‘సహఫంక్తి’లో లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారనే అభియోగంపై దాఖలైన ఫిర్యాదును జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) విచారణకు స్వీకరించింది. ఈమేరకు ఫిర్యాదుపై కేసు నెం. 608/36/3/2020 కింద విచారణ ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఇండోనేషియావాసుల కారణంగా కరోనా కల్లోలంలో చిక్కుకున్న కరీం‘నగరం’ ప్రమాదకర స్థితిలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇటువంటి డేంజర్ పరిస్థితిపై ప్రజాప్రతినిధులు, అధికారులు అప్రమత్తమై అనేక కట్టడి చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా మంత్రి గంగుల కమలాకర్, జిల్లా కలెక్టర్, నగర పోలీస్ కమిషనర్ వంటి ఉన్నతాధికారులేగాక, మేయర్ వై. సునీల్ రావు సహా స్థానిక ప్రజాప్రతినిధులు కూడా తీవ్రంగా శ్రమించారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఫలితంగానే ప్రస్తుతం కరీంనగర్ సేఫ్ జోన్లోకి వెళ్లందనేది కాదనలేని వాస్తవం.
ఈ అంశంలో తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి తీవ్రంగా శ్రమించిన కరీంనగర్ నగరపాలక సంస్థకు చెందిన పారిశుధ్య కార్మికులకు ‘సహఫంక్తి’ భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా పాల్గొనగా, నగర మేయర్ వై. సునీల్ రావు, జిల్లా కలెక్టర్, నగర పోలీస్ కమిషనర్, మున్సిపల్ కమిషనర్ వంటి అధికారగణం, కార్పొరేటర్ల వంటి స్థానిక ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు భారీ ఎత్తున పాల్గొన్నారు.
నగరంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్లో ఈనెల 4వ తేదీన నిర్వహించిన ఈ ‘సహఫంక్తి’ భోజన కార్యక్రమంలో మంత్రి, అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు సహా దాదాపు 2,000 మంది పాల్గొన్నారు. అయితే ఇది లాక్ డౌన్ నిబంధనల ఉల్లంఘనగా పేర్కొంటూ కరీంనగర్ కు చెందిన ప్రముఖ న్యాయవాది బేతి మహేందర్ రెడ్డి జాతీయ మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు.
కార్యక్రమంలో కనీస సామాజిక దూరాన్ని పాటించకుండా, మాస్కులు, శానిటౌజర్లు సరైన పద్ధతిలో ఉపయోగించకుండా నిర్వహించిన ‘సహఫంక్తి’ తీరు అపెడమిక్ యాక్ట్ 1897 ఉల్లంఘనగా మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. కరోనా కట్టడికి కష్టపడిన నాయకులు, అధికారులే లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించడమేంటని ఆయన నిలదీశారు. ఈ అంశంలో సామాన్య ప్రజలకు ఓ న్యాయం, అధికారులకు, రాజకీయ నాయకులకు మరో న్యాయమా? అని మహేందర్ రెడ్డి ప్రశ్నించారు.
ఇదే అంశంపై లాయర్ మహేందర్ రెడ్డి చేసిన ఫిర్యాదును స్వీకరించిన ఎన్ఎచ్ఆర్సీ ‘సహఫంక్తి’ కార్యక్రమ నిర్వహణపై విచారణకు ఆదేశాలు జారీ చేసింది. కాగా ఈ ఘటనపై తాను రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశానని, స్పందన లేకపోవడంతో జాతీయ మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందని లాయర్ మహేందర్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పారు.