వనమా వెంకటేశ్వరరావు… రేగా కాంతారావు… భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలోని ఎమ్మెల్యేలు. గత ఎన్నికల్లో ఈ ఇద్దరు నేతలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసి విజయం సాధించారు. తమకు ఓటు వేసి గెలిపించిన ప్రజల వేలిపై సిరా మరక కూడా ఆరకముందే అధికార టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కొత్తగూడెం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వనమా వెంకటేశ్వరరావు తన నియోజకవర్గంలోని లక్ష్మిదేవిపల్లి మండలం రేగళ్ల ప్రాంతంలోని అటవీ గ్రామాల్లో నివసించే ప్రజలకు ఇటీవల నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు.
అదేవిధంగా పినపాక అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వ విప్ రేగా కాంతారావు గత శనివారం అంటే… ఈనెల 9వ తేదీన ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో గల భద్రాచలం నియోజకవర్గంలోని చర్ల, దుమ్మగూడెం మండలాల్లో పర్యటించారు. మావోయిస్టు నక్సల్స్ ప్రభావం తీవ్రంగా గల ఛత్తీస్ గఢ్ అడవులను అనుకుని ఉన్న పెదమిడిసిలేరు, చినమిడిసిలేరు, బండిరేవు గ్రామాల్లో పర్యటించి అక్కడి ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. లాక్ డౌన్ పరిస్థితుల్లో అటవీ గ్రామాల్లోని ప్రజలను, ముఖ్యంగా గిరిజనులను ఆదుకునే అంశంలో అటు వనమా, ఇటు రేగా కాంతారావుల తపన అభినందనీయమే. అయితే…
ములుగు ఎమ్మెల్యే ధనసరి అనసూయ అలియాస్ సీతక్క తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ ప్రజలనే కాదు, అటవీ గ్రామాల్లోని ప్రతి ఆదివాాసీ కుటుంబాన్ని ఆదుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే రేగా కాంతారావు పర్యటించిన రోజే… సరిగ్గా ఈనెల 9వ తేదీన, శనివారం రోజు కొత్తగూడెం నియోజకవర్గంలోని రేగళ్ల గ్రామానికి వెడుతుండగా పోలీసులు అడ్డుకున్నారట. ఆ ప్రాంతంలో మావోయిస్టు నక్సల్స్ కదలికలు ఉన్నాయని, సరుకుల పంపిణీకి అనుమతించేది లేదని పోలీసులు నిలువరించడంతో చేసేదేమీ లేక ఆమె వెనుదిరిగారట. కొత్తగూడెం జిల్లా కేంద్రానికి రేగళ్ల గ్రామం కూతవేటు దూరంలోనే ఉండడం గమనార్హం.
వాస్తవానికి సీతక్క గత ఎన్నికల్లో గెలుపు అనంతరం పార్టీ కండువాను కూడా మార్చలేదు. బూర్జువా మనస్తత్వం గల నాయకురాలు అంతకన్నా కాదు. విప్లవ భావాలను నరనరాన జీర్ణించుకున్న ‘మాజీ’ అక్క. పూర్వ కాలంలో నక్సల్ నేత. ఓ సాయుధ దళానికి నాయకత్వం వహించిన జనశక్తి పార్టీ కమాండర్. అందులోనూ ఆదివాసీ ఆడపడుచు. ఇటువంటి నేపథ్యంగల సీతక్క గడచిన యాభై రోజులుగా అటవీ గ్రామాల్లోని గిరిజనుల కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. లాక్ డౌన్ పరిస్థితుల్లో ఆమె ప్రజలకు చేస్తున్న సేవలను జాతీయ మీడియా సంస్థలు సైతం ప్రశంసిస్తున్నాయి.
గత జీవితంలో ‘గన్’ పట్టి సమసమాజ స్థాపన కోసం సాయుధ పోరాటం చేసిన సీతక్క రేగళ్ల గ్రామంలో పర్యటిస్తే మావోలు ఆమెపై తుపాకీ ఎక్కుపెడతారా? అధికార పార్టీకి చెందిన నేతలు ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో పర్యటించినా వారికి మాత్రం ఎటువంటి ఇబ్బందులు ఉండవా? విపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేకు మాత్రమే నక్సల్స్ కదలికలు అవరోధమా? ముప్పును కలిగిస్తాయా? ఇవీ రాజకీయంగా తలెత్తుతున్న తాజా సందేహాలు. అంటే సీతక్క ‘సేవల’ కదలికలు రాజకీయంగా ప్రత్యర్థులకు భయాన్ని కలిగిస్తున్నాయనే భావనను ఆమె అభిమానులు ఈ సందర్భంగా వ్యక్తం చేస్తున్నారు.