గౌరవనీయులు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రివర్యులు,
కల్వకుంట్ల తారక రామారావుగారి
దివ్య సముఖమునకు…
అయ్యా…
నా పేరేమిటో, జాతి ఏమిటో కూడా తెలియని దీన స్థితిలో ఉన్నాను. ప్రస్తుత నా అవతారాన్ని, రూపు రేఖలను చూసి తమరు కూడా నన్ను గుర్తు పడతారని నేను భావించడం లేదు. ఎందుకంటే నా కొమ్మలకుగాని, రెమ్మలకుగాని ఎక్కడా ఒక ఆకుతో కూడిన అచ్ఛాదన లేకుండా జీవచ్ఛవంలా ఉన్నాను. కానీ నేను ఎక్కడ ఉన్నానో మాత్రం చెప్పగలను. తెలంగాణా రాజధాని హైదరాబాద్ నగరంలోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయ ఆవరణలో ఉన్నాను. దాదాపు ఏడాదిన్నర క్రితం అనుకుంటా.. 2018 ఆగస్టు 31వ తేదీన సదరు కార్యాలయ ఆవరణలో నారు దశలో ఉన్న నన్ను మీరే నాటి, తమరి అమృత హస్తాలతో నీరు కూడా పోశారు. మీ చేతుల మీదుగా నాటుకున్న నేను ఏపుగా ఎదుగుతానని, పది మందికి నీడనిస్తానని, నా పచ్చటి నీడలో ఇక్కడికి వచ్చేవారు ఆహ్లాదకరంగా సేద తీరుతారని ఎంతో సంతసించాను.
కానీ నా ఆశలు అడియాశలయ్యాయి. మీరు నాటిన తర్వాత నా ఆలనా, పాలనా చూసేవారు లేకుండాపోయారు. ప్రస్తుతం నాకు ప్రాణం ఉందో, లేదో కూడా తెలియని దయనీయ పరిస్థితిలో ఉన్నాను. హైదరాబాద్ నగరంలోని 1.60 లక్షల హెక్టార్ల అటవీ భూమిలో విరివిగా చెట్లు పెంచాలని, దట్టమైన అడవులుగా మార్చాలని నిన్ననే నాన్నగారు కేసీఆర్ సార్ ఆదేశాలు జారీ చేశారు. నాన్నగారి ఆదేశం ప్రకారం, ఆకాంక్ష మేరకు నన్ను కూడా ఆయా అటవీ విస్తీర్ణంలో ఓ అటవీ మొక్కగానే భావించి, నేను చెట్టుగా ఎదిగేందుకు కాస్త ఆదేశాలు జారీ చేస్తారని వినమ్రంగా మనవి చేస్తున్నాను. మౌనంగానే ఎదగమని మొక్కలు చెబుతాయని ఆయనెవరో కవి సినిమా పాట రాసినట్లున్నారు. కానీ ఇన్నాళ్లపాటు మౌనంగా ఉన్నందునే నా పరిస్థితి ఇలా తయారైంది. కావున నా యందు దయ తలచి నేను ఇంకా కొన ఊపిరితో ఉన్నట్లయితే తమరు నన్ను కాపాడుతారని ఆశిస్తున్నాను.
కృతజ్ఞతలతో…
-మౌనంగానే ఎదగలేక… గొంతు విప్పిన మొక్క