చావు పుట్టుకల గుట్టు
తెలియని పసికందుకు
స్తన్యమిచ్చి సాకే తల్లి
జీవించి లేదని తెలియక
తట్టిలేపే చిన్నారి యత్నం
గుండెలవిసిపోయే చిత్రం
మానవత్వం పై చెరగని మచ్చ
కన్నీటి పేగు బంధం
ఆకలిదప్పులు దీర్చే
అక్షయ పాత్ర అమ్మ
బతుకు నడక నేర్పే
మొదటి గురువు తల్లి
కష్ట సుఖాలలో నీడై ఉండే ప్రేమ మూర్తి
ఆకలి మంటలతో
రాళ్ళను ఉడికిచ్చిన తల్లి
గడ్డి తిని బిడ్డలకు పాలిచ్చిన
గోమాత ఆ మహా తల్లి..
ఇక లేనే లేదని
తిరిగి రానే రాదని
రైల్వే ప్లాటుఫారం పై
అమాయకంగా ఆడుకుంటున్న
ఆ చిట్టి బిడ్డకు అర్థం చేయుంచే
ఆత్మ నిర్భరత వుంటే
ముందుకు రండి ఖద్దరు దొరలు
మాయదారి కరోనా మీ సృష్టి
ఆకలి చావుల పాపమూ మీదే
లాక్ డౌన్ తో కష్టజీవుల
రెక్కలు విరిచి కూటికి దూరం
కాటికి దగ్గర చేసిందీ మీరే
శ్రమజీవుల గుండెలపై
తూటాలు గురిపెట్టి
పెట్టుబడిదారులకు లక్షల కోట్లు పంచి
పేదలను ఆకలికి చంపిన పాలకులు
ఉంటే నేమి పోతేనేమి
పేదలను విస్మరించిన పాలకులు
మాట్లాడుతున్నారు మతితప్పి
చావును మోసుకువచ్చే
శ్రామికరైలు మరణాలు సహజమేనట
హింసోన్మాదం తలకెక్కి
మూసుకు పోయిన రాబందుల కళ్ళు
ఫటిల్లున పేలిపోవాలి
పేదల కష్టాలు పోయే రోజు
పెళ పెళ మంటూ రావాలి
అనాధ జీవితం ఒంటరే
ఆలనా పాలనా దయాదాక్షిణ్యాలే
చీదరింపు ఈసడింపులతో ఎదిగి పెరిగి
కన్నతల్లి చావుకి కారణాలు
కష్టాలు కన్నీళ్ల మర్మాన్ని
కనిపెట్టే తీరుతాడు ఆ బిడ్డడు
కన్నీటి పేగు ఋణం తీర్చుకొంటాడు
✍️ మాదాసి రామమూర్తి
(బీహార్ రాష్ట్రంలోని ముజఫర్ పూర్ రైల్వే స్టేషన్లో కనిపించిన ఓ తల్లి యాదిలో…)