కరోనా కట్టడిలో భాగంగా పోలీసులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. లాక్ డౌన్ అమలులో రేయింబవళ్లు పోలీసులు పడుతున్న కష్టానికి వెల కట్టలేం. పోలీస్ యంత్రాంగం వీధుల్లో విధులు నిర్వహించకుంటే కరోనా మరెంత మందిని బలి తీసుకునేదనే అంశాన్ని ఖరాఖండిగా చెప్పలేం. కొన్ని ప్రాంతాల్లో పోలీసులు కూడా కరోనా బాధితులుగా మారాల్సిన పరిస్థితి విధి నిర్వహణలోనే ఎదురవుతోంది. కరోనా కట్టడిలో పోలీసుల స్వేదం అమూల్యం కూడా. ఈ కల్లోల సమయంలో పోలీసుల శ్రమను దేశవ్యాప్తంగానే కాదు, మన తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రజలు ప్రశంసిస్తున్న ఘటనలు కోకొల్లలు. కానీ…
ఇటువంటి కష్ట, క్లిష్ట సమయాల్లోనూ కొందరు పోలీసులు తమ ‘పాత’ పద్ధతులను విడనాడలేకపోతున్నారు. చేయి ‘తడి’ విధానాన్ని మానలేకపోతున్నట్లున్నారు. కావాలంటే ఈ వీడియోను చూడండి. ఓ ఆటో ట్రాలీ రోడ్డుపై ఏవో సరుకులను రవాణా చేస్తూ వెడుతుండగా బైకుపై వచ్చిన ఇద్దరు పోలీసులు అటకాయించారు. ఓ పోలీసు బైక్ దిగి ఆటో ట్రాలీ వ్యక్తి దగ్గరకు వెళ్లాడు. ఏదో మాట్లాడాడు. ఆటో ట్రాలీకి రెండు వైపులా కోవిడ్-19 డ్యూటీ స్టిక్కర్లు కూడా ఉన్నట్లున్నాయి. కానీ ఈ పోలీసులలో ఒకరు ఆయా ఆటో ట్రాలీ వ్యక్తితో ఏం మాట్లాడారు? ఆ ట్రాలీ వ్యక్తి కరెన్సీ నోట్లను లెక్క చూసి మరీ కానిస్టేబుల్ చేతిలో ఎందుకు పెట్టినట్లు? ఇంతకీ ఆ ట్రాలీలో రవాణా అవుతున్న సరుకు ఏమిటి? ఇవీ సందేహాలు.
ఈ ‘వసూళ్ల’ పర్వం ఎక్కడ జరిగిందనే అంశంపై స్పష్టత లేకపోయినా, పోలీస్ లోగో చూస్తుంటే మాత్రం హైదరాబాద్ ఘటనగా గోచరిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉదంతం తెలంగాణా రాజధానిలో జరిగినా, జరక్కపోయినా అసలేం జరిగిందనే దృశ్యాన్ని దిగువన వీడియోలో చూడండి.