ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో విషగాలి ఎనిమిది మందిని పొట్టన బెట్టుకుంది. ఏం జరిగిందో తెలిసేలోపే పలువురి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. గోపాలపట్నం పరిధిలోని ఆర్.ఆర్. వెంకటాపురం వద్ద గల ఎల్జీ పాలిమర్స్ నుంచి లీకైనట్లు భావిస్తున్న రసాయన వాయువు ప్రమాదానికి కారణంగా అంచనా వేస్తున్నారు. ఊపిరి తీసుకోవడమే కష్టంగా మారిన పరిస్థితుల్లో కళ్ల మంటలు, ఒంటిపై దుద్దుర్లు ఏర్పడిన పరిణామాలు ప్రజలను ఒక్కసారిగా భీతావహానికి గురి చేశాయి. జరిగిందేమిటో అర్థం కాకముందే అనేక మంది కుప్పకూలి తుదిశ్వాస విడిచారు. విషవాయువును పీల్చి నడిరోడ్డుపైనే కుప్పకూలి అపస్మారక స్థితిలోకి వెళ్లిన వందలాది మందిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఐదు కిలోమీటర్ల వరకు ఈ విషగాలి ప్రభావం ఉండవచ్చని, ఆయా పరిధిలోని ప్రజలు ఇళ్లు ఖాళీ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.