కల్వకుంట్ల తారక రామారావు. రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి. ‘కేటీఆర్’గా ప్రాచుర్యం పొందిన తెలంగాణా సీఎం కేసీఆర్ తనయుడు. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రానికి భావి ముఖ్యమంత్రిగా అభిమానులు ఆకాంక్షిస్తున్న నేత. పార్టీపరంగానే కాదు… మంత్రిగానూ తన సమర్ధతను ఎన్నోసార్లు రుజువు చేసుకున్న తిరుగులేని టీఆర్ఎస్ నాయకుడు. తనను రాజకీయంగా ఈ స్థాయికి తీసుకువచ్చిన సిరిసిల్ల నియోజకవర్గమంటే ‘కేటీఆర్’కు ప్రాణం. గుండెనిండా సిరిసిల్లవాసులే. వాళ్లంటే ఆయనకు ఎనలేని ప్రేమ. అక్కడి ప్రజల కోసం నిత్యం ఏదో చేయాలనే తపన. ఇందుకోసం కేటీఆర్ చేస్తున్న నిర్వరామ కృషి రాజకీయ ప్రత్యర్థులు సైతం కాదనలేని వాస్తవం.
ప్రతి ఎన్నికలోనూ తనకు అప్రతిహత విజయాన్ని చేకూరుస్తున్న సిరిసిల్ల నియోజకవర్గ అభివృద్ధికి, అక్కడి ప్రజల క్షేమమే ప్రధాన లక్ష్యంగా కేటీఆర్ నిత్యం పాటుపడుతుంటారు. మంత్రిగా ఓవైపు రాష్ట్రాభివృద్ధిని కాంక్షిస్తూనే, మరోవైపు సిరిసిల్ల సెగ్మెంటుకు అన్ని విధాలుగా పెద్దపీట వేస్తూనే ఉంటారు. ఇందులో భాగంగానే ఆయన సోమవారం సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించారు. టెక్స్ టైల్ పార్కులో సెంట్రల్ లైటింగ్ ప్రారంభోత్సవం వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో కేటీఆర్ పాల్గొన్నారు.
అయితే ఈ సందర్భంగా కేటీఆర్ జలుబుతో బాధపడుతున్నట్లు కనిపించింది. తుమ్మతూ, దగ్గుతూ అనేక అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. తనకు కాస్త ఆరోగ్యం బాగా లేదని, అందుకే త్వరగా తిరిగి వెడుతున్నట్లు కేటీఆర్ ఈ సందర్భంగా ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు స్పష్టం చేశారు. ఆరోగ్యపరంగా ఇబ్బందిపడుతున్నప్పటికీ, తమ కోసం మండుటెండలో పర్యటించి అభివృద్ధి పనుల్లో భాగం పంచుకున్న కేటీఆర్ తపనకు సిరిసిల్ల ప్రజలు మరింత ముగ్ధులయ్యారు. మరోవైపు ఆయన జలుబుతో బాధపడుతున్న తీరును చూసి ఒకింత బాధ కూడా పడ్డారు. తనను నమ్ముకున్న ప్రజల కోసం జలుబును బేఖాతర్ చేసి పర్యటించిన కేటీఆర్ చిత్తశుద్ధిపై సిరిసిల్ల ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కేటీఆర్ సిరిసిల్లలో పర్యటించిన వీడియోను దిగువన చూడండి.