మహాభారతం పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చేదేమిటి? జూదం, ద్రౌపదీ వస్త్రాపహరణం, కురుక్షేత్ర యుద్ధం… ఇవేగా ప్రధానంగా స్ఫురించేది? కానీ మహాభారతంలో మనకు తెలియని కథలెన్నో దాగి ఉన్నాయి. అందులో మరెన్నో నీతిబోధలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రజాపాలన చేసే నేతలకు మార్గదర్శకాన్ని నిర్దేశించే అంశాలు ఇమిడి ఉన్నాయి. నేటి పాలకుల్లో కొందరికి కనువిప్పు కలిగించే విషయాలు అనేకం దాగి ఉన్నాయి. వర్తమాన సమాజానికి అవసరమైన ‘ఫార్ములా’లు సైతం ఉన్నాయి. అందులో ఇదీ ఒకటి… అంటూ ఓ జర్నలిస్టు మిత్రుడు పంపాడు. లాక్ డౌనే కదా… హాయిగా, తీరిగ్గా… చదవండి.
పంచపాండవుల్లో మొదటివాడైన ధర్మరాజు ఎక్కువగా దాన, ధర్మాలు చేసేవాడని పేరు… తెలుసుగా? తనకంటే ఎక్కువ దానం చేసిన వాళ్ళు ఇంకెవరూ లేరని ధర్మరాజు ఫీలింగ్. ఇది ధర్మరాజుకు అహంకారంగా మారకూడదని కృష్ణుడు భావించాడు. అందుకోసం కృష్ణుడు ధర్మరాజుని వేరే రాజ్యానికి తీసుకు వెళ్ళాడు.
ఆ రాజ్యం మహాబల చక్రవర్తి పాలనలో ఉండేది.
అక్కడ ఒకరి ఇంట్లోకి వెళ్లి నీళ్లు అడిగారు… ఆ ఇంటిలోని ఆమె వారికి బంగారు గ్లాసులో నీళ్లు ఇచ్చింది. వారు తాగేసాక ఆమె ఆ గ్లాస్ ను బయట విసిరేసింది !
ధర్మరాజు ఆమెతో… ఏంటమ్మా…? బంగారాన్ని దాచుకోవాలి గానీ, ఇలా వీధిలో పడేస్తే ఎలా ?… అని ప్రశ్నంచాడు.
ఆమె… మా రాజ్యంలో ఒక్కసారి వాడిన వస్తువును మళ్ళీ వాడం అని బదులు చెప్పి లోనికి వెళ్ళిపోయింది !!!
ఆ రాజ్యపు సంపదను గురించి ఆలోచిస్తూ ఆశ్చర్యపోయాడు ధర్మరాజు.
ఇక రాజును కలవడానికి ఇద్దరు వెళ్లారు.
కృష్ణుడు మహాబలరాజుతో ధర్మరాజును ఈ విధంగా పరిచయం చేసాడు…
రాజా… ఈయన ప్రపంచంలోనే ఎక్కువ ధర్మాలు చేసిన వ్యక్తి. పేరు ధర్మరాజు అని చెప్పాడు. అయినా ఆ రాజు ధర్మరాజు ముఖం కూడా చూడలేదు సరికదా కృష్ణుడితో ఇలా అన్నాడు…
కృష్ణా… మీరు చెప్పిన విషయం సరే… కానీ నా రాజ్యంలో ప్రజలకు సరిపడా పని ఉంది. అందరి దగ్గరా సంపద బాగా ఉన్నది, నా రాజ్యంలో అందరికి కష్టపడి పనిచేయడం ఇష్టం. ఇక్కడ భిక్షం తీసుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు. అందువల్ల దానధర్మాలకు ఇక్కడ తావులేదు, ఇక్కడ ఎవరికీ దానాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈయన రాజ్యంలో బీదవాళ్లు ఎక్కువగా ఉన్నట్టున్నారు. అందుకే అందరూ దానాలు అడిగేందుకు వస్తున్నారేమో? ఈయన రాజ్యంలో అంతమందిని పేదవారిగా ఉంచినందుకు ఈ రాజు మొఖం చూడాలంటే నేను సిగ్గుపడుతున్నాను అన్నారు !!!
తన రాజ్యస్థితిని తలచి సిగ్గుపడి తల దించుకున్నాడు ధర్మరాజు.
సహాయం అనే పేరుతో ప్రజలు అడుక్కుతినేలా మార్చడం, ఉచితం పేరుతో వారిని సోమరులుగా మార్చిన దేశం ఎప్పటికైనా తల దించుకోవాల్సిందే అని మహాబలరాజు హితబోధ చేశారు.
మరి మన పాలకులు ఈ విషయాన్ని ఎప్పుడు తెలుసుకుంటారో? ప్రజలు ఎప్పుడు మారుతారో??