చెప్పిన పంట వేసిన వారికి మాత్రమే ‘రైతు బంధు’ పథకం అమలు చేస్తామని తెలంగాణా ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రాంతాల వారీగా ప్రభుత్వం సూచించిన పంటలు సాగు చేసినవారికి మాత్రమే రైతుబంధు పథకం వర్తింపజేయాలనేది ప్రభుత్వ తాజా నిర్ణయం. వచ్చే వానాకాలం పంటల నుంచే ఇది ప్రారంభమవుతుందని, రాష్ట్ర వ్యాప్తంగా నిర్దేశిత విస్తీర్ణపు ఎకరాల్లో మాత్రమే వివిధ పంటలు పండించాలని, ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు అధికారులు త్వరలో వెల్లడిస్తారని సీఎం కేసీఆర్ నిన్న ప్రకటించారు. తెలంగాణలో పంటల సాగు విధానం, ప్రత్యామ్నాయ పంటల గుర్తింపు, రైతులతో నియంత్రిత పద్ధతిలో సాగు చేయించడం, పండిన పంటకు గిట్టుబాటు ధర వచ్చేలా చూడడం వంటి తదితర అంశాలపై ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఆదివారం నుంచి ఇప్పటి వరకు జరిగిన వేర్వేరు సుదీర్ఘ సమీక్షల్లో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే…
తెలంగాణ వ్యాప్తంగా ప్రజల ఆహార అలవాట్లు, మార్కెట్ పరిస్థితులను దృష్టిలో పెట్టకుని వ్యవసాయాధికారులు ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగు చేయాలనే విషయంలో కొంత నిర్ధారణకు కూడా వచ్చారు. ఈ నిర్ధారణ ప్రకారం…. వ్యవసాయ సంవత్సరంలో యాసంగి, వానాకాలం పంటలకు కలిపి వరి 80-90 లక్షల ఎకరాల్లో, పత్తి 50 లక్షల ఎకరాల్లో, కంది 10 లక్షల ఎకరాల్లో మక్కజొన్న 7 లక్షల ఎకరాల్లో, వివిధ రకాల విత్తనోత్పత్తి 7 లక్షల ఎకరాల్లో, మిర్చి రెండున్నర లక్షల ఎకరాల్లో, కూరగాయలు 3.50 లక్షల ఎకరాల్లో, వేరుశనగ 2.50 లక్షల ఎకరాల్లో, పసుపు 1.25 లక్షల ఎకరాల్లో, కొర్రలు, మినుములు, పెసర్లు, ఆవాలు, నువ్వులు లాంటి పంటలు మరో రెండు లక్షల ఎకరాల్లో, కొద్ది పాటి విస్తీర్ణంలో సోయాబీన్ పండించడం ఉత్తమంగా భావిస్తున్నారు.
అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని నిలబడడమే కాకుండా, 30-40 ఏళ్ల పాటు నిరంతరంగా పంట దిగుబడి వచ్చే పామాయిల్ సాగును తెలంగాణలో విస్తరించాలని భావిస్తున్నారు. ఉదాహరణకు ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో 50 వేల ఎకరాల్లో, సూర్యాపేట జిల్లాలో 10 వేల ఎకరాల్లో పామాయిల్ పండిస్తున్నారు. మార్కెట్లో డిమాండ్ ఎక్కువ ఉన్నందున తెలంగాణ వ్యాప్తంగా 5 నుంచి 10 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పామాయిల్ సాగు చేయవచ్చని అంచనా వేశారు.
రాష్ట్రంలో 80-90 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయవచ్చునని, కాని ఇందులో కూడా మార్కెట్ అవసరాలకు తగ్గట్టు రకాలు పండించాలంటున్నారు. సన్న రకాలు ఎన్ని పండించాలి? దొడ్డు రకాలు ఎన్ని పండించాలనే విషయంలో కూడా స్పష్టత ఉండాలంటున్నారు. కేరళ, తమిళనాడు లాంటి రాష్ట్రాలకు బాయిల్డ్ రైస్ ఎగుమతి చేయాల్సి ఉంటుంది కాబట్టి దొడ్డు రకాలు పండించాలని సూచిస్తున్నారు. తెలంగాణ ప్రజలు ఎక్కువగా సన్న రకాలు తింటారు. కాబట్టి వాటినీ పండించాలని, బియ్యం గింజ పొడవు 6.2 ఎంఎం అంతకన్నా ఎక్కువ ఉన్న రకాలకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉంటుందని, కాబట్టి ఆయా రకాలనూ పండించాలని, ఏది ఎంత పండించాలనే విషయంలో నిర్ణయం తీసుకుని, అందుకనుగుణంగా సాగు చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం.
