‘చేతులు నాకేవాడి మూతి నాకడం’ అనే సామెత తెలుసుగా? అబ్బే… మరీ ఛండాలమైన సామెత అని అసహ్యించుకోనవసరం లేదు. సంఘటన నేపథ్యం ఒక్కోసారి ఇటువంటి అసహ్యకర సామెతను అనివార్యంగా అన్వయించాల్సిన పరిస్థితికి దారి తీస్తుంది. అంతే తప్ప పత్రికా భాషను విస్మరించే అలవాటు ఈ సైట్ కు లేదన్నది సుస్పష్టం. ఇక అసలు విషయంలోకి వద్దాం.
కరోనా కట్టడికి లాక్ డౌన్ చర్యల వల్ల భారీగా ఆదాయాన్ని కోల్పోయామని, ప్రస్తుతం ఈ మొత్తం రూ. 4,500 కోట్లు అని, మరో ఆరేడు నెలల్లో ఈ నష్టం రూ. 15 వేల కోట్ల వరకు చేరుకోవచ్చని దేశంలోని పత్రికాధిపతులు ఆందోళన చెందుతూ కేంద్ర సర్కారు ముందు సాయం కోసం మోకరిల్లిన ఘటన గురించి పొద్దటి పోస్టులో చదివారు కదా? ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించి తమను ఆదుకోకుంటే దివాళా తప్పదని ప్రభుత్వాన్ని అభ్యర్థించిన ‘పత్రికాధిపతుల బొచ్చె’ గురించి చెప్పుకున్నాం కదా?
ఈ నేపథ్యంలోనే తెలుగు ప్రింట్ మీడియాలోని ఓ ప్రముఖ పత్రిక తాజా కక్కుర్తి యవ్వారం ‘విలేకరి గిరి’ బతుకును మరింత అగాధంలోకి నెట్టింది. కరోనా కల్లోలంలో అన్ని రంగాలూ ఇబ్బందులు పడుతున్నాయని నివేదిస్తున్న పత్రికలకు సంబంధించిన యాజమాన్యాలే ఆదాయపరంగా సరికొత్త దారులను అన్వేషిస్తున్నాయి. ఇందుకు రిపోర్టర్లనే ఆయుధంగా మల్చుకుంటున్నాయి. తాజాగా అదేమిటంటే…?
వలస కూలీలకు, దిక్కూ, దివాణం లేనివారికి, పేదలకు, నిరుపేదలకు అనేక మంది దాతలు నిత్యావసర సరుకులు సరఫరా చేస్తూ ఆదుకోవడం ద్వారా తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. ఇటువంటి దాతలను టార్గెట్ చేస్తూ అడ్వర్టయిజ్మెంట్ల వసూళ్లు చేయాలని తెలుగు రాష్ట్రాల్లోని ఓ ప్రముఖ పత్రిక తమ విలేకరుల మెడపై కత్తిని మోపింది. దాతలు ఔదార్యాన్ని చాటుతూ నిత్యావసర సరుకులు అందించిన కార్యక్రమాన్ని పత్రికలో ప్రముఖంగా ప్రచురించే వార్తా కథనానికి రేట్ నిర్ణయించింది. ఓ రకంగా చెప్పాలంటే ఎన్నికల్లో అనుసరించే ‘పెయిడ్ ఆర్టికల్’ విధానాన్ని కరోనాలో పేదలను ఆదుకునే దాతలకూ ప్రవేశపెట్టింది. దాతల సాయానికి సంబంధించిన వార్తను 12X12 సైజులో ప్రచురించేందుకు రూ. 20 వేల ధరను ఈ పత్రిక నిర్ణయించింది.
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి కనీసంగా రూ. లక్షమొత్తం వసూల్ చేయాలని తమ పత్రిక విలేకర్లకు టార్గెట్లు విధించింది. అంటే నియోజకవర్గ సంఖ్య ప్రకారం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సదరు పత్రిక ఎంచుకున్న వసూళ్ల లక్ష్యం కనీసం 2.94 కోట్లు అన్న మాట. ఈ కరోనా కల్లోలంలో ఇటువంటి ‘పెయిడ్ ఆర్టికల్’ విధానానికి ఎవరు స్పందిస్తారని సంస్థకు చెందిన విలేకరులెవరైనా ప్రశ్నిస్తే బాధ్యులు ఏమంటున్నారో తెలుసా..? ‘కరోనా కాలం…పత్రిక ఆర్థిక పరిస్థితి బాగా లేదు. విలేకరులను తగ్గించాలని పైనుంచి చెబుతున్నారు. ఒకటో, రెండో యాడ్లు చేయకుంటే నిన్ను తీసేయాల్సి ఉంటుందేమో’ అంటూ సరికొత్త పలుకులతో బెదిరిస్తున్నారట.
అర్థమైంది కదా విషయం. అందుకే వార్తా కథనపు లీడ్ పేరాలో అంతటి అసహ్యమైన సామెతను వాడక తప్పలేదు. ఇప్పుడు చెప్పండి కరోనా కక్కుర్తిలోనూ ‘పెయిడ్ ఆర్టికల్’ పద్ధతికి దిగజారిన సదరు పత్రిక యాజమాన్యపు తీరుకు ఎటువంటి సామెతను అన్వయించాలో…? ఔనూ… తన ఔదార్యం గురించి పత్రికలో వార్త రాసినందుకు దాత సదరు పత్రికకు రూ. 20 వేలు చెల్లించే బదులు, అదే మొత్తంతో మరో పది కుటుంబాలకు నెలకు సరిపడా నిత్యావసర సరుకులు సరఫరా చేసే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో తాజా వసూళ్ల టార్గెట్ ఎలా భర్తీ చేయాలో తెలియక సదరు పత్రిక రిపోర్టర్లు బజార్లలో మాస్కేసుకుని మరీ తిరుగుతున్నారట…పాపం.