కరోనా కల్లోల పరిణామాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులనూ ‘ఫ్రంట్ లైన్ వారియర్లు’గా పలువురు అభివర్ణిస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఈ పరిణామాల్లో ప్రాణాలు కోల్పోతున్న జర్నలిస్టులకు ఎటువంటి భరోసా లేదనే విషయమూ విదితమే. ఏ రకంగానూ ఎటువంటి బీమా, ధీమా హామీ లేకున్నా జర్నలిస్టులు ముందుండి మరీ తమ విద్యుక్త ధర్మం నిర్వహిస్తున్నారనేది నిర్వివాదం. సమాజ హితం కోసమే కాదు, తమ కుటుంబాలను పోషించుకోవడానికి జర్నలిస్టులు కరోనా తాజా పరిస్థితుల్లో దినమొక గండంలా బతుకుతున్న మాట కాదనలేని వాస్తవం.
ఇదిగో ఇటువంటి విపత్కర పరిస్థితుల్లోనూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఓ టీవీ జర్నలిస్టు కరోనాతో చనిపోయిన వ్యక్తి అంతిమ సంస్కార క్రియల్లోనూ ‘ఫ్రంట్ లైన్ వారియర్’గా నిలవడం విశేషం. కరోనా వైరస్ వల్ల చనిపోయినవారి అంత్యక్రియలకు సంబంధీకుల బంధువులే దరిచేరని ఘటనలు అనేకం చూస్తున్నాం. కనీసం డెడ్ బాడీని కూడా తీసుకువెళ్లేందుకు రావడం లేదనే వార్తలు కూడా చదువుతున్నాం. ఇటువంటి విషాద, విదారక పరిస్థితుల్లోనూ ఇల్లెందుకు చెందిన హెచ్ఎంటీవీ రిపోర్టర్ ఉదయ్ తన మానవత్వాన్ని చాటారు.
ఇల్లెందుకు చెందిన బీజేపీ నేత కుటుంబరావు కరోనాతో మరణించారు. అయితే ఆయన భౌతిక కాయాన్ని వరంగల్ ఎంజీఎం నుంచి తరలించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో హెచ్ఎంటీవీ రిపోర్టర్ ఉదయ్ ఉద్యుక్తమయ్యారు. కుటుంబరావు మృతదేహాన్ని తీసుకురావడంలోనే కాదు, స్వయంగా పీపీఈ కిట్ ధరించి అతని అంత్యక్రియల నిర్వహణలో జర్నలిస్టు ఉదయ్ కీలక పాత్ర పోషించారు. దగ్గరుండి మరీ కుటుంబరావు డెడ్ బాడీకి అంత్యక్రియలను నిర్వహింపజేశారు. ఈ విషయంలో ఉదయ్ ధైర్యాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఫోన్ ద్వారా అభినందించారు. బండి సంజయే కాదు మానవత్వం గల ప్రతి ఒక్కరూ ఉదయ్ ను అభినందించాల్సిందే… ఈ ఫ్రంట్ లైన్ వారియర్ జర్నలిస్టును మనమూ ప్రశంసిద్దామా మరి!