సంక్షోభాలు, సంబరాలు, ఉత్సవాలు, ఉత్పాతాలు చోటు చేసుకున్నప్పుడు పత్రికలకు చేతి నిండా పని ఉంటుంది. భిన్న కోణాల్లో వార్తలను, వార్తా కథనాలను పాఠకాసక్తికరంగా ఇచ్చేందుకు పోటీ పడుతుంటాయి. పత్రికల్లో కంటెంట్ ఒక ఎత్తయితే, వాటికి ఇచ్చే క్యాప్షన్లు మరో ఎత్తుగా భావిస్తారు. అందుకే సృజనాత్మకమైన, చమత్కారమైన శీర్షికలు ఇచ్చే పాత్రికేయులు ఒక రకమైన గ్లామర్‌ను ఆపాదించుకుంటారు. అట్లా కేవలం శీర్షికలతోనే పత్రికారంగంలో లబ్ధప్రతిష్టులైన వారు ఎందరో వున్నారు. తెలుగు పత్రికల్లో ఉత్తమ శీర్షికల చర్చ రాగానే.. ఐదారుగురు పాత్రికేయులు మాత్రమే తరుచూ చర్చకు వచ్చేది అందుకే.
క్షేత్రస్థాయిలో ఉండే రిపోర్టర్లు కంటెంట్‌ను ముడిసరుకుగా ఇస్తే.. డెస్క్ల్లోని సంపాదక సిబ్బంది వాటికి నగిషీలు చెక్కి, సొబగులు అద్ది అంతిమంగా పాఠకుడిని అలరించే విధంగా తీర్చిదిద్దుతారు. ఆకట్టుకునే శీర్షికలను ఇచ్చే బాధ్యతలనూ ఎక్కువగా వీరే నిర్వర్తిస్తుంటారు. (కొందరు రిపోర్టర్లు కూడా డెస్క్ సిబ్బందికి తీసిపోని విధంగా హెడ్డింగులు పెడుతుంటారు. అది వేరే విషయం) నెట్‌వర్క్‌కు, డెస్క్‌కు వేవ్లెంత్ కుదిరితే తరుచూ అదిరిపోయే శీర్షికలు కనిపిస్తూ ఉంటాయి. సృజనాత్మక శీర్షికల వెనుక ఎంతో మథనం ఉంటుంది. మరెంతో కసరత్తు ఉంటుంది. కంటెంట్‌లోని భావాన్ని మూడు, నాలుగు పదాల్లో ఆవిష్కరించడం వెనుక యజ్ఞం లాంటి శ్రమ వుంటుంది. సాహిత్యమూ, కవిత్వమూ ఒంటబట్టిన వారు, వాటిలో అభినివేశం ఉన్న వారు ఇచ్చే శీర్షికలు పేలిపోతాయి. ఆంత్యప్రాసలతో మురిపిస్తాయి. ఒకేపదంలో రెండు భావాలను మోసుకువచ్చి అబ్బురపరుస్తాయి. నిషాలో ముంచెత్తుతాయి. ఔరా.. అని సంబ్రమాశ్చర్యాలను కలిగిస్తాయి.
నిత్య ప్రవాహం లాంటి భాషతో మమేకమవుతూ కొత్త పదాలను ఒడిసిపట్టుకోవడం ద్వారా, సాహిత్యాన్ని ప్రేమించడం ద్వారా ఉత్తమ శీర్షికలను ఇచ్చే ప్రయత్నం చేయవచ్చు. వ్యంగ్యం, చమత్కారంతో కూడిన శీర్షికలు ప్రజలు, పాఠకుల హృదయాలను తాకగలుగుతాయి. ఒక్కోసారి అవి ప్లకార్డులపైన, గోడలపైన నినాదాలుగా మారుతాయి. మానవీయ కథనాలకైతే భావస్ఫోరకమైన శీర్షికలు ప్రాణప్రదంగా నిలుస్తాయి. ప్రజల వ్యవహారికభాషలో, మాండలిక పదాలతో ఇచ్చే శీర్షికలు సజీవంగా ఉంటాయి. కేవలం సృజనాత్మక శీర్షికలతోనే కథనాలు గొప్పవిగా మారిన దృష్టాంతాలు ఎన్నో.
