ఔను… అతను ఓ బాలుడు. నిండా పద్దెనిమిదేళ్లు కూడా లేవు. అక్షరాలా అతని వయస్సు 17 ఏళ్లు మాత్రమే. తన వయస్సును ఆ బాలుడే స్పష్టంగా చెబుతున్నాడు. అంటే అతనికి ఇంకా ఓటు హక్కు కూడా రాలేదన్నమాట. కానీ ఈ 17 ఏళ్ల విద్యార్థి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారిగా విధులు నిర్వహిస్తే ఎలా ఉంటుంది? ఆశ్చర్యంగా ఉంది కదూ! కానీ వీడియో సాక్షిగా ఇది అక్షరాలా నిజం.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎ. వరుణ్ సాగర్ అనే విద్యార్థిని అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారిగా ఎన్నికల అధికారులు నియమించారు గ్రేటర్ లోని 38వ వార్డులోని 24వ పోలింగ్ స్టేషన్ లో ఈ విద్యార్థిని అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారిగా నియమించినట్లు అతని ఐడీ కార్డు స్పష్టం చేస్తోంది. ఇదే అంశం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల సంఘం తీరుపై బీజేపీ నేతలు ఇప్పటికే పలు ఆరోపణలు, విమర్శలు కూడా చేశారు.
మలక్ పేటలో సీపీఐ అభ్యర్థికి సీపీఎం ఎన్నికల గుర్తును కేటాయించడం, టీచర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచడం, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్ లో కూడా ఓటు హక్కు వినియోగించుకోవడం తదితర అంశాలపై వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే 17 ఏళ్ల విద్యార్థిని అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారిగా నియమించినట్లు పేర్కొంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆయా వీడియోను దిగువన మీరూ చూసేయండి మరి.