రైతులకు బంధువులమంటూ
పాత చుట్టరికాలు
కలుపుతూ
వసంతం అరుదెంచక ముందే
కోయిలమ్మలా!
కొమ్మెక్కి
కొత్త రాగం ఎత్తుకున్నారు.
ఏలికలు
చిలుక పలుకుల్లా
బంగారు ముచ్చట్లు వల్లెవేస్తున్నారు.
పంజరంలో బందీగా ఉన్న
రామ చిలుకా
రా! బయటికి
మా రాత, కర్మల జాతకం చెప్పమ్మా.
అయ్యగారి మాటల అర్థాలు, గూఢార్థాలు, పరమార్థాలు
సెలవియ్యవమ్మా.
అజ్ఞానులం మేము !?
ఆడమంటే
ఎగిరి దునికి, పాడేటోళ్ళం
ఎంతైనా
ఎడ్డిబావులోల్లం కదా?
మాదంతా
గుడ్డెద్దు చేనులో పడ్డట్లు
మీరెట్ల చెప్పితే అట్లనే గదా!
పంట భూముల్లో
నిచ్చెనలేసి
మడికట్టులో
మేడలు కడుతున్నారు.
బురద పొలంలో
అడుగుపెట్టి
మా అనుభవాలను గణించండి.
సాధ్యాసాధ్యాలపై స్పష్టత వస్తుంది.
వేసే పంటకూ
ఈ కొత్త బాటకు దర్శకులెవరూ?
మార్గదర్శనం ఎవరిదీ?
లాభాలెవరికి?
నష్టం ఎవరికీ? నాయనా!
రైతు బంధు భారమైతుందా!
అమలుకు అష్టవంకర్లెందుకూ?
అంతా జంతర్ మంతర్ చూమంతరేనా!?
సంప్రదాయం
చట్టుబండలై
జొన్న,శెనగ,పెసర,కంది తగ్గిపోయే.
ఆధునికం
ఆగమాగంజేస్తే
పత్తి, మిర్చి, వరి దిక్కాయే.
అటు, ఇటుగానీ బతుకులై
త్రిశంకు స్వర్గం తీరాయే.
గిట్టుబాటు
పచ్చి బూటకమని
మద్ధతు ధర మిథ్యని తేలింది.
మార్కెట్ మాయాజాలంలో
దండుకునే దళారులదే రాజ్యం.
ఎంఎన్సీ ‘విత్తు’ కంపెనీల కుచ్చుటోపీలు.
సర్కార్లకు
అంతా తెలిసినా
అధికారులుకు
వాటాలున్నా
పాత తెలంగాణ పహిల్వాన్లాయే
నయా తెలంగాణ నిర్మాతలు కదా!?
కాలం ఆడుకునే
సయ్యాటలో
ప్రమిదలూ
సమిధలూ వీరే కదా?
అప్పులు కుప్పలుగా పెరిగినా
చెక్కుచెదరనిదీ
రైతు భూ దీక్ష.
పరువు కోసం
ప్రాణమిచ్చే
మాట తప్పని
మనోనిబ్బరం.
ఆత్మగౌరవ ప్రతీక భూమిపుత్రుడు.
కార్పొరేట్లతో
కలిసే ‘సాగు’దామా?
కలో గంజో కలిసి తాగుదామా?
అంతా మీదే రాజ్యం.
అడిగేటోడు ఎవరున్నారు?
నిండా మునిగినంక చలి ఎక్కడిది.
కొత్తగా ఎవుసం షురూ చెయ్యాలట
ఇగ
ఎడ్లకు ‘ముందు’ నాగలి కట్టాలె!
✍️ రవి సంగోజు