కరోనా వ్యాక్సిన్ తయారీ కోసం తెలంగాణా గడ్డపై ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. భారతదేశం నుంచే వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందన్నారు. అయితే హైదరాబాద్ కు చెందిన ఔషధ కంపెనీలు ఇందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాయన్నారు. హైదరాబాద్ నుంచి వ్యాక్సిన్ వచ్చే చాన్స్ కూడా ఉందని కేసీఆర్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. జూలై-ఆగస్టు నెలల్లో వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందని కూడా ఆయన వెల్లడించారు. వ్యాక్సిన్ వస్తే పరిస్థితిలో మార్పు వస్తుందని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం దేశంలోని ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు.
కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా దేశంలో నిలిపేసిన ప్రయాణికుల రైళ్లను ఇప్పుడే పునరుద్ధరించవద్దని ముఖ్యమంత్రి ప్రధానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాల అప్పులను రీ షెడ్యూల్ చేయాలని, ఎఫ్ఆర్బిఎం పరిమితి పెంచాలని, ఏ రాష్ట్రానికి చెందిన వలస కూలీలను ఆ రాష్ట్రం అనుమతించాలని సీఎం సూచించారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు కేంద్రం, రాష్ట్రాలు కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు. దేశంలో సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటూ, సరైన చర్యలు తీసుకుంటున్నామని అభిప్రాయపడ్డారు. కరోనాపై తప్పక విజయం సాధిస్తామనే ఆశాభావం వ్యక్తం చేశారు.
దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబాయి, చెన్నై, హైదరాబాద్ తో పాటు చాలా నగరాల్లో కరోనా ప్రభావం ఉందని, ఈ ప్రాంతాల్లో ఎక్కువ సంఖ్యలో కరోనా బాధితులున్నారని చెప్పారు. కాబట్టి ఇప్పుడే ప్రయాణీకుల రైళ్లను నడిపితే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి రాకపోకలు ఎక్కువగా జరుగుతాయని కేసీఆర్ అన్నారు. ఎవరు ఎటు పోతున్నారో తెలియదని, వారికి కరోనో ఉందో లేదో కూడా తెలియదని, అందరికీ టెస్టులు చేయడం కుదరదన్నారు. రైళ్లలో వచ్చిన ప్రయాణీకులను క్వారంటైన్ చేయడం కూడా కష్టమన్నారు. కాబట్టి ఇప్పుడిప్పుడే ప్రయాణీకుల రైళ్లను నడపొద్దని కేసీఆర్ ప్రధానికి సూచించారు.
కరోనా ఇప్పుడిప్పుడే మనల్ని వదిలి పోయేట్టు కనిపించడం లేదన్నారు. కాబట్టి కరోనాతో కలిసి బతకడం మనకు తప్పదన్నారు. ఈ విధంగా ప్రజల్ని నడిపించాలని, ముందుగా వారిలో భయాన్ని పోగొట్టాలని, కరోనాతో కలిసి బతకడం నేర్చుకోవాలని కేసీఆర్ ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ స్పష్టం చేశారు.