భోపాల్ లో చదువుకున్న సందీప్ అనే యువకుడికి అతని తల్లిదండ్రులు పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యారు. ఓ సంబంధాన్ని కుదిర్చారు. కానీ ఈ పెళ్లికి సందీప్ నిరాకరించాడు. అయినప్పటికీ తల్లిదండ్రులు తమ కుమారుడి ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా తాము చూసిన యువతి కుటుంబానికి ‘పెళ్లి’ మాట ఇచ్చేశారు. పెళ్లికి సర్వం సిద్ధమైన తరుణంలో సందీప్ అడ్డం తిరిగాడు. తాను ఆ యువతిని పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదని భీష్మించాడు. సందీప్ తల్లిదండ్రుల నుంచి ‘పెళ్లి’ మాట తీసుకున్న యువతి సంబంధీకులు గ్రామ పెద్దల శరణు వేడుకున్నారు.
ఇంతకీ పెళ్లి ఎందుకు వద్దంటున్నావని గ్రామ పెద్దలు సందీప్ ను ప్రశ్నించారు. తనకో లవర్ ఉందని, చదువుకున్న సమయంలో ప్రేమించుకున్నామని, తాను ఆమెనే పెళ్లి చేసుకుంటానని అసలు విషయం చల్లగా చెప్పాడు. గ్రామ పెద్దలు తలలు నిమురుకున్నారు. తర్జన, భర్జన పడ్డారు. మూడు కుటుంబాలను కూర్చోబెట్టారు. మంచీ, చెడూ మాట్లాడారు. సందీప్, అతని ప్రియురాలి, మరో యువతి కుటుంబాలను కూర్చోబెట్టి నచ్చజెప్పారు. ఇందుకు అందరూ ఓకే అన్నారు.
ఇంతకీ గ్రామ పెద్దలు ఆయా కుటుంబాల మధ్య కుదిర్చిన రాజీ ఏమిటో తెలుసా? తాను ప్రేమించిన యువతినే కాదు, తల్లిదండ్రులు మాట ఇచ్చిన అమ్మాయిని కూడా సందీప్ పెళ్లి చేసుకోవాలని సూచించారు. ఇందుకు మూడు కుటుంబాలు కూడా అంగీకరించాయి. ఇంకేముంది సందీప్ పెళ్లికి బాజాలు మోగాయి. మధ్యప్రదేశ్ లోని భోపాల్ ప్రాంతంలో గల బేతుల్ జిల్లా కెరియా గ్రామంలో జరిగిన ‘ఇద్దరు వధువుల ముద్దుల వరుడు’ పెళ్లకి జన్ పథ్ పంచాయత్ ఘోదాడోంగ్రీ వైస్ ప్రెసిడెంట్ మిశ్రీలాల్ పరాటే పెద్దగా వ్యవహరించాడు. ఇప్పుడీ ఘటనకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కేవై యాధూ అనే వ్యక్తి చేసిన ట్వీట్ లో సందీప్ పెళ్లి ఫొటోను దిగువన మీరూ చూసేయండి మరి!