తెలంగాణ ప్రభుత్వ మాన్య ముఖ్యమంత్రి,
సాహితీప్రియులు గౌ. కె. చంద్రశేఖరరావు గారికి,
ప్రియమైన కె.సి.ఆర్. గారూ,
2018, నవంబర్ నుంచి, భీమా కోరేగాఁవ్ కేసులో నిర్బంధించబడి, ప్రస్తుతం మహారాష్ట్రలోని తలోజా జైలులో ఉంటున్న ప్రఖ్యాత కవి, ప్రజాస్వామిక హక్కుల నాయకుడు వరవరరావు (వి.వి.) గారి గురించి మీకు తెలియనిదంటూ ఏమీ లేదు. మాలాగే వి.వి. మీకు కూడా మిత్రుడని మాకు తెలుసు. తెలంగాణ సమాజాన్ని చైతన్యపరచటంలో ఆయన నిర్వహించిన భూమిక మీకు తెలియనిది కాదు. ఆయన ఆరోగ్యం విషమించినందున నిన్న జైలు అధికారులు ముంబైలోని ప్రముఖ జె.జె. ఆసుపత్రికి తరలించిన సమాచారం కూడా మీకు వివరంగా తెలిసి ఉంటుందనుకుంటున్నాము.
మహారాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకునే నాటికే వి.వి. పలు రకాల అనారోగ్యాలతో బాధపడుతున్నారు. ఆ కేసుకి సంబంధించిన న్యాయాన్యాయాల జోలికి వెళ్ళవలసిన అవసరం లేకుండా, ఈ విపత్కర పరిస్థితిలో తెలంగాణ సమాజానికీ, దేశానికీ, మనందరికీ కూడా అమూల్యమైన వి.వి.ని కాపాడుకోవలసిన అవసరం ఉన్నదని మీరు కూడా గుర్తిస్తారని మేము భావిస్తున్నాము. తీవ్ర రాజకీయ వైరుధ్య వాతావరణంలో, చుట్టూ అక్కడ అనుక్షణ పహరా మధ్య జరుగుతున్న చికిత్స స్థితి యేమిటో మనకు తెలియదు. సహజంగానే ఆయన కుటుంబం మునుపెన్నడూ యెరగని గందరగోళంలో, ఆందోళనలో, ఆవేదనలో ఉంది. నిరంతరం ఉద్యమ వాతావరణంలో జీవించే ఒక పోరాటశీలి మానసిక స్థితి, మనుగడ యెలా ఉంటుందో తెలంగాణ ఉద్యమానికి దిక్సూచిగా వ్యవహరించిన మీకంటే బాగా ఎవరికి తెలుస్తుంది?
వి.వి.తో అన్నింటా మనకి ఏకీభావం ఉండకపోవచ్చు.కానీ ఆయన ప్రాణాలను సంరక్షించుకోవలసిన అత్యవసరాన్ని గురించి మనం ఏకాభిప్రాయంతో ఉన్నామనే అనుకుంటున్నాము. మీరు కేంద్రంలో మంత్రిగా ఉన్నప్పుడు, ఒక కేసులో నిర్బంధంలో ఉన్న వరవరరావుని స్వయంగా వెళ్ళి కలిసి సంఘీభావం ప్రకటించిన అత్యంత విశాల ప్రజాస్వామ్య ప్రియులు మీరు. కేంద్రంలో కూడా ఒక తెలుగు నాయకుడే కీలకమైన హోమ్ శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. శ్రీ కిషన్ రెడ్డికి కూడా, వరవరరావు ఒక సుప్రసిద్ధ కవిగా, ఉద్యమకారుడుగా తెలుగు రాష్ట్రాల ప్రజలలోనే కాకుండా ప్రపంచ సాహిత్య రంగంలో ఉన్న ప్రఖ్యాతి తెలిసే ఉంటుంది. ఈ విపత్కర సమయంలో మీరు చొరవ తీసుకుని మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఉద్ధవ్ ఠాక్రేతో, భారత హోంశాఖ మంత్రి అమిత్ షా గారితోనూ, హోం శాఖ సహాయ మంత్రి మన కిషన్ రెడ్డి గారితో మాట్లాడి, వి.వి. విడుదలకి పూనుకుని, ఆయన మళ్ళీ ఆరోగ్యంగా మన మధ్య తిరిగేలా, చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
మీరు గట్టిగా పూనుకుంటే ఇది సులభ సాధ్యమేనని మేము విశ్వసిస్తున్నాము. మీ తక్షణ స్పందనని ఆశిస్తున్నాము.
ఇట్లు భవదీయులు,
1. దేవిప్రియ
2. అంపశయ్య నవీన్
3. కె. శివారెడ్డి
4. నందిని సిధారెడ్డి
5. ఓల్గా
6. కాళీపట్నం రామారావు
7. ఎన్. గోపి
8. పి. సత్యవతి
9. కాత్యాయని విద్మహే
10. కె. శ్రీనివాస్
11. దర్భశయనం శ్రీనివాసచార్య
12. మృణాళిని
13. అల్లం రాజయ్య
14. ఖాదర్ మొహియుద్దీన్
15. అట్టాడ అప్పల్నాయుడు
16.రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి
17. పాపినేని శివశంకర్
18. కేతు విశ్వనాథరెడ్డి
19. నళిమెల భాస్కర్
20. అఫ్సర్
21. ఎండ్లూరి సుధాకర్
22. గోరటి వెంకన్న
23. నాళేశ్వరం శంకరం
24. ముదిగంటి సుజాతరెడ్డి
25. బండి నారాయణస్వామి
26. అక్కినేని కుటుంబరావు
27. వాసిరెడ్డి నవీన్