కిరాణం & జాగిరీ మర్చంట్స్ అసోసియేషన్ సర్వసభ్యులకు తెలియజేయునది… మన గాంధీచౌకలో కరోనా వైరస్ ఎక్కువగా ఉండటంతో ఇప్పటికి మనసభ్యులు ఇద్దరు చనిపోవడం జరిగినది. మిగతా సభ్యులు భయాందోళనకు గురి అవుతున్నారు. కావున ది. 21-7-2020 మంగళవారం నుండి 28-7-2020 మంగళవారం వరకు ఎగుమతులు, దిగుమతులతో సహా దుకాణములను పూర్తిగా బంద్ చేయాలని అసోసియేషన్ తీర్మానించడమైనది. కావున సర్వసభ్యులకు తెలియజేయఁచున్నాము
ఇట్లు; అధ్యక్షులు
వేములపల్లి వెంకటేశ్వరరావు
? ? ?
గౌరవనీయులైన సంఘం సభ్యులు అందరికీ తెలియచేయునది ఎమనగా…
కరోనా వైరస్ తీవ్రత ఇటీవల బాగా పెరిగింది, మన బంగారం షాపుల పరిసరాలలో వైరస్ ఉధృతి పెరిగిన కారణంగా..
*ఆదివారం అనగా ది: 19-07-2020 నుండి 26-07-2020 వరకు షాపులను పూర్తిగా బంద్ చేయుటకు అసోసియేషన్ తీర్మానించడమైనది కావున సర్వ సభ్యులకు తెలియచేయడమైనది, అందరు షాపులు బంద్ చేయగలరు…*
*ఆరోగ్యం మే మహ భాగ్యం* కావున సభ్యులు, గుమస్తాల, కస్టమర్లు శ్రేయస్సు కొరకు నిర్ణయం తీసుకోవడమైనది.. తమ వంతు బాధ్యతగా అందరు సహకరించ గలరు..
గమనిక: ఒకవేళ అత్యవసరం అయితే, వారు అసోసియేషన్ కి తెలియ పరిచి, సాయంత్రం 5pm నుండి 6pm వరకు వస్తువులు డెలివరీ ఇవ్వగలరు…
ఇది కూడా శ్రావణ మాసము దృష్టిలో ఉంచుకుని ఇచ్చిన సడలింపు, దయచేసి సభ్యులు ఇట్టి అవకాశం దుర్వినియోగం పరుచవద్దు.
ఇట్లు మీ
బందు సూర్యం అధ్యక్షులు
నకిరికంటి సతీష్ కార్యదర్శి
బూర్లే లక్ష్మి నారాయణ CEC
గడ్డం శ్రీనివాస రావు CEC
*వెండి బంగారం శాఖ*
*చాంబర్ ఆఫ్ కామర్స్, ఖమ్మం*
విషయం బోధపడింది కదా? ఖమ్మం నగరంలో ప్రధాన వ్యాపార కేంద్రంగా ప్రాచుర్యం పొందిన గాంధీచౌక్ లో కరోనా వ్యాప్తి తాజా పరిస్థితికి నిలువుటద్దం ఈ ప్రకటన. రోజురోజుకూ తీవ్రమవుతున్న కరోనా ధాటికి తట్టుకోలేక, కనీసం ప్రాణాలు దక్కించుకునే దిశగా వ్యాపారులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందులో భాగంగానే వారం రోజులపాటు దుకాణాల స్వచ్ఛంద బంద్ కు స్వయంగా పిలుపునిచ్చారు.
ఖమ్మం నగరంలోని గాంధీచౌక్ ప్రాంతానికి చెందిన ఇద్దరు ప్రముఖ వ్యాపారులైన దేవత నాగప్రసాద్, నేరెళ్ల నారాయణలను ఇటీవలే కరోనా కబలించిన సంగతి తెలిసిందే. అనంతర తాజా పరిణామాల్లో వ్యాపారవర్గాలు బెంబేలెత్తుతున్నాయి. ఏం చేయాలో పాలుపోక తమ వ్యాపార సంస్థలను స్వచ్ఛందంగా ‘లాక్’ చేసుకుంటున్నాయి. అదీ విషయం.