అక్షయ్ దాస్…కూరగాయల వ్యాపారం చేస్తుంటాడు. పశ్చిమ బెంగాల్లోని తూర్పు మిడ్నాపూర్ జిల్లా సుతహత ప్రాంతంలో ఇతనికి ఓ కొట్టు ఉంది. ఎప్పటిలాగే గత సోమవారం రోజు రాత్రి తన షాపును కట్టేసి మరుసటిరోజు ఉదయాన్నే తిరిగి తెరిచాడు. షాపులోని దృశ్యం చూసి తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. ఎందుకంటే అతని షాపులో దొండలు పడి చోరీ జరిగిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. హడావిడిగా గల్లాపెట్టె తెరిచి చూసిన దాస్ ఊపిరి పీల్చుకున్నాడు. ఎందుకంటే క్యాష్ బాక్స్ లోని చిల్లి గవ్వను కూడా దొంగలు ముట్టుకోలేదు. మరి ఏం దొంగతనం జరిగిందనేగా మీ డౌటు? అక్షయ్ దాసుకు చెందిన షాపులోని కొన్ని ఉల్లిపాయల బస్తాలతోపాటు వెల్లుల్లి, అల్లం బస్తాలు మాత్రం కనిపించలేదు. దొంగలు ఎత్తుకెళ్లింది ఆయా సరుకుల బస్తాలే మరి. చోరీకి గురైన ఉల్లి, అల్లం, వెల్లుల్లి బస్తాల విలువ రూ. 50 వేలు మాత్రమేనట. కోల్ కతాలో ఉల్లిపాయల ధర రూ. 100 పలుకుతోంది. అర్థమైందిగా దొంగలు దాస్ షాపులోని నగదును ఎందుకు ముట్టుకోలేదో? కరెన్సీ కాగితంకన్నా ఉల్లి విలువ మిన్న అన్నమాట.