భధ్రతలో రాజీపడేది లేదని
భారత్, చైనా దేశాల పాలకుల
బహిరంగ ప్రకటనలు.
చర్చలతోనే సమస్యలు పరిష్కరించుకుంటామని ఉద్ఘాటన.
సమస్య పరిష్కారమైతుందని
ప్రధాన దేశాల ప్రతినిధులు
ఆశాభావం వ్యక్తం చేశారు.
“కొద్దిసేపటికి ముందు
ఇరు దేశాల సైనికులు
పరస్పరం కుత్తుకలు తెగ్గోసు
కున్నారు”.
తూర్పు లద్దాక్ గాల్వాన లోయలో
ఇరవై మంది ఇండియన్ సైనికుల
బలి.
సరిహద్దుల్లో
ఉద్రిక్తతల ఆరని మంటల ఆటలో
వేటకుక్కలుగా మారిన
విస్తరణవాదకాంక్ష దేశాలు.
చర్చలతో పరిష్కారమంటూ
దాడులకు తెగబడే యుద్ధకాంక్ష
ఎత్తుగడల ముందు
ఎర్రన్న ప్రపంచ మానవాళి ఐక్యత నినాద డొల్లతనం వెల్లడైంది.
సరిహద్దులు దాటని డ్రాగన్ దేశభక్తికి
గ్రేట్ వాల్ అడ్డుగోడగా నిలిచింది.
చైనా, పాకిస్థాన్ కారిడార్
బ్రిడ్జి నిర్మాణం
భారత సేనల ప్రాణాలు బలి
తీసుకున్నదీ.
ఇండియా, డ్రాగన్ భాయీ…భాయీ.
కామ్రేడ్, కాషాయం హాయ్…హాయ్.
అంకుల్ శ్యామ్ హోయ్…హోయ్.
ఉప ఖండం పెద్దన్నకు
చుట్టూ బిగుసుకుంటున్న ఉచ్చు.
పక్కన బల్లెంలా ఉన్న పాకిస్థానుతో
నిత్య కయ్యం.
పొరుగున ఉన్న చైనాతో గతంలో యుద్ధం.
తాజాగా సరిహద్దు తగాదాతో కమ్ముకున్న ఉద్రిక్తత మేఘాలు.
చివరకు నేస్తం నేపాలుతో పెరుగుతున్న హద్దుల గుద్దులాట.
అయినా! ఎగిరేసే కీర్తిపతాకలు
తగిలించుకునే భుజకీర్తులు.
కాసింత కూడా సిగ్గులేని తనువులు.
రంగుల కలలు సృష్టించి
కట్టుకథలు అల్లి
ఉద్రిక్త దేశభక్తి ఉపన్యాసాలు
అబద్ధాల విన్యాసాలు దాగిన
అర్థ సత్యాల
ఈస్టుమన్ కలర్ వార్ ఫిల్మ్.
చూసి తరించాల్సిన దృశ్య కావ్యం.
పొరుగుదేశ భూభాగంలోకి
అక్రమంగా చొరబడి చేసే
కమాండ్ కంట్రోల్ కమెండో దాడులు,
సర్జికల్ స్ట్రైకులు,
స్పెషల్ ఆపరేషన్లు
టెర్రరిస్ట్ మాటున దాడులు
ఆత్మరక్షణ పేర చేస్తున్న దేశాలేవైనా?
నగ్న మారణకాండల రణతంత్రం.
నిరంతరం శాంతి ప్రవచనాల వల్లింపులు.
రాలిపోయే ప్రాణాలు,
గాలిలో దీపాలు
పాదాల చుట్టూరా పారే నెత్తుర్లు
తెగిపడిన శిరస్సులు
విరిగిన చేతులు,కాళ్ళు
చిధ్రమైన దేహాలు
సగం తెగి వేలాడుతున్న అవయవాలు
ఆనవాళ్లు లేని శరీరాలు.
ఆధిపత్యం లక్ష్యంగా సాగే
మానవుడి మానసిక వికలాంగత.
రణభూమిలో కదిలే భీకర దృశ్యాలు.
ఆస్పత్రుల్లో హాహాకారాలు.
మరుభూమిలో
రాలిన పూల సమాధుల
సమాహారాలు.
పాకిస్థాన్ , బంగ్లాదేశ్, చైనాతో సహా
ప్రపంచ యుద్ధాల దారిలో
ఎందరో ఒరిగిపోయిన
భారతావని ముద్దు బిడ్డలు.
జాతీయ జెండా రెపరెపలను
గుండెల్లో నిలుపుకున్న ధీరులు.
వీరజవాన్లు నేలరాలితే పతాక శీర్షికలు
ఆకానికెత్తే శబ్ద తరాంగాల మోతలు
వెలగట్టలేని త్యాగాలకు
వీర ఛక్రల ప్రదానం.
పార్థీవ దేహాలు తరలించేందుకు
ప్రత్యేక విమానాల ఏర్పాటు
శవపేటికపై కప్పిన జాతీయ పతాకం
అధికార లాంఛనాల అంత్యక్రియలు
తుపాకి తూటాలు పేల్చి గౌరవ వందనం
వీర జవానులకు అర్పించే
ఘన నివాళులు.
పాలకుల పాచికలకు బలిపీఠంపై
తలలువాల్చే నిరంతర త్యాగధనులు.
తొలి తూటాల బలి పుత్రులు.
కన్నవారికి మిగిలిన కడుపు కోతలు
భార్యా బిడ్డలకు దక్కిన గుండెకోతలు
అధికార పీఠాధిపతులకు వారధులు.
కాలిన చితిమంటల్లో బూడిదయ్యే
సగటు సైనిక జీవితాలు.
సేనల సమాధుల కింద
దేశభక్తి విత్తులు నాటి
నెత్తుటి ఎరువులేసి
త్యాగాల వృక్షాలకు ఓట్ల పంట పండించి
అధికార ఫలాలు అందుకునే
రాజకీయ సేద్యగాళ్ళ రసవత్తరపోటీ!
✍️ రవి సంగోజు