జర్నలిజంలో చీడ పురుగుల ఏరివేతకై ts29.in వెబ్ సైట్ ఇచ్చిన పిలుపునకు భారీ స్పందన లభిస్తోంది. బ్లాక్ మెయిల్ జర్నలిస్టుల దందాను బహిర్గతం చేయాల్సిందేనని పలువురు కోరుతున్నారు. ‘ముఠాలు’గా ఏర్పడిన కొందరు జర్నలిస్టుల నుంచి ప్రజలను రక్షించాల్సిందేనని ఇంకొందరు ఆకాంక్షిస్తున్నారు. నిన్న సాయంత్రం సోషల్ మీడియా వేదికగా చేసిన ‘పోస్ట్’కు ఇంత భారీ ఎత్తున స్పందన లభిస్తుందని ఊహించలేదు. ఇదొ మంచి ప్రయత్నమని, అసలైన జర్నలిజానికి విలువ పెరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో నిన్న ఇచ్చిన పిలుపునకు ts29 వెబ్ సైట్ కట్టుబడి ఉంటుందని, తన కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో నిర్వహిస్తుందని మరోసారి స్పష్టం చేస్తున్నాం. నిన్నటి పోస్టుకు స్పందనగా వచ్చిన అసంఖ్యాక స్పందనల్లోని మచ్చుకు కొన్నింటిని మాత్రమే దిగువన ఇస్తున్నాం. వాటిని పరిశీలించాక, అసలు పోస్ట్ లక్ష్యం, సారాంశం ఏమిటో మీరూ చదివేయండి.
రండి… జర్నలిజంలోని చీడ పురుగులను ఏరేద్దాం
మిమ్మల్ని ఎవరైనా జర్నలిస్టు బెదిరిస్తున్నారా? బ్లాక్ మెయిల్ చేస్తున్నారా? డబ్బు డిమాండ్ చేస్తున్నారా? వార్త రాస్తామని భయపెడుతున్నారా? ఏం భయపడకండి. ఇటువంటి ప్రజా కంఠక, బ్లాక్ మెయిల్ జర్నలిస్టుల సంగతేమిటో తేల్చడానికి ts29.in వెబ్ సైట్ మీకు అండగా ఉంటుంది. మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసే జర్నలిస్టు నుంచి కాపాడుతుంది. ఇటువంటి జర్నలిజపు చీడ పురుగుల భరతం పడుతుంది. వీళ్ళ బ్లాక్ మెయిల్ దందాను నడిబజారులో నిలబెడుతుంది.
ఎంత పెద్ద పత్రిక విలేకరయినా ఫరవాలేదు. మరెంత పెద్ద టీవీ రిపోర్టయినా వెరపు లేదు. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మిన చందంగా, మంత్రులు తమ క్లాస్ మేట్లు అనో, ఎమ్మెల్యేలు మా చుట్టమనో, అధికారులు తమ జేబులో ఉన్నారనో బెదిరిస్తూ బ్లాక్ మెయిల్ దందాకు పాల్పడే జర్నలిస్టుల గురించి మాకు సమాచారం ఇవ్వండి. ఈ తరహా జర్నలిస్టులు మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తూ చేసే సంభాషణను మీ స్మార్ట్ ఫోన్ ద్వారా రికార్డు చేయండి. సెటిల్మెంట్లకు పాల్పడే సిండి‘కేటు’ జర్నలిస్టుల దందాను వీడియో తీయండి. వాటిని మాకు పంపించండి. వాళ్ల నిజస్వరూపాన్ని నగ్నంగా నడిబజారులో నిలబెట్టి, సమాజానికి వీళ్ల నిజస్వరూపాన్ని తెలియజేసే బాధ్యత మాది. ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లే బాధ్యత కూడా మాదే.
సీనియర్ జర్నలిస్ట్ ఎడమ సమ్మిరెడ్డి ఎడిటర్ గా నిర్వహిస్తున్న ts29.in వెబ్ సైట్ కు ఉప్పందించండి. జర్నలిజంలో ఎడమ సమ్మిరెడ్డి నిబద్ధత, చిత్తశుద్ధి గురించి తెలిసినవారు ఎవరైనా సరే ఈ ప్రకటనను విశ్వసించవచ్చు. పోరాడితో పోయేదేమీ లేదు. బ్లాక్ మెయిల్ జర్నలిస్టుల నుంచి రక్షణ పొందడం తప్ప. ఇక నిర్ణయం మీదే.
బ్లాక్ మెయిల్ జర్నలిస్టుల గురించి మీరు ఆధారాలతో సహా వాట్సాప్ చేయాల్సిన ఫోన్ నెంబర్ దిగువన ఉంది:
జనహిత జర్నలిజమే లక్ష్యంగా…
– ఎడమ సమ్మిరెడ్డి
90528 79933