ఓవైపు కరోనా కల్లోల పరిస్థితులు… మరోవైపు ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ విషాద ఘటన… ఈ నేపథ్యంలోనే అమరావతి నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని తరలింపునకు రంగం సిద్ధమవుతోందా? ఇందుకు సంబంధించిన ప్రక్రియ అంతర్గతంగా అత్యంత వేగంగా జరుగుతోందా? ఈమేరకు ముహూర్తం కూడా ఖరారైందా? మాట తప్పని, మడమ తిప్పని నేతగా ప్రాచుర్యం పొందిన ఏపీ సీఎం వైెస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ నుంచి ఈ నెలాఖరులోనే కొత్త రాజధాని పాలనను ప్రారంభించబోతున్నారా? అనే సందేహాలు తాజాగా ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.
ఈనెల 28వ తేదీన ఉదయం 8.30 గంటలకు సీఎం జగన్ తన క్యాంపు ఆఫీసును విశాఖలో ప్రారంభిస్తారనే ప్రచారం సోషల్ మీడియాలో విస్తృతంగా జరగడమే ఇందుకు ప్రధాన కారణం. అదే రోజు నుంచి విశాఖ నగరం ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చరిత్రకెక్కనుందనే వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటికే వాడుకలో గల మిలీనియం టవర్స్ నుంచి కాకుండా గ్రేహౌండ్స్ కాంపౌడ్ లో గల భవనాల నుంచి ఎగ్జిక్యూటివ్ రాజధాని పాలన ప్రారంభమవుతుందనేది ఆయా వార్తల ప్రచారపు సారాంశం. ఇందులో భాగంగానే ఇప్పటికే 20 లారీల ఫర్నీచర్ ను విశాఖకు తరలించినట్లు కూడా ప్రచారం సాగుతోంది. తాజాగా జరుగుతున్న ఈ ప్రచారంలో వాస్తవ, అవాస్తవాలు తేలాలంటే దాదాపు మరో రెండు వారాలకు పైగా వేచి చూడక తప్పదు.