కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు దాదాపుగా సిద్ధపడ్డ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావును కట్టడి చేసే దిశగా అధికార పార్టీ పావులు కదుపుతోందా? రాజకీయంగా ఎటువంటి అవినీతి మచ్చలేని తుమ్మలను నిలువరించడం ఎలా? అందుకు అనుసరించాల్సిన వ్యూహమేంటి? పాటించాల్సిన పద్ధతులేమిటి? ఎలాగైనా సరే తుమ్మల ప్రాభవాన్ని, ప్రభావాన్ని తగ్గించేందుకు అవసరమైన అస్త్రమేంటి? అనే ప్రశ్నలకు అధికార పార్టీ నేతలు సమాధానాలు వెతుక్కుంటున్నారా..? అంటే ఔననే ప్రచారం జరుగుతోంది. ఇంతకీ తుమ్మలను ఎదుర్కునేందుకు అధికార పార్టీ పెద్దలు ఎంచుకున్న అస్త్రమేంటి? వాచ్ దిస్ స్టోరీ..
నిజానికి తుమ్మల నాగేశ్వర్ రావు రాజకీయ జీవితం తెరిచిన పుస్తకమే. ప్రైవేట్ సంభాషణల్లోనేగాక, అప్పుడప్పుడు బహిరంగ ప్రదేశాల్లోనూ కాస్త ‘నాటు’ భాషను ఉపయోగిస్తుంటారనే పేరు మినహా, రాజకీయంగా తుమ్మలపై ఎటువంటి అవినీతి మచ్చ లేదనే పేరు ఉండనే ఉంది. తుమ్మల రాజకీయ నేపథ్యం గురించి కొత్తగా చెప్పాల్సింది కూడా ఏమీ లేదు. తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన తుమ్మల అంచెలంచెలుగా రాష్ట్ర స్థాయి నాయకునిగా ఎదిగారు. ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావానంతరం మారిన రాజకీయ పరిణామాల్లో సీఎం కేసీఆర్ టీడీపీలో గల తుమ్మలను పిలిచి మరీ మంత్రి పదవినిచ్చారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఓటమిని చవి చూసిన తుమ్మలకు ఈసారి టికెట్ కూడా దక్కలేదు. దీంతో ఆయన అనివార్యంగా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధపడినట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
మచ్చ లేని రాజకీయ నాయకునిగా పేరు తెచ్చుకున్న తుమ్మల కాంగ్రెస్ పార్టీలో చేరితే అధికార పార్టీకి భారీ కుదుపు తప్పదని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. కేవలం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనేగాక రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో తుమ్మల ప్రభావం తీవ్రంగానే ఉంటుందని భావిస్తున్నారు. ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గం ఓట్లకు భారీ గండి పడే ప్రమాదాన్ని అధికార పార్టీ వర్గాలే అంగీకరిస్తున్నాయి. తుమ్మలకు టికెట్ నిరాకరించిన తర్వాత ఆయనను బుజ్జగించేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదంటున్నారు. చివరికి ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి కూడా తుమ్మలకు ఫోన్ చేసి కేసీఆర్ తో మాట్లాడించేందుకు చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయట. అధికారులకు రాజకీయాలెందుకు? నీ ఉద్యోగం నువ్వు చేసుకో.. అంటూ తుమ్మల కటువుగానే సమాధానం ఇచ్చారట.
ఈ నేపథ్యంలోనే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిన్న సాయం త్రం తుమ్మలను కలిసి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈనెల 10వ తేదీలోపు తుమ్మల కాంగ్రెస్ కండువా కప్పుకోవడం ఖాయంగా వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే తుమ్మల వల్ల జరిగే నష్టాన్ని పూడ్చుకోవడం ఎలా? అసలు తుమ్మలను ఎలా నిలువరించాలి? ఈ ప్రశ్నల దిశగా అధికార పార్టీ పెద్దలు తీవ్రంగా యోచిస్తున్నారట. ఇందులో భాగంగానే తుమ్మల నాగేశ్వర్ రావుకు కుటుంబానికి ఉన్నట్లు పేర్కొంటున్న వందలాది ఎకరాల భూముల వివరాలను అధికార పార్టీ వర్గీయులు సేకరిస్తున్నారట. సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల పరిధిలోని గంగారం, మొద్దులగూడెం-దురదపాడు రోడ్డు, లింగపల్లి, కొమురం ముత్యాలగుంపు, పాకాలగూడెం తదితర ప్రాంతాల్లో తుమ్మల కుటుంబానికి చెందినట్లు ప్రాచుర్యంలో గల 400పైచిలుకు ఎకరాల భూముల లెక్కలను తీసే పనిలో పడ్డారట. తుమ్మల కుటుంబం భూములు కలిగి ఉండడం నేరమా? అనే ప్రశ్న సహజంగానే ఉద్భవిస్తుంది.
కానీ షెడ్యూల్డు ఏరియాల్లో అమలులో గల భూ బదలాయింపు చట్టం ( వన్ ఆఫ్ 70 యాక్టు) పరిధిలో తుమ్మల ఏవేని భూములు కొనుగోలు చేశారా? అనే పాయింటును ప్రామాణికంగా తీసుకుని అధికార పార్టీ వర్గాలు ఆరా తీస్తున్నాయట. 1/70 యాక్టు అమలులో గల దమ్మపేట, అశ్వారావుపేట నియోజకవర్గాల పరిధిలోనే తుమ్మలకు వందలాది ఎకరాల భూముల ఉన్నాయని, ఎక్కడో ఓచోట తుమ్మల దొరక్కపోతారా? అనే దిశగా సమాచార సేకరణ చేస్తున్నారట. అయితే రాజకీయంగానేగాక ఇతర అంశాల్లోనూ ఎంతో చైతన్యం గల తుమ్మల నాగేశ్వర్ రావు ఏ రకంగానూ తప్పులు చేయరని, అధికార పార్టీకి చెందిన కొందరి ప్రయత్నాలకు ఏ ఫలితమూ లబించదని మాజీ మంత్రి అనుయాయులు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. అవినీతి మచ్చలేని తుమ్మల నాగేశ్వర్ రావు కుటుంబ భూముల్లో 1/70 యాక్టును ఉపయోగించేందుకు అధికార పార్టీ నేతలకు ఏవేని ఆధారాలు లభిస్తాయా? లేదా? అనేది ప్రశ్నార్థకం కాగా, టీడీపీలో తుమ్మల చిరకాల మిత్రుడు సీఎం కేసీఆర్ ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతుండడం కొసమెరుపు.