నామా నాగేశ్వరరావు… ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు, టీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత. తుమ్మల నాగేశ్వరరావు… మాజీ మంత్రి. గత ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమి పాలైన సీనియర్ పొలిటీషియన్. తెలుగుదేశం పార్టీలో ఉన్నపుడు ఈ ఇద్దరు నాగేశ్వరరావులకు అస్సలు పొసిగేది కాదు. అనేక రాజకీయ పరిణామాల మధ్య ప్రస్తుతం ఈ ఇద్దరు నాగేశ్వరరావులు అధికార పార్టీలో ఉన్నారు.
తాజా రాజకీయ పరిణామాల్లో ఖమ్మం జిల్లాలో ఆధిపత్య రాజకీయాలు తారుమారైన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో ఓటమి అనంతరం అయితే హైదరాబాద్, లేదంటే ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని గండుగులపల్లిలో గల తన నివాసంలో తుమ్మల రాజకీయంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ఎంపీ నామా నాగేశ్వరరావు సత్తుపల్లి ప్రాంతంలో పర్యటించిన సందర్భాల్లో అప్పుడప్పుడు ఇలా తుమ్మలను కలుస్తుండడం విశేషం. శనివారం కూడా నామా నాగేశ్వరరావు తుమ్మల నాగేశ్వరరావును సత్తుపల్లి సమీపంలోని పాకాలగూడెంలో కలిశారు. కరోనా నేపథ్యంలో తాను తయారు చేయించిన శానిటైజర్ క్యాన్ ను తుమ్మలకు నామా ఈ సందర్భంగా అందించిన దృశ్యమిది.
ఈ ఫొటోకు సరదాగా… మిమ్మల్ని ఓడించిన సొంత పార్టీ నేతల ‘కుళ్లు రాజకీయ వైరస్’ను ఈ శానిటైజర్ తో కడిగేయండి సార్’ అని నామా వ్యాఖ్యానిస్తే ఆసక్తికరంగా ఉంటుంది కదూ!