కేసీఆర్ ఒకటి తలచారు. కానీ పొరుగున గల వైఎస్ జగన్, యడియూరప్ప, ఉద్దవ్ ఠాక్రే మరొకటి తలిచారు. లాక్ డౌన్ నేపథ్యంలో లిక్కర్ ను కాస్తయినా కంట్రోల్ చేయాలని తెలంగాణా ప్రభుత్వం భావిస్తే, ఇరుగు పొరుగు సర్కార్లు దాన్ని కాస్తా బ్రేక్ చేశాయి. తెలంగాణా సరిహద్దుల్లోని ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు మద్యం షాపులు తెరవాలని నిర్ణయించాయి. మందు బంద్ వల్ల ఆర్థికంగా తెలంగాణాకు భారీ నష్టం. అమల్లో కష్టమైనప్పటికీ మద్య నియంత్రణ పాటిస్తున్న తెలంగాణా సర్కారు ప్రస్తుతం తీవ్ర సంకటంలోకి వెళ్లింది. ఏదో ఒక నిర్ణయం తీసుకోవలసిందే.
లేనిపక్షంలో పొరుగు రాష్ట్రాల మద్యం పొంగిపొర్లే అవకాశం ఉంది. అదే జరిగితే తెలంగాణా జనం జేబులు గుల్ల గుల్ల. కల్తీ మద్యం ప్రవేశిస్తే ప్రజల ప్రాణాలకే ముప్పు. గుడుంబా బట్టీలకు మళ్లీ నిప్పటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇరకాటంలో చిక్కుకుంది. ఏదో ఒక నిర్ణయం అనివార్యం. తెలంగాణాలో సర్కారు అధికార పత్రికగా ప్రాచుర్యం పొందిన ‘నమస్తే తెలంగాణా’ ఈ రోజు బ్యానర్ స్టోరీగా ప్రచురించిన వార్తా కథనంలోని సారాంశమిది.
దీని భావమేమిటో దాదాపుగా అర్థమవుతున్నట్లేగా? నమస్తే తెలంగాణాలో ఏదేని ముఖ్యాంశానికి సంబంధించి ఇటువంటి కథనం ప్రచురితమైతే అది సర్కారు యోచనగానే ప్రజలతోపాటు అధికార వర్గాలు కూడా అంచనా వేస్తుంటాయి. ఇందుకు అనుగుణంగా అధికారగణం కూడా సంసిద్ధమవుతుందనే అభిప్రాయం కూడా ఉంది. లిక్కర్ అంశంలోనూ ఈ తాజా కథనాన్ని బట్టి తెలంగాణాలోనూ మద్యం షాపులు తెరుచుకునే అవకాశం ఉన్నట్టే కనిపిస్తోంది. కరోనా కేసుల సంఖ్య తీవ్రంగా గల ఏపీ, మహారాష్ట్ర వంటి సరిహద్దు రాష్ట్రాల్లో లిక్కర్ షాపులు ఓపెన్ చేస్తే తప్పు లేనప్పుడు, రోజు రోజుకూ ‘గ్రీన్ జోన్లు’ పెరుగుతున్న తెలంగాణాలో మాత్రం లిక్కర్ షాపులు మూసేయాల్సిన అవసరముందా?
అందుకే అధికార పత్రికలో తాజా వార్తా కథనం ఓ ఫీలర్ అన్నమాట. వైస్ షాపులు ‘ఓఫెన్ షేశెయ్’ అని పరోక్షంగా సర్కారుకు సలహా కాబోలు. మొన్నామధ్య లాక్ డౌన్ అంశంలోనూ కేంద్ర ప్రభుత్వ విధానాన్ని తూర్పారబడుతూ ‘లాక్ బ్రేక్’ శీర్షికన వరుస వార్తా కథనాలను నమస్తే తెలంగాణా ప్రచురించిన సంగతి తెలిసిందే. దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారనే సంగతి ఎలా ఉన్నప్పటికీ, అధికార పత్రిక ‘ఇండికేట్’ కథనాల ప్రకారమే సర్కారు వ్యవహరించిందన్నది కాదనలేని వాస్తవం. దీన్ని బట్టి అర్థమవుతున్నదేమింటే తెలంగాణాలోనూ 7వ తేదీ తర్వాత లిక్కర్ షాపులు తెరుచుకోవచ్చు. కాబట్టి మందుబాబులు కాస్త ఊపిరి పీల్చుకోవచ్చు.