కరోనా జమానాలో కవిత్వం పొట్టు పొట్టుగా పోటెత్తింది. ఇంకా మత్తడి వలె దుముకుతూనే ఉంది. జోర్దార్ గా దుమ్ము రేపుతూనే ఉంది. ప్రశ్నించే కవులు, కళాకారులు భౌతికంగానో, మానసికంగానో నిర్బంధం అనుభవిస్తున్న రోజుల్లో… పాలకులు పిలుపునిచ్చినప్పుడు అనధికార ఆస్థాన సృజనకారులు రెచ్చిపోవడం మామూలే. వాళ్ల ప్రభావంలో కవిసమాజం కూడా అదే దారిలో ఉరుక్కుంట పోవడమూ మామూలే.
లాక్డౌన్ కాలంలో వందల మంది కవులు వందలాది కరోనా పాటలను జనం మీదకు వదిలారు. సోషల్ మీడియాలో బొచ్చెడు సాహిత్యం వరదలా పారించారు. కరోనా వైరస్‌ను లాక్డౌన్ కట్టడి చేసిందో లేదో గాని, కట్టల కొద్దీ సాహిత్యాన్ని మాత్రం సమాజానికి ముల్లెగట్టి ఇచ్చింది. పనిలో పనిగా కవుల దృష్టి కోణాన్ని, పరిశీలన స్థాయిని కళ్లకు కట్టింది.
మిత్రుడు కవి, రచయిత పసునూరి రవిందర్ ‘కరోనాపై పోటెత్తిన పాట’ అనే శీర్షికతో ఇటీవల ఓ పత్రికలో వ్యాసం రాశారు. కరోనా పాటసాహిత్యాన్ని ఐదు రకాలుగా విభజించారు. 1.కరోనా తీవ్రతను వివరించే పాటలు 2.శుభ్రతను నొక్కి చెప్పే పాటలు 3.లాక్‌డౌన్‌ను పాటించాలనే పాటలు 4.వలస కూలీల దుస్థితిని వివరించే పాటలు 5.త్యాగాలను కీర్తించే పాటలు..గా కరోనా సాహిత్యం వచ్చిందని చెప్పుకొచ్చారు. ప్రస్తుత విపత్తుకు మనిషే కారణమని, ప్రకృతి విధ్వంస ఫలితమే కరోనా విలయతాండవమని కవులు తమ పాటల్లో కళ్లకు కట్టారని వివరించారు. కరోనా నివారణ యజ్ఞంలో ఎలా పాలుపంచుకోవాలో, ఏ జాగ్రత్తలు తీసుకోవాలో, ప్రభుత్వాలు చెప్పినట్టు ఎలా వినాలో హితబోధ చేశాయని విశ్లేషించారు. వలస కూలీల కష్టాలను గొంతులో నింపుకొని ఆర్ధ్రంగా కైగట్టారని చెప్పుకొచ్చారు.
పసునూరి పరిశీలన నిజంగా నిజం. కరోనా వైరస్ మనుషుల వెంట పడితే, కవులు కరోనా వెంట పడ్డారు. అటు ఖతర్నాక్ కరోనా వైరస్‌కు, ఇటు మనలోని మనుషులకు శాపనార్థాలు పెడుతూ పదాలతో కదం తొక్కారు. మూసలో, యాసలో ముందుకు సాగారు. ఒకరిని చూసి మరొకరు ఒకే రీతిలో వాతలు పెట్టుకున్నారు. పదాలు మార్చి మార్చి ఒకే భావాన్ని ఊదరగొట్టారు. పాలకుల వైఫల్యాలను, సన్నద్ధత లోపాలను, వలస కూలీల కష్టాలను అక్షరీకరించకుండా వైరస్ వైరస్ అంటూ కరోనాతాండవం చేశారు. మొత్తం సాహిత్యంలో పాలకులను నిగ్గదీసిన, ప్రశ్నించిన సాహిత్యం అరకొర మాత్రమే అనే విషయాన్ని బహుశా.. పసునూరి కూడా అంగీకరించక తప్పదు.
లాక్డౌన్ తర్వాత దేశవ్యాప్తంగా వలసకూలీల వెతలు అనూహ్యంగా తెరమీదకు వచ్చాయి. పాలకులు, సమాజం ఊహించని విధంగా వారు రోడ్డెక్కారు. ప్రభుత్వాలు కల్పించిన భరోసా ఏ మూలకూ సరిపోకపోవడంతో వారు సామాజిక అభద్రతకు లోనయ్యారు. వలస వచ్చిన ప్రాంతాల్లో తామెన్నటికీ పరాయీలమేనన్న భావన వారిని సొంతూళ్లకు కదిలేలా చేసింది. మూటా ముల్లెలతో వందలు, వేల కిలోమీటర్ల వారు కాలినడకన కదిలిన దృశ్యాలు ఈ దేశ ఆర్థిక, పాలన వ్యవస్థ డొల్లతనాన్ని బట్టబయలు చేశాయి. అసంఘటిత రంగంలోని కార్మికుల బతుకులు ఎంత అధ్వానంగా ఉన్నాయో, వారికి చట్టాలు ఎంత దూరంగా ఉన్నాయో కళ్లకు కట్టాయి.
