కరోనా వైరస్ కల్లోలంలో కకావికలమైన దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 12న ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ మొత్తం తెలుసు కదా? ఆయా నగదు మొత్తానికి సంబంధించి ‘ది టెలీగ్రాఫ్’ ఇంగ్లీష్ పత్రిక పెట్టిన హెడ్డింగ్ ఇది. రూ. 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ అని చెప్పాల్సిన హెడ్డింగును ఇలా 13 సున్నాలను చేర్చి ప్రచురించడం ద్వారా టెలీగ్రాఫ్ పత్రిక తనదైన శైలిలో చమత్కారాన్ని, వ్యంగ్యాన్ని ప్రదర్శించడమే ఇక్కడ అసలు విశేషం. ‘ఈ అంకెలోని సున్నాలు లెక్కించేలోపు బహుషా నిర్మల మీకు వివరాలు ఇవ్వొచ్చు’ అని కూడా సబ్ హెడ్డింగులో వ్యాఖ్యానించడం గమనార్హం. ఇదే వార్తా కథనంలో మరో ఆసక్తికర ఫొటోను కూడా టెలీగ్రాఫ్ ప్రచురించింది. ఓ సంచిలో గల గిన్నెను, టిఫిన్ బాక్సు తగితర సామాగ్రిని ఉటంకిస్తూ… ‘ఇందులోకి ఎంతిస్తారు? అంటూ ప్రశ్నించింది. ఓ రకంగా చెప్పాలంటే ‘సామాన్యుడి సంచి’లోకి రూ. 20 లక్షల కోట్ల మొత్తంలో చేరేది ‘సున్నా’గా టెలీగ్రాఫ్ పత్రిక వెటకరించినట్లు జర్నలిస్టు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఇక్కడ గల ఓ కార్డూన్ ను చూడండి. ప్రధాని ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల అంశంలో మూడు భిన్నవర్గాల ఆలోచనను ఒకే వాక్యంలో వెల్లడించడం ఆసక్తికరం. ‘బీస్… లాక్… కరోడ్’ (ఇరవై… లక్షల… కోట్లు)గా అభివర్ణిస్తూ వరుసగా సామాన్యుడు ఓ ఇరవై రూపాయల గురించి, రూ. లక్షల గురించి వ్యాపారవేత్త, రూ. కోట్ల గురించి రాజకీయ నాయకుడు యోచిస్తున్నట్లు వ్యంగాస్త్రం విసిరిన కార్టూనిస్టుకు జేజేలు పలకాల్సిందే.
ఇప్పుడీ ఫొటోను చూడండి. నీళ్లు లేక నెర్రెలు బారిన పొలం మడులను తలపిస్తున్న ఓ వ్యక్తి పాదాలివి. అయితే ఏంటీ అని ప్రశ్నిస్తే…? ‘రూ. 20 లక్షల కోట్ల భారీ ప్యాకేజీలో ఈ పాదాలకు జత చెప్పులు ఉన్నాయా?’ అనే ప్రశ్నతో ఈ ఫొటోనే కాదు, టెలీగ్రాఫ్ పత్రిక రూ. 20 లక్షల కోట్ల హెడ్డింగ్ వెటకరింపు అంశం, పైన పేర్కొన్న కార్టూన్ సోషల్ మీడియాలో వేర్వేరుగా ‘వైరల్’గా మారాయి. అదీ సంగతి.