మనం నీతిగా ఉంటే సరిపోద్ది కదా…? అని నేను అంటాను. మనం ఉంటేనే సరిపోదు… అలా ఉన్నట్టు మనం ఎప్పటికప్పుడు శీల పరీక్షలో పునీతం కావాల్సి వుంటుంది. ఇదీ లోకం రీతి అనేది జర్నలిజంలో నా సీనియర్ దళవాయి శ్రీనివాస్ గారి ఫిలాసఫీ. బెజవాడ జర్నలిస్టులు 1996లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అలాంటి శీల పరీక్షనే ఎదుర్కోవాల్సి వచ్చింది.
పర్వతనేని ఉపేంద్రను విజయవాడ పార్లమెంట్ సీటుకు కాంగ్రెస్ అభ్యర్థిగా అధిష్టానం ఎంపిక చేసింది. ఎన్నికల యాజమాన్యం (ప్రలోభ యాజమాన్యం అనుకోండి) లో మాంచి దిట్టగా ఉపేంద్రకు అప్పటికే పేరుంది.
ఉపేంద్రకు మీడియాలో బంధువర్గంతో పాటు మంచి ఫాలోయింగ్ కూడా ఉండేది. వారిద్వారా మీడియాకు అందిన ఉప్పు ఏమిటంటే ఉపేంద్ర ఎన్నికల ముందు రిఫ్రిజిరేటర్లు పంపిణీ చేస్తారని. ఇందుకు అనుగుణంగా మీడియాలోని విలేకర్లతో జాబితా కూడా తయారవుతోంది.
ఫ్రిజ్ ధర అప్పట్లో రూ. 10 వేల లోపే అనుకుంటా. ఇంకా మధ్య తరగతి ఇళ్లల్లోని డైనింగ్ హాలులోకి అది ఇంకా వయ్యారంగా నడుచుకుంటా రాలేదు. బెజవాడ మీడియాలో విలేకర్లు పట్టుమని పదిమంది ఉంటే నాకు తెలిసి ఫ్రిజ్ వున్నవాళ్లు ఇద్దరో, ముగ్గురో ఉండొచ్చేమో. మాది డబల్ ఇన్కమ్ గ్రూప్ అయినా పదేళ్ల తర్వాత గానీ చల్లనమ్మా మా ఇంటికి చక్కగా రాలా.
ఈనాడుకు అనుబంధంగా నడిచిన ‘న్యూస్ టైం’లో శ్రీనివాస్ గారు నాకు బాస్. తర్వాత కాలంలో ఇద్దరం ‘ది హిందూ’ పత్రికలో కలిసి పనిచేశాం. అయన గురించి కొంచెం ఇక్కడ చెప్పాలి. లోకులంటే ఆయనకు భయం ఎక్కువ. నలుగురి కళ్ళల్లో పడకుండా గుట్టుగా బతకాలనే మనిషి. ఆయన వేసుకొనే బట్టలు, మాట తీరు కూడా అందుకనుగుణంగానే ఉండేవి.
ఎన్నికల నోటిఫికేషన్ కు ముందు ఈనాడులో మా అందరికి బోనస్ వచ్చింది. బోనస్ డబ్బును ఈనాడు ఉద్యోగులు ఏ ఏటికాయేడు తమ అవసరాలకు, అభిరుచులకు అనుగుణంగా ఖర్చు పెట్టేవారు. ఆ ఏడు నేను అదనంగా కొంత డబ్బు కలిపి నా కూతురుకు గొలుసు కొన్నాను.
శ్రీనివాస్ గారు ఫ్రిజ్ కోసం డబ్బు దాచారు. ఫ్రిజ్ ఎంపికకు నేను షాపునకు రావాల్సి ఉంటుందని కోరారు. ఈలోపు ఎన్నికలొచ్చాయి. కవరేజీ కోసం నేను, అయన బయట జిల్లాలకు వెళ్లాల్సి వచ్చింది. ఎన్నికలయ్యాయి. ‘సార్, ఫ్రిజ్ ఎప్పుడు కొందాం…? అన్నాను. ఇప్పట్లో ఫ్రిజ్ కొనదలుచుకోలేదండి అని తాను అన్నారు. ‘అదేంటి సార్? మనం ముందునుంచి అనుకున్నదేగా? ఇప్పుడేంటి ఇలా? ” అన్నాను.
ఉపేంద్ర విలేకర్లకు ఫ్రిజ్ లు పంచాక ఇక మన ఇళ్లల్లో అలాంటి వస్తువు ఉండకూడదండి… అని అన్నారు. ‘ఏం, ఎందుకని? మన శీలం ఎలాంటిదో మనకు తెలియదా? ఎవరో ఏంటో అంటారని మనం భయపడుతూ బతకాలా? అని నేను రెట్టించాను. ‘అవునండీ భయపడుతూ బతకాలి… తప్పదు’ అని అన్నారు.
‘మనవి మధ్యతరగతి కుటుంబాలు. ఖరీదయిన వస్తువులు ఇంటికి వచ్చినవారిని ఇట్టే ఆకర్షిస్తాయి. మీరే మా ఇంటికి వచ్చారనుకోండి. వేసవి కాలం కదా? అని చల్లటి నీళ్లు ఫ్రిజ్ లోంచి మేము ఇస్తాం. ఈ ఫ్రిజ్ కొన్నారా లేక ఉపేంద్రగారు ఇచ్చారా? అని నన్ను సూటిగా అడగరు. ఇచ్చింది ఆయనే అయి వుంటారులే’ అనుకుని మా ఇంట్లో ఫ్రిజ్ సంగతి నలుగురికి చెపుతారు. ఇలా నా శీలం గంగలో కలిసి పోతుంది’ అని శ్రీనివాస్ గారు చెప్పారు.
ఆ తర్వాత ఆయన ఈనాడు సంస్థను వదిలేసి ది హిందూ పత్రికకు ఏలూరు వెళ్లారు. అంతటితో ఫ్రిజ్ కత కంచికి చేరింది. తర్వాత కొంత కాలానికి నేను ఏలూరుకు వెళ్ళినప్పుడు ఆయనింట్లో ఫ్రిజ్ చూశా…!
✍️ నాగరాజా గాలి