అడవిలో ఉండాల్సిన ‘పులి’ ఊరిలోకి వస్తే వీధి కుక్కలు కూడా మొరుగుతాయ్… లాక్ డౌన్ పరిణామాల్లో రెండు రోజుల క్రితం చూసిన ఓ సినిమా లేదంటే సీరియల్లోని సీరియస్ డైలాగ్ ఇది. సన్నివేశం పరంగా బాగా పేలిన డైలాగ్ కూడా. మాంచి ‘పంచ్’ కూడా ఉంది ఇందులో. ఎందుకంటే పులిని ఊరకుక్కలు… అదే… వీధి కుక్కలు ఎప్పుడూ చూసే ఛాన్సే లేదు. అందుకే ఇదేదో కొత్తగా కనిపిస్తున్న జీవిగా భావిస్తూ ‘పులి’ గురించి తెలియనితనంతో కాబోలు కుక్కలు అదే పనిగా మొరుగుతుంటాయ్. కానీ పంజా విసిరితే కదా…? పులి దెబ్బ రుచి ఎలా ఉంటుందో కుక్కలకు తెలిసేది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే…?
రెండు రోజుల క్రితం హైదరాబాద్ నగర శివార్లలోని కాటేదాన్ సమీపంలో ఓ చిరుత పులి రహదార్లపైకి వచ్చి రోడ్డు డివైడర్ పక్కన ‘నక్కిన’ సంగతి తెలిసిందే కదా? ఆ చిరుత కోసం అటవీ అధికారులు, పోలీసు సిబ్బంది పడరాని పాట్లు పడుతూనే ఉన్నారు. జనారణ్యంలోకి వచ్చిన చిరుతను బంధిస్తే తప్ప తమకు మనశ్శాంతి లేదని రాజేంద్రనగర్ ప్రాంత వాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు కూడా.
అదిగో అలా తప్పించుకున్న చిరుతను చూసేందుకు అదేరోజున రోడ్డుపక్కన పార్క్ చేసిన ఓ లారీ డ్రైవర్, క్లీనర్లు ప్రహరీ గోడను అనుకుని తొంగి తొంగి చూస్తున్నారు. ఇంతలో చిరుత తమవైపే రావడాన్ని గమనించిన లారీ డ్రైవర్, క్లీనర్ తప్పించుకునేందుకు అటూ, ఇటూ పరుగెత్తి చివరికి లారీలోకి ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో చిరుత వేగంగా రానే వచ్చింది. లారీ డ్రైవర్ కాలును పట్టి లాగింది కూడా.
చిరుత ఇలా బీభత్సం సృష్టిస్తుండగానే ఓ అరడజన్ వీధికుక్కలు అటుగా రానే వచ్చాయి. చిరుతను చుట్టుముట్టి అరుస్తున్నాయ్ కూడా. ఒకటీ, రెండు కుక్కలు చిరుత తోకను పట్టుకునేందుకు భయం భయంగా విఫలయత్నం కూడా చేశాయ్. కానీ చిరుత వెనక్కి తిరిగే సరికి కుక్కలు పరుగో పరుగు. చిరుత సంగతే కుక్కలకు సరిగ్గా తెలిసినట్లు లేదు. ఎందుకంటే ఇటువంటి వీధికుక్కలను చిరుత ఒంటిచేత్తో పట్టుకుని గుటుక్కుమని ఆరగించేయగలదు. ఆ విషయం తెలియని వీది కుక్కలు ఇలా మొరుగుతూ చిరుత వెంట పడుతుంటాయ్. సరే ఇక ఆయా దృశ్యానికి సంబంధించిన వీడియోను దిగువన చూడండి.