డెస్క్‌ల్లో కాలం కత్తిమొనపై నడిచే సంపాదక సిబ్బంది… తీవ్రమైన మథనంతో డెడ్‌లైన్ టైమ్ పరిమితుల్లో బెస్ట్ క్యాప్షన్ ఇస్తారు. డెడ్‌లైన్ ముగిసి, పేజీలు రిలీజైన తర్వాత అంతకంటే ఇంకా మంచి క్యాప్షన్ స్ఫురించినా చేసేదేమీ ఉండదు. కాబట్టి పత్రికల్లో వచ్చిన అనేకానేక గొప్ప శీర్షికలు… డెస్క్ల్లోని పాత్రికేయుల మస్తిష్కంలో జరిగే అంత్యరుద్ధం సాక్షిగా చివరి నిమిషం వరకు మారుతూ వచ్చినవి గానే గుర్తించాలి. క్యాచీ హెడ్డింగ్స్ కోసం ఇంగ్లిషు పత్రికలు స్పెషల్ టీమ్‌ను పెట్టుకుంటాయని, గ్రూప్ డిస్కషన్స్‌తో వారు ఉత్తమ శీర్షికలను ఖరారు చేస్తారని చెబుతారు. తెలుగు పత్రికల్లో ఈ తరహా పరిస్థితి కనిపించదు. అయినా అద్భుతమైన శీర్షికలు తళుక్కుమంటుండటం తెలుగు పాత్రికేయుల గొప్పతనం.
అయితే పత్రికల్లో శీర్షికల సృష్టికర్తలు పాఠకలోకంలో ఎప్పుడూ అనామకంగానే మిగిలిపోతుంటారు. బైలైన్ల ద్వారా వార్తా కథనాలు రాసిన రిపోర్టర్లను గుర్తించవచ్చు గాని, ఆ కథనాలకు అద్భుతమైన శీర్షికలు పెట్టిందెవరో తెలుసుకునే అవకాశం మాత్రం ఇప్పటివరకైతే లేదు. భవిష్యత్తులో క్యాప్షన్ రైటర్ పేరును కూడా ప్రచురించే రోజులు వస్తాయేమో చూడాలి. అయితే క్యాచీ హెడ్డింగ్స్ వచ్చినప్పుడు వాటి సృష్టికర్తల పేర్లు సంస్థాగతంగా, జర్నలిస్టు సర్కిళ్లలో ప్రశంసల వర్షంలో తడిసిపోతూ గొప్ప ఉత్సాహంగా, ప్రోత్సాహంగా నిలుస్తాయి. ప్రభుత్వాలు కూడా బెస్ట్ రిపోర్టింగ్ అవార్డు ఇచ్చినట్టే, బెస్ట్ క్యాప్షన్ అవార్డు ఇచ్చే అవకాశాల్ని పరిశీలించాలి.
ఇప్పుడీ చర్చంతా ఎందుకుంటే ఇది కరోనా కాలం కనుక. గత మార్చి నెలతో పోల్చుకుంటే ఏప్రిల్ నెల పూర్తిగా కరోనా మహమ్మారికి అర్పితమై పోయింది. ప్రపంచమంతా ఒక ఉత్పాతాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో… దానిని అధిగమించే యజ్ఞంలో పత్రికలు అద్భుతమైన పాత్ర పోషిస్తున్నాయి. ఈ క్రమంలో గత నెల రోజుల ప్రధాన స్రవంతి పత్రికలను శీర్షికల కోణంలో పరిశీలించినప్పుడు… కొన్ని తళుక్కుమని అలరించాయి. అయితే ఒకే అంశంపై నెలన్నర రోజులుగా వార్తా కథనాల్ని ఇస్తున్నప్పుడు తరుచూ గొప్ప శీర్షికలు రావాలని కోరుకోవడం అత్యాశే అవుతుంది. పైగా ఒకే అంశం అప్డేట్స్తో రిపీట్ అవుతుంటుంది కాబట్టి, స్ట్రెయిట్ ఫార్వర్డ్ గానే శీర్షికలు వస్తుంటాయి.
