తున్నట్లు ప్రచారం మాత్రం జరుగుతోంది. ఇది పైకి కనిపిస్తున్న సీన్ మాత్రమేనని, అసలు స్కెచ్ వేరే ఉందనేది విశ్వసనీయ సమాచారం. నిజానికి బీజేపీలోకి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఆహ్వానించడానికి ఇంతమంది నాయకులు ఖమ్మం వరకు రావలసిన అవసరం లేదనేది రాజకీయ పరిశీలకుల భావన. అందులోనూ ఈటెల రాజేందర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు మంచి స్నేహితులు కూడా. బీజేపీలో చేరడం వల్ల ‘ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఒక్క బీఆర్ఎస్ నాయకున్ని కూడా అసెంబ్లీ గేట్ తాకనివ్వను’ అనే శపథాన్ని పొంగులేటి నెరవేర్చుకునే అవకాశాలు దాదాపుగా మృగ్యమైనట్లుగానే భావించవచ్చు. కాంగ్రెస్ లో చేరితే మాత్రం తన శపథం నెరవేరే ఛాన్స్ ఉందనేది పొంగులేటి అనుచరుల అంచనా. మరి ఈ పరిస్థితుల్లో పొంగులేటి బీజేపీలో చేరే ఛాన్స్ ఉందా? లేదా? అనేది ఇప్పటికిప్పుడు సమాధానం లేని ప్రశ్నే. మరి ఈ పరిస్థితుల్లో బీజేపీ చేరికల కమిటీ నాయకుల యత్నానికి పొంగులేటి తలూపుతారా? లేదా? అనే సంగతి ఎలా ఉన్నప్పటికీ, అసలు పొంగులేటి నివాసంలో జరిగే సమావేశపు రహస్య ఎజెండా ఏమిటనే అంశంపైనే భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ‘తెలంగాణా రాజ్య సమితి’ పేరుతో ఇప్పటికే ఓ పార్టీ రిజిస్టరై ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఒకరు ఈ పేరును రిజిస్టర్ చేసినట్లు సమాచారం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గమే ఓ వ్యూహం ప్రకారం మెదక్ జిల్లాకు చెందిన వ్యక్తి చేత తెలంగాణా రాజ్య సమితి పేరును ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ చేయించారనే వాదన కూడా ఉంది. ఈ పరిణామాల్లో మరికొద్ది గంటల్లో పొంగులేటి నివాసంలో జరిగే ‘లంచ్’ మీటింగ్ లో అసలు రాజకీయ చర్చ ప్రారంభం కానున్నట్లు విశ్వసనీయ సమాచారం. అటు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఇటు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్ రెడ్డి, మరో మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి, ఇంకోవైపు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఈటెల రాజేందర్ వంటి నాయకులు పొంగులేటితో లంచ్ రాజకీయ ఎజెండాలో తెలంగాణా రాజ్య సమితి ప్రస్తావన కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ప్రతి ఉమ్మడి జిల్లాలో తీవ్ర ప్రభావం చూపగల నాయకుల మూకుమ్మడి ఎజెండాతో మాత్రమే సీఎం కేసీఆర్ ను ఢీకొట్టగలమనే చర్చలు ఫలప్రదమైతే తెలంగాణా పొలిటికల్ సీన్ పూర్తిగా మారే అవకాశం ఉందంటున్నారు. ఇటువంటి నేతలందరూ తెలంగాణా రాజ్యసమితి పేరుపై ఎవరి జిల్లాల్లో వారు ప్రభావం చూపితే పరిస్థితులు సంచలనంగా ఉంటాయని అంచనా వేస్తున్నారట. ఈ అంశంపై చర్చలు ఓ కొలిక్కి రాకపోతే చేరడానికి పొంగులేటికి ఎలాగూ ఇటు బీజేపీతోపాటు అటు కాంగ్రెస్ కూడా రెడ్ కార్పెట్ పరుస్తూనే ఉన్నాయి. ఇంతకీ తెలంగాణా రాజ్య సమితి పార్టీపై చర్చ కోసం ఈటెల రాజేందర్, రఘునందన్ రావు వంటి బీజేపీ నాయకులు ఎందుకు హాజరవుతారనేగా అసలు ప్రశ్న. ఏమో సీఎం కేసీఆర్ ను గద్దె దింపేందుకు బీజేపీ వేస్తున్న ఎత్తుగడల్లో ఇదీ ఓ వ్యూహం కాదనేందుకు అస్కారం ఉందా? అదీ అసలు ప్రశ్న.