తెలంగాణ వ్యవసాయ శాస్త్రవేత్తలు రూపొందించిన తెలంగాణ సోనా బియ్యం రకానికి మంచి డిమాండ్ ఉందని, మధుమేహ వ్యాధి గ్రస్తులకు ఇవి చాలా మంచివంటున్నారు. షుగర్ ఫ్రీ రైస్ గా వీటిని వ్యవసాయ రంగ నిపుణులు గుర్తించారని, తెలంగాణ సోనా రకం బియ్యంలో గ్లైసమిన్ ఇండెక్స్ తక్కువ శాతం ఉంటుందని, ఇది ఆరోగ్యదాయకమని అమెరికన్ జర్నల్స్ కూడా ప్రచురించినట్లు ప్రభుత్వం చెబుతోంది. తెలంగాణ సోనాకు మంచి బ్రాండ్ ఇమేజి ఉంది కాబట్టి ఈ రకాన్ని ఈ వర్షాకాలం సీజన్ లోనే 10 లక్షల ఎకరాల్లో పండించాలని, దీనికి కావాల్సిన విత్తనాలను కూడా వ్యవసాయ యూనివర్సిటీ సిద్ధం చేసిందని ప్రభుత్వ వర్గాలు నివేదించాయి.
రాష్ట్రంలో, దేశంలో, అంతర్జాతీయంగా మార్కెట్ పరిస్థితులను ఎప్పటికప్పుడు అధ్యయనం చేసి, మార్గదర్శకం చేయడానికి ఒక నిపుణుల కమిటీని నియమించాలని, ఆయా విధంగా రైతులంతా ఒకే పంట వేసి నష్టపోకుండా, ప్రభుత్వం సూచించిన పంటలే సాగు చేసే నియంత్రిత పద్ధతి రాష్ట్రంలో వచ్చి తీరాలని వ్యవసాయ రంగ నిపుణులు, వ్యవసాయాధికారులు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం సూచించిన పంటలు వేయని రైతులకు రైతుబంధు సాయాన్ని ఆపివేయాలని, వారు పండించిన పంటలకు కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయవద్దని వారు ప్రభుత్వానికి గట్టి సూచన చేశారు.
ఈ సారి కరోనా లాక్ డౌన్ పరిస్థితుల కారణంగా ప్రభుత్వం మానవీయ దృక్పథంతో పంటల కొనుగోళ్లు జరుపుతున్నదనీ, ప్రతీ ఏటా ఇలాగే కొనుగోళ్లు జరపడం ప్రభుత్వానికి సాధ్యం కాదని కూడా స్పష్టం చేశారు. ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదని, మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగానే పంటలు పండించడం తప్ప మరోమార్గం లేదని కూడా సర్కార్ ఖరాఖండిగా చెబుతోంది.
తాము చెప్పిన పంటలను సాగు చేయని రైతులకు రైతుబంధు సాయం నిలిపివేస్తామని ప్రభుత్వం చేసిన ప్రకటన అనంతరం మరో కీలక అంశంపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తనకు గల భూమి, సాగునీటి లభ్యత, కూలీల సమస్య, కోతుల బెడద, అడవి పందుల సమస్య వంటి అనేక అంశాలు రైతు పండించే పంట చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. అయినప్పటికీ సర్కారు సలహా, నిర్ణయం ప్రకారం తనకు ఆచరణలో సాధ్యం కాని పంటను సైతం రైతు సాగు చేయక తప్పకపోవచ్చు. కానీ ఏ పంటా సాగు చేయకుండా ఎకరాల కొద్దీ భూములను ‘పడావ్’ (బీడు)గా మార్చిన భూస్వాముల సంగతేంటి? దుక్కి దున్నకుండా, విత్తనం విత్తకుండానే లక్షలాది రూపాయలను రైతుబంధు పథకం కింద లబ్ధి పొందుతున్న ‘పడావ్’స్వాముల విషయంలో ప్రభుత్వం అనుసరించే వైఖరి ఏమిటి? బీడు భూములకు చెల్లిస్తున్న కోట్లాది రూపాయల రైతుబంధు సాయాన్ని కేసీఆర్ సర్కార్ వెంటనే నిలిపివేస్తుందా? లేదా? ఇవీ రైతాంగంలో నెలకొన్న తాజా సందేహాలు. తీర్చాల్సిన బాధ్యత పాలకులదే!