విరబూసినా పొన్నచెట్టు కన్ను గీటితే
మనసిరిగిన చెట్టుకొమ్మ మనువే వద్దన్నది
జతకట్టిన జంట పక్షి ఒంటరిగా మారి
కలిసి తిరిగిన వలపోతల కన్నీరయ్యింది
గాయపడ్డ గువ్వ గొంతుక నెత్తురోడింది
గుప్పుమన్న గుభాలింపును సంపెంగలని భ్రమిసితే
విచ్చుకున్న గులాబీల ముళ్ళై గుచ్చుకున్నాయి
కన్నపేగును…ఉన్న ఊరు వదిలివస్తే
బతుకుదెరువు కరువై దేబిరిస్తున్నాం
తాటిని చుట్టేసిన మానులా
బహుళజాతి కంపెనీలతో విష కౌగిటి ఒప్పందాలు
జాలన్నదేలేని పరాన్నజీవుల్లా జలగలై పీల్చే ఊడల మర్రి
ఉక్కిరిబిక్కిరితో ఊపిరితీసే అపస్వరాల గానం
అల వైకుంఠ’పురాని’కేగే విషాదగీతం
శ్రమజీవి స్వేదజలంతో దప్పిక తీర్చుకునే రక్తపింజరలు
సన్నాహాలు చేయండిరా!
సామూహిక ఖననాలకు!!
సామాన్యులం కదా!
సమిష్టి చితులు పేర్చండి!!
చావు ఖర్చులన్నా తగ్గుతాయీ!!!
✍️ రవి సంగోజు
Photo credit: PTI