జనతా కర్ఫ్యూకు కొంచెం అటూ ఇటూగా పత్రికల్లో కరోనా శకం ఆరంభమైంది. శీర్షికల్లో కరోనా అనే పదం నానింతగా ఇంతవరకు మరే పదమూ నానినట్టుగా కనిపించదు. ‘ఫికర్మత్ కరోనా’, ‘బంద్ కరోనా’ ‘ఐసా కరోనా’ ‘బిజినెస్ కరోనా’, ‘క్యా కరోనా’, ‘భయంకరోనా’.. ఇలా ఎన్ని విధాలుగా తగలాలో అన్ని విధాలుగా తగిలింది. అలాగే లాక్డౌన్ పదం కూడా. ‘బతుకులు లాక్డౌన్’, ‘ఆశలు లాక్డౌన్, ‘క్రైం డౌన్, ‘లాక్ బ్రేక్’, ‘లాకులెత్తారు’, ‘గుడ్ లాక్’.. ఇలా ఎన్ని విధాల లాక్ కావొచ్చో అన్ని విధాలా అయింది. ఏప్రిల్ నెలలో ప్రధాన స్రవంతి పత్రికల్లో మెరిసిన కొన్ని శీర్షికలు..
– గుడ్‌లాక్
– కష్టాల ‘నెల’వు
– ‘మహా’మ్మారి
– ఢిల్లీ నుంచే తాజా తొల్లి
– అమెరి‘గన్స్’
– వలస కూలీ.. బతుకు కూలి…
– కరోనా ఖేల్.. రియల్ కుదేల్…
– ఉద్యోగుల ‘వెత’నాలు
కరోనా కథనాలను పక్కన పెడితే, ఇతర అంశాలకు సంబంధించి కూడా కొన్ని శీర్షికలు తళుక్కుమన్నాయి. అవి…
– దేశానికే గరిశె.. తెలంగాణ మురిసె
– మెతుకు సీమన ఎగిసి.. బతుకు జల్లుగ కురిసి…
– తెలంగాణ పంట పండె
– దండిగా ధాన్యం.. ఇక్కట్లు తీరిస్తే ధన్యం..
పత్రికల్లో శీర్షికారచన అనేది డెడ్‌లైన్ పరిమితుల్లో సాగే సృజన. మొదటి పేజీకి అద్భుతమైన శక్తిని ఇచ్చే ప్రక్రియ. అది పత్రిక కంటెంట్‌కు వ్యాల్యూ అడిషన్ చేస్తుంది. తనవైపు చూసిన పాఠకుడి దృష్టిని మరలిపోకుండా కట్టివేయగలుగుతుంది. కథనరంగం లోలోపలికి తీసుకువెళ్లుతుంది. ఒక పరిణామం, ఒక సంఘటన సమాచారాన్ని అన్ని పత్రికలు ఒకే అర్థంలో ఇవ్వవచ్చునేమో గానీ, ఆ అందరిలో తమ అస్తిత్వాన్ని మాత్రం సృజనాత్మక శీర్షికల ద్వారానే భిన్నంగా చాటుకోగలుగుతాయి. ఎవరికైనా సౌందర్యమంటే మొదట అందమైన తలే కదా. పత్రికలకు హెడ్డింగ్సూ అలాగే మరి.
“ప్రపంచ క్యాప్షన్స్ రైటర్ లారా… అలసిపోకండి. పెన్నాడితే పోయేదేమీ లేదు లోలోపలి పెనుగులాట తప్ప!!”
– శంకర్ శెంకేసి