పైన మీరు చూస్తున్న ఈ ఫొటో ఎవరు తీశారు? ఎప్పుడు తీశారు? ఎందులో పబ్లిష్ అయింది? వంటి ప్రశ్నలేవీ అడక్కండి. కరోనా కల్లోలపు తాజా పరిణామాల్లో మాత్రం ఈ ఫొటో సూపర్ హిట్టే కాదు… బంపర్ హిట్టు కూడా. అందుకే కాబోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతూ ఒకటే వయ్యారాలు పోతోంది. నన్ను పరిశీలనగా చూసి లాక్ డౌన్ 4.0 గురించి నిజం తెలుసుకోండి… అంటూ చెప్పకనే చెబుతోందీ చిత్రం. ఏముందీ ఫొటోలో అంటే…?
గుర్తు తెలియని ఓ ప్రాంతానికి రక్షణగా గేట్ వేసి ఉంది. తాళం కూడా బిగించే ఉంది. కానీ ఎటువైపు నుంచైనా ఆయా ప్రాంతంలోకి ఎవరైనా ప్రవేశించవచ్చు. ఈ మాత్రం దానికి ఆ ప్రాంతానికో గేటు… దానికో తాళమా? అని నిట్టూర్చకండి. ప్రస్తుత లాక్ డౌన్ అమలు తీరుతెన్నులపై నెటిజన్లు విసిరిన ఫొటో అస్త్రమిది. చిత్రం తాజా వాస్తవాన్నే ప్రతిబింబిస్తోంది కదూ? వైన్ షాపులు తెరిచారు. ఆర్టీసీ బస్సులు, ఆటోలు, కార్లు తదితర వాహనాలు నడుస్తున్నాయి. నిర్ణీత సంఖ్యలో, నిర్దేశిత మార్గాల్లో రైళ్లు కూడా నడిపేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఓ రకంగా ప్రజారవాణా ప్రారంభమైంది. ఇక వినోదాన్ని పంచే సినిమాలకు సంబంధించి చిత్ర పరిశ్రమ బతకాలనే తపనతో తెలంగాణా సీఎం కేసీఆర్ సానుకూల ధృక్పథంతోనే ఉన్నారు. నిన్న సినీ పెద్దలతో జరిగిన సమావేశంలో ఇందుకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి.
ఇక మిగిలిందేమిటీ.. అంటే…? బార్లు, పబ్బులు, ఫంక్షన్ హాళ్లు, జిమ్ములు వగైరాలన్నమాట. వాటికీ వెసులు బాటు ఇచ్చేస్తే ఓ పనై పోయేది కదా! అని వ్యాఖ్యానిస్తే మాత్రం… ఇవ్వరని గ్యారంటీ ఏమీ లేదు. లాక్ డౌన్ పరిణామాల్లో దశలవారీగా ఒక్కో దానికి అనుమతులు ఇచ్చే అవకాశమూ లేకపోలేదంటున్నారు. ఇప్పుడిక బలుసాకుతో పనే లేదు… అన్ని వర్గాలూ బతకాలి. ఏ రంగమూ చావాల్సిన అవసరమే లేదు. ఈ మాత్రం దానికి లాక్ డౌన్ ఎందుకు? అంటే… ఏమో…? అదీ జరగొచ్చు. పరిస్థితులను బట్టి లాక్ డౌన్ కూడా పూర్తిగా ఎత్తేయవచ్చు. కరోనా కేసులు పెరిగితే మళ్లీ విధించనూ వచ్చు. విధించకనూ పోవచ్చు. కరోనాతో జనం సహజీవనం చేయాల్సిందేనని ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఇప్పటికే పాలక పెద్దలు స్పష్టం చేశారు కూడా! ఇన్ని వాక్యాలు చదివాక పైన చూసిన ఫొటో ‘సూపర్ హిట్టు’ అని అంగీకరించక తప్పదు. అదీ అసలు సంగతి.