వలసకూలీల సమస్య జాతీయ, అంతర్జాతీయ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. వందల కిలో మీటర్లు నడుస్తూ దారిలోనే ప్రాణాలు కోల్పోయిన వారిపైన, తరలిన దారుల్లో వారు పడ్డ వర్ణనాతీత కష్టాలపైన పుంఖానుపుంఖాలుగా కథనాలు వచ్చాయి. చీకటి గుయ్యారం వంటి కాంక్రీట్ మిక్చర్ ట్రక్‌లో 18 మంది వలసకూలీలు ‘దొంగల’ వలె నక్కి మహారాష్ట్ర నుంచి ఉత్తరప్రదేశ్‌కు వెళ్లుతూ దారిలో ఇండోర్ వద్ద పోలీసులకు చిక్కిన లాక్డౌన్ కష్టాలకు పరాకాష్టగా నిలిచింది. పాలకుల దూరదృష్టి, ప్రణాళికా లోపం వల్లెనే ఈ సమస్య తలెత్తిందని పత్రికా రచయితలు, మేధావులు తమ వ్యాసాల ద్వారా ఎండగట్టారు. ప్రతికలు సైతం ఈ సమస్యకు అత్యంత ప్రాధాన్యమిచ్చి నిత్యం పతాకశీర్షికల్లో కథనాలు ప్రచురించాయి. లాక్డౌన్ వేళ దేశమంతా ‘వలసకూలీ సమాజం, భద్ర జీవన సమాజం’ అని రెండుగా చీలిపోయినట్టు కనిపించింది.
సమకాలీన మానవీయ సమాజాన్ని ఎంతో కలచివేసిన వలసకూలీల సమస్యపై కవులు స్పందించాల్సిన స్థాయిలో స్పందించలేదు. ఆదేశ్ రవి వంటి ఒకరిద్దరు వలస కూలీల కష్టాలపై సహానుభూతితో దుఃఖమయంగా పాటకట్టినా, ఆ పాటలో అర్థింపు, బేలతనం వుందే తప్ప పాలకులను నిలదీసిన, ప్రశ్నించిన ఛాయలు లేవు. ఎమోషనల్ టింజ్ ఉన్నప్పుడు ఏ పాట అయినా ప్రజలను చుట్టేస్తుంది… నిలువునా ఊపేస్తుంది. జనసమూహ భావోద్వేగాలను ప్రవాహంలా తనలో కలిపేసుకుంటుంది. ఆదేశ్ రవి పాట ఈ కోవలోనే తెలుగు నాట జనహృదయాలను తాకగలిగింది. మనుషులను, మనసులను నిలువునా ద్రవీభవింప చేసింది. అది ఎన్నటికీ వెంటాడే పాట.
బాధితుడెవరైనా సరే, నిస్సహాయుడైనప్పుడు ఆగ్రహానికి బదులు ఆక్రోశాన్ని వెళ్లగక్కుతాడు.. తమ కష్టాలకు కారకులైన వారిపైకి శాపనార్థాలు సంధిస్తాడు… పిడికెడు మన్ను బోసి భోరుమంటాడు. వలసకూలీలు తమ దారిపొడవునా ఈ తరహా నిరసనలనే వెళ్లగక్కారు. పోలీసులపైకి తిరగబడ్డారు. రాస్తారోకోలు, ధర్నాలకు తెగబడ్డారు. పాలకులపై బాజప్తాగా విమర్శలు గుప్పించారు. ఇవేవీ తెలుగు కవుల కలాలను, మనసులను తాకలేకపోయాయి. వారిని కదిలించలేక పోయాయి. వారి పదాల్లో కదం తొక్కలేకపోయాయి. వలసకూలీల పక్షాన పాలకులను నిలువునా ఎండగట్టే ధైర్యానికి పురికొల్పలేకపోయాయి.
బహుశా.. వలస కూలీలు తమ వాళ్లు కాదని, వారి సమస్య తమ సమస్య కాదనే సంకుచిత ధోరణి ఏదో వారిని కట్టడి చేసి ఉంటుంది. రెడ్ జోన్లు, కంటైన్మెంట్ జోన్ల తరహాలో తమను తాము తమదైన లోకానికి పరిమితం చేసుకొని ఉంటారు. లేదంటే పాలకులను కీర్తించే భావదాస్యంలో తలమునకలైనతనం అలవాటులో వలసకూలీల సమస్యను అసలు సమస్యగానే పరిగణించి ఉండకపోవచ్చు. దేశంలో కొన్నాళ్లుగా కోట్లాది కవుల ఆలోచనల్ని ప్రభావితం చేస్తున్న పరోక్ష శక్తుల జమానాలో కవుల నుంచి ఇంతకంటే ఎక్కువ ఊహించడం నిరర్ధకమేమో. సంక్షుభిత వర్గాల నుంచి కంటే, భద్రజీవన వర్గాల నుంచి సాహిత్యం పెరుగుతోందనడానికి కరోనా పాటసాహిత్యమే నిదర్శనమేమో!
నిలదీసేతనాన్ని, ప్రశ్నించేతత్వాన్ని వీడి టన్నుల కొద్దీ సృష్టించే సాహిత్యం… వాట్సప్ స్టేటస్ వలె ఒక్క రోజుకంటే ఎక్కువ మనగలుగుతుందా!?
–శంకర్ శెంకేసి