రోడ్డు ‘డివైడర్’ను ఆనుకుని ఈ చిరుత ఇలా ఎందుకు నక్కిందో తెలుసా..? ఈ అంశాన్ని తెలుసుకునే ముందు అసలు ఈ చిరుత ఎక్కడి నుండి వచ్చిందంటే…? నిన్న తెలంగాణాలోని రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లి సమీపంలోని అండర్ బ్రిడ్జి వద్ద ఇలా డివైడర్ ను ఆనుకుని దర్శనమిచ్చింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురికాగా, ట్రాఫిక్ ను నిలిపివేసి దాన్ని పట్టుకోవడానికి అటవీ అధికారులు నిన్నటి నుంచి చేస్తున్న ప్రయత్నాలు ఇంకా ఫలించలేదు. కాటేదాన్ లోని నలభై ఎకరాల వ్యవసాయ క్షేత్రంలోకి దూరి కనిపించకుండాపోయిన ఈ చిరుతను బంధించేందుకు అటు అటవీ అధికారులు, ఇటు పోలీసు అధికారులు పడరాని పాట్లు పడుతున్నారు. రాజేంద్రనగర్ ప్రాంత వాసులు గడగడ వణికిపోతున్న పరిస్థితుల్లో చిరుత ఆచూకీ కోసం ట్రాప్ కెమెరాలను కూడా ఉపయోగిస్తున్నారు. మేకలను ఎరగా వేస్తున్నారు. కుక్కలను సైతం ఉపయోగిస్తున్నారు.
వాస్తవానికి వన్యప్రాణుల్లో చిరుత సంచార శైలే విభిన్నం. పెద్ద పులి తరహాలో ఇది తన ఆవాస (టెరిటోరియల్) ప్రాంతంలో కదలకుండా ఉండలేదు. ఆకలేసినప్పుడు వేటాడడం, దాహమేసినపుడు నీళ్లు తాగడం, లేదంటే హాయిగా విశ్రాంతి తీసుకోవడమే పులి జీవన నైజం. ఓ రకంగా చెప్పాలంటే పులి అడవిలో రారాజుగా జీవిస్తుంది. తన టెరిటోరియల్ ఏరియాను దాటి బయటకు రాదు కూడా. కానీ చిరుత ఇందుకు విరుద్ధమని అటవీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. వీధికుక్కలను సైతం వేటాడి భుజించే అలావాటు గల చిరుతకు మనుషులంటే చచ్చేంత భయమట. మనుషులను చూస్తే కనిపించకుండా దాక్కుంటుందట. అందుకే నిన్న ఇలా రోడ్డు డివైడర్ ను ఆనుకుని నక్కిందట. కానీ చిన్న పిల్లలు కనిపిస్తే మాత్రం చిరుత ఎత్తుకుపోతుందని అటవీ అధికారులు పేర్కొంటున్నారు. జన సంచారం లేని ప్రాంతాల్లో మాత్రమే చిరుత స్వేచ్ఛగా సంచరిస్తుందట. జనం అలికిడి వినిపిస్తే దాక్కుంటుందట. లాక్ డౌన్ పరిణామాల్లో పెద్దగా జనసంచారం లేకపోవడం వల్లే నగర శివార్లలోని చిట్టడవుల నుంచి హైదరాబాద్ ప్రాంత జనారణ్యంలోకి ఈ చిరుత వచ్చినట్లు భావిస్తున్నామని అటవీ శాఖ విజిలెన్స్ విభాగపు డీఎఫ్ఓ రమణారెడ్డి చెప్పారు.
ఎన్నడూలేని విధంగా వన్యప్రాణులు జనారణ్యంలోకి ఎందుకు వస్తున్నాయి? వేసవిలో తాగునీరు దొరక్క ఎప్పటిలాగే దప్పిక తీర్చుకునేందుకు ఇలా రోడ్లపైకి వస్తున్నాయా? అనే ప్రశ్నలకు డీఎఫ్ఓ రమణారెడ్డి స్పందిస్తూ, ప్రస్తుతం తెలంగాణా అడవుల్లో వన్యప్రాణులకు నీరు దొరకడం లేదనే ప్రశ్నకు తావే లేదన్నారు. సోలార్ బోర్ల ద్వారా అడవుల్లో విరివిగా ఏర్పాటు చేసిన నీటి గుంటల్లో వన్యప్రాణులు దాహం తీర్చుకుంటున్నాయని చెప్పారు. అందుకు సంబంధించి గత, ప్రస్తుత నెలలో అటవీ శాఖ తీసిన ఫొటోలను కూడా రమణారెడ్డి ts29కు పంపించారు. ఆయా దృశ్యాలను దిగువన స్లైడ్ షోలో తిలకించవచ్చు.