కాంగ్రెస్ సీనియర్ నేత, బుగ్గారం మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు (92) ఇక లేరనే వార్త ఆయన అభిమానుల్లో, పార్టీ శ్రేణుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. కరీంనగర్ లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం రత్నాకర్ రావు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ప్రస్తుత జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని తన స్వగ్రామమైన తిమ్మాపూర్ సర్పంచ్ నుంచి దేవాదాయ, ధర్మాదాయశాఖ మంత్రిగా రత్నాకర్ రావు రాజకీయ ప్రస్థానం ఓ ప్రత్యేకతగానే కాంగ్రెస్ శ్రేణులు అభివర్ణిస్తుంటాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభివృద్ధికి, కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు రత్నాకర్ రావు చేసిన సేవలను పార్టీ వర్గాలు ఎప్పటికీ మర్చిపోలేని ఘట్టాలు. ఇందులో ఎటువంటి సందేహం కూడా లేదు.
నీతికి, నిజాయితీకి, క్రమశిక్షణకు మారుపేరుగా ప్రాచుర్యం పొందిన రత్నాకర్ రావు దాదాపు పాతిక సంవత్సరాల క్రితం ఓ ప్రముఖ పత్రిక ప్రచురించిన వార్త కారణంగా తన జీవితంలో మర్చిపోలేని చేదు అనుభవాన్ని చవి చూశారు. తాను చనిపోలేదని, రాజకీయ ప్రత్యర్థుల కుట్రగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న అప్పటి బుగ్గారం నియోజకవర్గం వ్యాప్తంగా జీపులకు మైకులు పెట్టి మరీ ప్రచారం చేయించుకోవలసి వచ్చింది. అందుకు దారి తీసిన ఘటన పూర్వాపరాల్లోకి వెడితే…
‘బుగ్గారం ఎమ్మెల్యే జువ్వాడి రత్నాకర్ రావు మృతి’ చెందారంటూ అప్పటి ఆంధ్రజ్యోతి (వేమూరి రాధాకృష్ణకు చెందిన ప్రస్తుత ఆంధ్రజ్యోతి కాదు) ఓ వార్తను మెయిన్ ఎడిషన్ ఫస్ట్ పేజీలోనే ప్రముఖంగా ప్రచురించింది. దీంతో కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కేడర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పత్రిక కార్యాలయం ముందు ధర్నాలు చేసి నిరసన వ్యక్తం చేసింది. అంతేకాదు బుగ్గారం ఎమ్మెల్యే రత్నాకర్ రావు చనిపోలేదని, ఆయన బతికే ఉన్నారని, ఇది ప్రత్యర్థి రాజకీయ పార్టీల కుట్రగా స్థానిక కాంగ్రెస్ నేతలు జీపులకు మైకులు కట్టి ఊరూరా ప్రచారం చేశారు. కాంగ్రెస్ కేడర్ ఆగ్రహంతో కంగుతిన్న ఆ పత్రిక అనివార్యంగా మరుసటి రోజు క్షమాపణ చెబుతూ మరో వార్తను కూడా ప్రచురించింది.
ఇంతకీ ఏం జరిగిందంటే… ఎవరో అనామకుడు హైదరాబాద్ లోని పత్రికాఫీసుకు ఫోన్ చేసి రత్నాకర్ రావు మృతి చెందారని చెప్పాడట. అయితే ఈ అంశంలో కనీసం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ద్వారా విషయాన్ని ధృవపర్చుకోకుండానే అప్పటి ఆంధ్రజ్యోతి ఆయా వార్తను ప్రచురించిందన్నది ఓ కథనం. ఈ వార్త గురించి రత్నాకర్ రావు తాను నిర్వహించే ప్రెస్ కాన్ఫరెన్సుల్లో తరచూ ప్రస్తావించేవారు. అప్పట్లో ఆంధ్రజ్యోతి పత్రిక విలేకరి కనిపిస్తే చాలు… ‘నేను బతికే ఉన్నాను సోదరా…కనిపిస్తున్నాను కదా?’ అంటూ నవ్వుతూనే ‘చురక’ అంటించేవారు. తనను తీవ్ర మానసిక వేదనకు గురిచేసిన ఆ పత్రికపై ఎటువంటి కనీస చర్యకు ఉపక్రమించకుండా రత్నాకర్ రావు క్షమించడం ఆయన ఉదారవాద హృదయానికి నిదర్శనంగా జర్నలిస్టు వర్గాలు అభివర్ణిస్తుంటాయి.